ఆయన ఆయనే...

ఎస్వీ రంగారావు నిండైన విగ్రహానికి పెట్టింది పేరు. ఆయనలో నటుడికి ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి.

1918 జూలై మూడున కృష్ణా జిల్లాలో జన్మించారు. 1974 జూలై 18న చెన్నైలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.

ఆయనను అందరూ ఎస్వీఆర్, విశ్వనట చక్రవర్తి అని పిలిచే వారు.

ఆయన తల్లిదండ్రులు లక్ష్మీనరసాయమ్మ, కోటేశ్వర రావు. ఆయన భార్య పేరు లీలావతి. 1947 డిసెంబర్ 27న ఆయన వివాహమైంది.

బీఎస్సీ ప్యాస్ అయిన తర్వాత ఆయనకు ఫైర్ సర్వీస్ లో ఉద్యోగమొచ్చింది. అయితే ఆయనలో అప్పట్లో రెండు ఆలోచనలు మెదిలాయి. అవి – ఎమ్మెస్సీ చదవాలా లేక డ్రామాల్లో, సినిమాల్లో చురుకైన పాత్ర పోషించాలా అని.

తమ బంధువు బీ వీ రామనాధం అనే ఆయన తాము తీసిన వరూధిని అనే చిత్రంలో హీరో పాత్రకు ఎస్వీఆర్ ను ఎంపిక చేయడంతో ఆయన ఉద్యోగం వద్దనుకుని నటనకు రైట్ చెప్పారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమా తర్వాత జెంషెడ్ పూర్ వెళ్లి అక్కడ టా టా సంస్థలో ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత తిరిగి ఆయన నటనకు చేరువయ్యారు. అటు తెలుగులోనే కాకుండా తమిళంలోనూ ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు.

మాయాబజార్ చిత్రంలో ఆయన ఘటోత్కచుడు పాత్రలో నటించి యెనలేని పేరుప్రఖ్యాతులు సంపాదించారు. నేపాలి మాంత్రికుడు (పాతాల భైరవి) పాత్రలో ఎస్వీఆర్ నటించిన తీరుకు వందకు రెండు వందల మార్కులు లభించాయంటే అతిశయోక్తి కాదు. అలాగే నర్తనశాలలో కీచక పాత్రకు కూడా. ఈ కీచక పాత్రకే ఆయనకు ఇండోనేషియాలో నిర్వహించిన ఫిలిం ఫెస్టివల్ లో అంతర్జాతీయ అవార్డు కూడా దక్కింది.

బాంధవ్యాలు, చదరంగం, నాదీ ఆడ జన్మ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో పని చేసిన ఒక మిత్రుడి ద్వారా ఫైర్ ఆర్మ్ లో మక్కువ పెంచుకున్న ఎస్వీఆర్ ఒకమారు వేటకు వెళ్ళినప్పుడు ఒక జింక మీదకు గన్ లక్ష్యంగా చేసారు. అది ఆయన చేతిలో ఉన్న గన్ ని చూసి పరుగెత్తడం మొదలు పెట్టింది ప్రాణాలు కాపాడుకోవడానికి. అయితే కొంత దూరం వెళ్ళిన ఆ జింక ఒక చోట ఆగిపోయి నన్ను కాల్చి చంపడం వల్ల నీకు ఏమొస్తుంది అన్నట్టుగా ఎస్వీఆర్ వంక చూసిందట. దాని కళ్ళ వంక చూసిన ఎస్వీఆర్ ఆ క్షణంలోనే వేట అనే దానికి స్వస్తి చెప్పి వెనక్కు తిరిగొచ్చేసారట.

ఎస్వీఆర్ విద్యాధికులు. రంగస్థల అనుభవం గల నటులు. ఏ పాత్ర వేసినా ఆ పాత్రకు న్యాయం చేయడం, ఆ పాత్రలో జీవించడం ఆయన నటనలో ఒక ప్రత్యేకత. అందుకే ఆయన నటన నటులకు ఒక శిక్షణ గ్రంధం అని అంటూ ఉంటారు. ఆయన వాచికం ఒక శబ్దకోశం.

ఆయనకు క్రమశిక్షణ అంటే ప్రాణం.

సహా నటులను గౌరవించే సంస్కారి.

ఎస్వీఆర్ కు హిందీలో పృధ్వీ రాజ్ కపూర్ అంటే ఎంతో ఇష్టం. అలాగే తెలుగు చలనచిత్ర రంగంలో అలనాటి హీరో సి హెచ్ నారాయణ రావు అంటే వల్లమాలిన అభిమానం. గౌరవం.

ఎస్వీఆర్ కవి, కవితాత్మ హల నటులు. ఉమర్ ఖయ్యామ్ భావాలను ఆపోసన పట్టిన భావుకుడు.

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.