ఆనందో బ్రహ్మ - ఇక లేరు

గత మూడు దశాబ్దాలుగా తెలుగు సినీ వినీలాకాశంలో ధ్రువ తారగా వెలిగొంది హాస్యపు జల్లులు తెలుగు వారందరికీ  తనదైన శైలిలో కురిపించిన ధర్మవరపు సుబ్రహమణ్యం ఇక లేరంటే నమ్మశక్యం కావడం లేదు.  ప్రకాశం జిల్లా కొమ్మినేని పాలెంలో పుట్టి చిన్నప్పటి నుండీ నవ్వుల పువ్వులు రువ్వించి తెలుగుదనానికి సరిక్రొత్త హాస్యపు అందాలు సృష్టించిన శ్రీ సుబ్రహ్మణ్యం కొంత కాలంగా లంగ్ కాన్సర్ తో బాధ పడుతున్నారు.  శనివారం రాత్రి  హైదరాబాదు లోని దిల్సుఖ్ నగర్ లోని ఒక ప్రైవేటు వైద్యశాలలో తుది శ్వాస విడిచారు.  ఆయనకు భార్య మరియు ఇరువురు కుమారులున్నారు.

శ్రీ సుబ్రహ్మణ్యం గారు షుమారు 870 చిత్రాల్లో నటించడం విశేషం.  వారు ‘తోకలేని పిట్ట’ చిత్రానికి దర్సకత్వం కూడా వహించారు.  ‘ఆనందో బ్రహ్మ’, జయమ్ము నిశ్చయమ్మురా’, ‘అనగనగా ఒక శోభ’, ‘బుచ్చిబాబు’ వంటి సీరియల్స్ ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి.  ప్రముఖ సినీ దర్శకులు శ్రీ జంధ్యాల గారితో శ్రీ సుబ్రహ్మణ్యం గారి అనుబంధం చాలా గొప్పది.  ఇద్దరూ హాస్య ప్రియులు.  ఇద్దరూ రచయితలూ కూడా.

ఎక్కడా అశ్లీలానికి త్రోవ లేకుండా తెలుగు సినీ రంగంలో నవ్వులు పండిస్తూ తోటి కళాకారులతో దీటుగా నిలబడ్డారు.  డైలాగులు చెప్పడంలో పద ఉచ్చారణలో తెలుగు శోభకు క్రొత్త వన్నె తెచ్చిన శ్రీ సుబ్రహ్మణ్యం గారు ఆయనకంటూ ఒక శైలిని సృష్టించుకున్నారు.

శ్రీ సుబ్రహ్మణ్యం గారు చెప్పిన కొన్ని డైలాగులు “పంచ్ డైలాగులు” గా మారి తెలుగువాని ప్రతీ నోట సమయానుకూలంగా వాడడం ప్రతీతి.  ముఖ్యంగా ఒక్కడు చిత్రంలో చెప్పిన ‘నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్..’ ఎంతో ప్రజాదరణ పొంది వారికి మంచి పేరు తెచ్చిపెట్టింది.  ఇది ఒక మచ్చు తునక మాత్రమే, ఇలాంటివి ఎన్నో డైలాగులు, పాత్రాలు తెలుగువారి గుండెల్లో ముద్ర వేసుకోవడం వారి గొప్ప తనానికి నిదర్శనం.

మెల్బోర్న్ లో…

2008 లో  శ్రీ సుబ్రహ్మణ్యం గారు మెల్బోర్న్ మహా నగరాన్ని తెలుగు సంఘం ఆహ్వానం మేరకు విచ్చేసి తన జీవిత అనుభవాలను 45 నిమిషాల ప్రసంగంలో పంచుకున్నారు.  వారు ఎన్నో దేశాలు వెళ్ళినా మెల్బోర్న్ నగరంలో తెలుగు వారు చూపిన ఆతిధ్యానికి ఎంతో ముగ్దులై నట్లు పేర్కొన్నారు.  మెల్బోర్న్ అందాలను ఇక్కడ తెలుగు వారి జీవన విధానాన్ని కొనియాడుతూ తన కవితా గానామృతంతో ప్రేక్షకుల హృదయాల్ని మంత్ర ముగ్దులను చేశారు.

 నవ్వుల ధర్మం ఒక వరం…

తన పేరులో వున్న నవ్వుల ధర్మాన్ని వరంగా తెలుగువారందరికీ పంచి ఇవ్వడం తుది శ్వాస వరకూ తన పంథాని ఒకే శైలిలో అవిచ్చన్నంగా కొనసాగించడం ఎంతో గౌరవనీయమైనది. వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో మనో ధైర్యం కలగాలనీ తెలుగుమల్లి కోరుకుంటోంది.

Send a Comment

Your email address will not be published.