అర్జున్ రెడ్డి సంచలన చిత్రం

విడుదలకు ముందే అర్జున్ రెడ్డి చిత్రం సంచలనం సృష్టించింది. దేవరకొండ విజయ్ అర్జున్ రెడ్డి పాత్రలో నటించిన ఈ చిత్రానికి వంగా సందీప్ రెడ్డి దర్శకుడు.

Arjun Reddyదేవరకొండ మెడికో. మంచి చదువరి. కానీ అతనికున్నదల్లా ఓ సమస్య. అతనికున్న టెంపర్ ఇంతా అంతా కాదు. దాన్ని నియంత్రించుకోలేపోతుంటాడు. అతను ఓసారి తోటి విద్యార్థితో గొడవపడతాడు. ఆ గొడవలో కాలేజీ ప్రిన్సిపాల్ క్షమాపణలు చెప్తూ ఓ ఉత్తరం రాసి ఇమ్మంటాడు. అలా రాసి ఇవ్వలేని పక్షంలో కాలేజీ విడిచిపెట్టి వెళ్ళిపొమ్మంటాడు. అయితే అతను కాలేజీ నుంచి వెళ్ళిపోవడానికే నిర్ణయించుకుంటాడు. ఇంతలో ఆ కాలేజీకి కొత్తగా వచ్చిన అమ్మాయి ప్రీతి (షాలిని పాండే)ని చూసి అతను మనసు మార్చుకుంటాడు. అది అతనికి తొలి ప్రేమ. మరో మాటలో చెప్పాలంటే లవ్ అట్ ఫస్ట్ సైట్ అనుకోవచ్చు. ఆ అమ్మాయి కోసం కాలేజీలో చదువు కొనసాగించాలనుకుంటాడు. మరోవైపు అనుకోకుండా ఆ అమ్మాయి తన అనుభూతులను, అభిప్రాయాలను అతనితో పంచుకుంటుంది. దాంతో వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇంతలో అతని తల్లిదండ్రులు అతని సోదరుడు పెళ్ళితో బిజీగా ఉంటారు. ఉండబట్టలేక అతను ప్రీతి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. కానీ అమ్మాయి తల్లిదండ్రులు అతనికిచ్చి పెళ్ళి చేయడానికి ససేమిరా అంటారు. దాంతో అమ్మాయికి మరొకరితో పెళ్ళవుతుంది. అతను నిరాశకు లోనవుతాడు. తండ్రితో గొడవపడతాడు. ఇల్లు విడిచిపెట్టి పొమ్మంటాడు తండ్రి. ఈ ఘర్షణతో అతను మద్యానికి బానిస అవుతాడు. అర్థరహిత సంబంధాలు పెట్టుకుంటాడు. ఈ క్రమంలో అతనెలా మారాడు….ప్రీతి పట్ల అతని ప్రేమ ఏమైంది వంటివన్నీ తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

దర్శకుడు సందీప్ రెడ్డి కథనాన్ని నడిపించిన తీరు చాలా బాగుంది. ఇది దేవ్ డి అనే హిందీ చిత్రాన్ని తలపించినా ఇది పూర్తిగా భిన్నమైన నడకలో సాగిన చిత్రం. ఈ చిత్రంలో కాలేజీ సన్నివేశాలు హృద్యంగా ఉన్నాయి. గతాన్ని, వర్తమానాన్ని దర్శకుడు ఆసక్తికరంగా నడిపించాడు. అందుకు ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పవచ్చు. ఈ చిత్రంలో ప్రత్యేకించి కామెడీ ట్రాక్ లేదు. అలాగే పాటలు కూడా కథతో పాటే సాగుతుంది. అందుకే ఈ చిత్రాన్ని చూసిన వారందరూ దర్శకుడి సాహసానికి జీహుజూర్ అంటున్నారు.

ఒక్కమాటలో చెప్పాలంటే ఈ చిత్రం పూర్తిగా విజయ్ దేవరకొండకు చెందినది అనడంలో సందేహం లేదు. అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ వందశాతం కమిట్ మెంట్ తో నటించాడు అనడానికి కూడా ఆలోచించక్కర్లేదు. అతను నూటికి నూరు శాతం ఆ పాత్రకు జీవం పోశాడు. అతని నటనను చూసిన వారెవరైనా భవిష్యత్తులో గొప్పగా రాణిస్తాడని చెప్తున్నారు. అతను నటించిన చిత్రాలు తక్కువే అయినప్పటికీ ఎంతో అనుభవమున్న నటుడిలా నటించడం గమనించదగ్గ అంశం.

విజయ్ మిత్రుడిగా రాహుల్ రామకృష్ణ కూడా చక్కగా నటించాడు. అతని డైలాగ్ డెలివరీ చాలా సహజంగా ఉంది. ఎక్కడా బలవంతంగా చెప్పినట్లు అనిపించదు.
కమల్ కామరాజు, సంజయ్ స్వరూప్ తదితరులు కూడా బాగానే నటించారు. బామ్మ పాత్రలో అలనాటి హీరోయిన్ కాంచన నటించడం విశేషం. షాలిని పాండేకిది తొలి చిత్రం కావడం గమనార్హం. ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందనే చెప్పుకోవాలి.

సందీప్ మాటలు బాగున్నాయి.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు రాధన్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి.

ద్వితీయార్థంలో కాస్త రబ్బర్ లా సాగినట్టు అనిపిస్తుంది. ఏదేమైనా దర్శకుడి ప్రతిభను మెచ్చుకోక తప్పదు. అతనికి ఇదే తొలి చిత్రం.

మొత్తం మీద ఈ చిత్రం చూడదగ్గదే అనడానికి ఆలోచించక్కర్లేదు.

Send a Comment

Your email address will not be published.