అసెంబ్లీ రౌడీకి పాతికేళ్ళు

“అసెంబ్లీ రౌడీ సినిమా విషయంలో చాలా మంది నన్ను హెచ్చరించినా నేను ముందుకి సాగాను….ఈ చిత్రంలో దివ్యభారతి నటించింది. ఆమెను కథానాయికగా ఎంచుకున్నప్పుడు కూడా ఆమె గురించి చాలా మంది మాట్లాడుతూ షూటింగ్ కి టైం కి రాదన్నారు. అలాగే ఇంకా ఏవేవో అన్నారు. కానీ నేను అవి పట్టించుకోలేదు. వాటిని నమ్మలేదు. ఆమెతో మాట్లాడి ఈ చిత్రంలో నటించమని అడిగాను. ఒప్పుకుంది… అంతేకాదు, అసెంబ్లీ రౌడీ అని టైటిల్ విషయంలోనూ చాలా మంది రాజకీయనాయకులు అభ్యంతరాలు చెప్పారు. రాజకీయ నాయకులందరికీ సినిమా చూపించాను. అప్పుడు వాళ్ళు అది మంచి సినిమా అని ఒప్పుకున్నారు. చాలా సెంటర్స్ లో ఈ చిత్రం 25 వారాలు ఆడటం గొప్ప విషయం” అని హీరో మంచు మోహన్ బాబు చెప్పారు.

ఇంతకూ మోహన్ బాబు ఇప్పుడీ చిత్రం మీద మాట్లాడటానికి కారణం ఈ చిత్రాన్నికి 25 ఏళ్ళు కావడమే.

అసెంబ్లీ రౌడీ చిత్రం 1991 లో వచ్చింది. ఈ చిత్రానికి దర్శకులు బీ గోపాల్. నిర్మాత మోహన్ బాబు.

మోహన్ బాబు, దివ్యభారతి, గొల్లపూడి మారుతీ రావు, జగ్గయ్య, అన్నపూర్ణ, మోహన్ రాజ్, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం తదితరులు నటించారు.
1990 లో తమిళంలో వచ్చిన “వేలై కిడచ్చిడిచ్చు” అనే తమిళ చిత్రానికి ఇది రిమేక్. ఆ తర్వాత హిందీలోను ఈ చిత్రాన్ని తీసారు. 1996 లో లోఫర్ అనే టైటిల్ తో హిందీలో వచ్చింది. హిందీలో అనిల్ కపూర్, జుహీ చావ్లా నటించారు.

మోహన్ బాబు తండ్రిగా జగ్గయ్య నటించారు. మోహన్ బాబు టైం ని వృధా చేస్తూ అప్లై చేసుకున్న ఉద్యోగాలకు దూరమవుతారు. అది తండ్రికి కోపం తెప్పిస్తుంది. జగ్గయ్య సైన్స్ టీచర్ గా నటించారు. ఒక రోజు మోహన్ బాబు ఓ హత్యను చూస్తారు. అంతేకాదు, తల్లి అన్నపూర్ణ తలకు గాయం అవుతుంది. దీనిపై చట్టపరమైన చర్యకు దిగుతారు. ఇంతలో ఆయన పై ఓ నేరం మోపుతారు. అప్పుడు అతని తల్లిదండ్రులు కోర్టులో నిజం చెప్పమని గ్రామస్తులను వేడుకుంటారు.
అయితే ఆ ఊళ్ళో ఉన్న ఒకడు గ్రామస్తులను బెదిరించి అబద్ధం చెప్పమంటాడు. దానితో మోహన్ బాబు జైలుపాలవుతారు.

కొంతకాలానికి తల్లిదండ్రుల సాయంతో మోహన్ బాబు ఎమ్మెల్యే అవుతారు. ఇది అతని ప్రత్యర్ధి మోహన్ రాజ్ కు గిట్టదు. తన కుటుంబంపై దాడి చేయడంతో మోహన్ బాబు డాన్ ను అరెస్ట్ చేయిస్తారు. అంతేకాదు, డాన్ కుట్రలను ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఉంటారు. మోహన్ రాజ్ కు కోపం వచ్చి మోహన్ బాబు పెద్దలను చంపుతాడు. ఆ తర్వాత మోహన్ బాబు డాన్ ను ఎదుర్కోవడమే కాకుండా ఎమ్మెల్యేగా గ్రామస్థులందరినీ కాపాడుతానని హామీ ఇస్తారు. టూకీగా ఇదే అసెంబ్లీ రౌడీ కథ.

ఈ చిత్రానికి పీ వాసు కథ సమకూర్చగా పరుచూరి సోదరులు మాటలు రాసారు.
ఈ చిత్రంలో మొత్తం అయిదు పాటలు ఉన్నాయి….జేసుదాస్, ఎస్ పీ బాలసుబ్రమణ్యం, చిత్ర, పాటలు పాడారు. సంగీతం కె వీ మహాదేవన్.
—————————–
జయా

Send a Comment

Your email address will not be published.