అవన్నీ వొట్టి మాటలే

అన్నయ్య భార్యను నటి రంభ వేధించింది…. ఆ వేధింపు అలాంటి ఇలాంటి వేధింపు కాదు….. వరకట్న వేధింపు…అని రకరకాలా వార్తలు సినీ పరిశ్రమలో గుప్పుమన్నాయి. కలకలం రేపాయి. ఈ క్రమంలో ఒక తమిళ పత్రిక నిజానిజాలు తెలుసుకుందామని రంభ కోసం గాలించింది. అయితే ఆమె కెనడాలో ఉన్నట్టు తెలిసింది. దానితో ఆ పత్రిక వారు రంభ సోదరుడు శ్రీనివాసన్ ను కలిసింది. ఆయన చెప్పిన విషయాల్లోకి వెళ్దాం…

“మాకు పెళ్లై పదిహేనేళ్ళు పైనే అయ్యింది. ఇన్నేళ్ళ తర్వాత కట్నం కోసం మా మధ్య గొడవలా? మీరే చెప్పండి… నా చెల్లెలు (రంభ) పెళ్లి అయినప్పటి నుంచి నాలుగేళ్ళుగా కెనడాలోనే ఉంది. ఆమె ఇండియాకి రానే లేదు. నేను అబద్ధం చెప్తున్నాను అని మీకు అనిపిస్తే పాస్ పోర్ట్ అబద్ధం చెప్పదు కదండీ. మీరు కావాలంటే ఆరా తీసి ఆ వివరాలు తెలుసుకోవచ్చు. ఇందులో దాచడానికి ఏమీ లేదు. అంత ఓపెనే. ఇండియాకే రాని నా చెల్లెలు ఎలా సార్ నా భార్యను కట్నం కోసం వేధిస్తుంది.

ఇది మా కుటుంబ సమస్య. మా పెళ్ళికి లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసిందే నా చెల్లెలు. అటువంటి చెల్లెలి మీద ఆరోపణలు చేసే వారిని నేను ఏమనాలి? డిసెంబర్ 12వ తేదీ నేను కెనడా వెళ్లాను. అక్కడ నేను నా చెల్లెలు ఇంట్లోనే ఉన్నాను. నా పిల్లలు, భార్య వాళ్ళ బంధువుల ఇంట హైదరాబాదులో ఉన్నారు. డిసెంబర్ లో కెనడా వెళ్ళిన నేను తిరిగి ఫిబ్రవరిలో ఇండియా వచ్చాను.

నేను కెనడాలో ఉన్నప్పుడు నా భార్య పల్లవి, వాళ్ళ అమ్మ, విజయలక్ష్మి, ఆమె అన్నయ్య రవికిరణ్, ఆయన భార్య మా ఇంటికి వెళ్ళారు. అప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. బీరువా, పెట్టెలో ఉన్న నగలన్నింటినీ తీసుకెళ్ళిపోయారు. మరుసటి రోజు మా నాన్న నాకు ఫోన్ చేసి ఇల్లంతా చిందరవందరగా ఉందిరా అన్నారు. వెంటనే నేను బీరువా, పెట్టెలు చెక్ చెయ్యమని చెప్పాను. ఆయన అవన్నీ చెక్ చేసి నగానట్రా ఏవీ కనిపించడం లేదురా అన్నారు. అయితే ఆలస్యం చెయ్యకుండా పోలీసులకు ఫిర్యాదు చెయ్యమన్నాను. సరేనని ఆయన వడపళని (చెన్నై) పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసారు. మా ఫిర్యాదు నాలుగో తేదీన నమోదైంది. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టడంతో భయపడిన వాళ్ళు హైదరాబాదులో మాపై ఒక ఫిర్యాదు నమోదు చేయించారు. ఆ ఫిర్యాదు పదవ తేదీన నమోదైంది. నిజం చెప్పాలంటే మా ఫిర్యాదే వారి ఫిర్యాదు కన్నా ముందు నమోదైంది. ఈ విషయాన్ని దాచే ప్రయత్నంలో వాళ్ళు రంభ దారుణానికి పాల్పడినట్లు అబద్ధాలు చెప్పి కట్టుకథలు అల్లి సమస్యను పక్క దారి పట్టిస్తున్నారు.

ఇంట్లో నగలు వగైరా తీసుకెళ్ళింది ఎవరో బయటి వారు కాదు. నా భార్య బంధువులే తీసుకువెళ్ళి ఎస్కేప్ అయ్యారు. ఈ వ్యవహారంలో నగలు తీసిన వారికి నా భార్య సహకరించింది. నేను నా భార్యను నమ్మాలి కదండీ.

అంతకుముందు నా భార్య పల్లవి బంధువులు ఇలాంటి చోరీ చేసారు. అయితే ఆ విషయం బయటకు రానివ్వకుండా నలుగురం మాట్లాడుకుని సరిచేసాము. కానీ ఇప్పుడు ఈ చోరీ విషయం ఇంటి గడప దాటి వీధిలోకి వచ్చింది.

ఈ సమస్య అంతటికీ నా భార్య పల్లవి అమ్మ, అన్నయ్యా కారణం. వాళ్ళిద్దరూ కలిసి నా భార్యను తప్పుదారి పట్టించి మాపైకి రెచ్చగొట్టేలా చేసారు. వాళ్ళ మాటలు విని నా భార్య తప్పు చేస్తోంది. వాళ్ళు ఆడుతున్న నాటకంలో పావైంది.

అయినా ఇప్పటికీ నేను నా భార్యతో కలిసి కాపురం చెయ్యడానికి సిద్ధంగానే ఉన్నాను. మేము భార్యా భర్తలం. కలిసి జీవించాలి. మాకు ఇద్దరు కొడుకులు. కానీ పల్లవి కుటుంబం అలా మేము కలిసి ఉండాలని కోరుకోవడం లేదు. మా డబ్బులు తీసుకుని ఎదురు మాపైనే ఫిర్యాదు చేసారు. ఇది న్యాయమేనా మీరే చెప్పండి?” అని రంభ సోదరుడు శ్రీనివాసన్ చెప్పుకొచ్చారు.

ఇలా ఉండగా ఆ తమిళ పత్రిక వారు రంభ సోదరుడి భార్య పల్లవి ఇంటివారిని కలిసి వివరాలు తెలుసుకుందామని ప్రయత్నించారు కానీ వాళ్ళతో కలయిక కుదరలేదు. వాళ్ళసలు అందుబాటులో లేకుండాపోయారు.

Send a Comment

Your email address will not be published.