ఆంధ్రుల చలవే

“ఏం చెయ్యమంటారు చెప్పండి? హీరోయిన్స్ అనగానే రొమాన్స్ సీన్లకే పరిమితం అనుకుంటున్నారు….నాకు కామెడీ రోల్ లేదా ఫైట్ రోల్ ఇచ్చినా చెయ్యడానికి రెడీ ” అంటున్నారు సమంతా.

“దాదాపుగా దర్శకులందరూ మీలాగా రొమాన్స్ సీన్లలో నటించే కథానాయికలు మరెవరూ లేరు అని అనుకుంటున్నారు కదా” అన్న ప్రశ్నకు ప్రముఖ నటి సమంతా పైవిధంగా జవాబిచ్చారు. ఎలాంటి పాత్ర ఇచ్చినా నటించడానికి సిద్ధమే కానీ ఏం చెయ్యను? ఎంతసేపూ రొమాన్స్ పాత్రలే వస్తున్నాయని ఆమె అన్నారు.

actress samanthaఏ సినిమాకైనా డబ్బులు తీసుకునే నటిస్తున్నాం….ఒకేలాంటి రొమాన్స్ పాత్రలలో నటించే అవకాశాలే వస్తున్నాయని, అయినప్పటికీ వీలున్నంత వరకు ఏదో ఒక కొత్తదనం చూపించడానికి నటించక తప్పదని, ఓ ప్రేమ సన్నివేశంలో ఓ నిజమైన ప్రేమను, అలాగే రొమాంటిక్ సన్నివేశంలో ఓ నిజమైన రొమాన్స్ ని ప్రదర్శించడం తప్పడం లేదన్నారు సమంతా.

తమిళంలో కన్నా తెలుగులోనే తాను ఎక్కువ విజయాన్ని అందుకున్నానని, అయినప్పటికీ తమిళంలో పెద్ద హీరోలతోనే నటిస్తున్నానని, ఈ విషయంలో ఎలాంటి సెట్ బ్యాక్ లేదని అన్నారు.

సినిమా విజయం సాధించడంలో అందులో నటించే వారి కన్నా ప్రేక్షకుల చేతుల్లోనే ఆ విజయం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఓ సినిమా గెలుపోటములు నటీనటుల చేతుల్లో కన్నా ప్రేక్షకుల చేతుల్లో ఉంటుందని, నటీనటులు చేయగలిగినదంతా నటించడమే అని అన్నారు. విక్రం కుమార్ దర్శకత్వంలో రూపొందిన “24” అనే చిత్రం తప్పకుండా హిట్ కొడుతుందని, తనకు ఆ చిత్రంతో ఓ కొత్త గుర్తింపు వస్తుందని సమంతా ఆశాభావం వ్యక్తం చేసారు.

ఏవైనా అవకాశాలు చేజారిపోయాయని అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు ఆమె జవాబిస్తూ “అలాంటిదేమీ లేదు. నేను ఒక కథ విన్న తర్వాత ఆ చిత్రం నా చేతులు దాటిపోకూడదు అనుకున్న తర్వాత ఇప్పటివరకూ అలా దాటిపోయిన సందర్భాలు లేవు. నేను ఫలానా సినిమా చెయ్యాలి అనుకున్నప్పుడు ఎప్పుడూ అది జరగకుండా పోవడం అనేది లేదు. అనుకున్నది అనుకున్నట్టే జరుగుతోంది ఇప్పటి వరకు” అన్నారు.

“నేను నటించిన చిత్రాలలో ఒకటి రెండు సరిగ్గా లేవు అనే టాక్ రావడం నాకు తెలుసు. అంతమాత్రాన నేను బాధపడను. ఎవరో పది మంది అలా అంటారు. మిగిలిన 90 శాతం మంది నన్ను అంటే నా నటనను కోరుతున్నారుగా. అది చాలు. అది అదృష్టం కాదా? అయినా నేను హార్డ్ వర్క్ చేస్తాను. పనికి జడిసే దానిని కాను. అయినా నాకు కాస్తంత అందం లేకపోలేదు. సక్సెస్ రోడ్డు కన్నా నా నమ్మకం పెద్దది. అదే ఇప్పటికి నేను నమ్ముతున్నాను. నేను అనుకున్న దానికన్నా అందంగా ఉన్నానని ఎవరైనా అంటే వారికి థాంక్స్. నేను తమిళ అమ్మాయి అయినా తెలుగులోనే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. నాకు రెండు రాష్ట్రాలూ ఒక్కటే, తమిళనాట కన్నా ఆంధ్రాకి వచ్చిన తరవాతే నేను గుర్తింపు పొందిన హీరోయిన్ అయ్యాను. ఇంతటి భాగ్యం కల్పించిన తెలుగు వాళ్లకు ధన్యవాదాలు. తెలుగువారి వల్లే నేను ఈ స్థాయికి ఎదిగాను. అయినా ఆంధ్రా నుంచి చెన్నై వెళ్తున్నప్పుడు ఆ ఫీలింగే వేరు. అది మరచిపోలేని అనుభూతి. ఆనందం” అని సమంతా తన మనోగతాన్ని చెప్పారు.

Send a Comment

Your email address will not be published.