ఆర్జీవీ నుంచే నేర్చుకున్నా

Sanjana Rటాలీవుడ్ లో మరో మహిళా దర్శకురాలు వస్తున్నారు. ఆమె పేరు సంజనా రెడ్డి. ఉయ్యాలా జంపాలా చిత్ర ఫేమ్ రాజ్ తరుణ్ తాజాగా నటిస్తున్న చిత్రానికి సంజనా రెడ్డి దర్శకురాలు. ఇప్పటికే ఈ చిత్రం తాలూకు షూటింగ్ సగ భాగం పూర్తయ్యింది.

జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన సంజన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను కలిసిన తర్వాత తన రంగం మార్చుకున్నారు. ఆమెను రామ్ గోపాల్ వర్మ ఎంతగానో ప్రోత్సహించారు.

ఆమె కొంత కాలం ఓ న్యూస్ ఛానల్ కి పని చేశారు. ఆ తర్వాత ఆమె వృత్తిలో మార్పుకోసం వెతుకుతున్న రోజుల్లో రామ్ గోపాల్ వర్మ పరిచయమై ఆయన దగ్గర అసిస్టెంటుగా చేరారు సంజన.

సంజనా మాట్లాడుతూ షూటింగ్ కోసం ఆర్జీవీ ప్లాన్ చేసుకునే తీరు, తన అసిస్టెంటులతో చర్చించడం, యూనిట్ లోని ప్రతి ఒక్కరినీ గౌరవించడం తనను ఎంతో ఆకట్టుకుందని అన్నారు. కొత్తగా వచ్చే వారినైనా ఆయన తక్కువ చేయరని, అనుభవం ఉన్న వారితో సమానంగా చూస్తారని అన్నారు. ఆయన పని తనాన్ని దగ్గరుండి చూశానని, ఆయన తక్కువ వ్యవధిలో సినిమాలు ఎలా పూర్తిచేస్తారో గ్రహించానని సంజన చెప్పారు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో నైనా కూల్ గా ఉండటం తెలుసుకున్నది కూడా ఆయన నుంచే అని చెప్తూ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి దర్శకుడిగా మారడం అనుకున్నంత ఈజీ కాదని అన్నారు.

ఓ ప్రకటనకు ఆమె సమన్వయకర్తగా చేరినా దర్శకుడి వైఫల్యంతో సంజన ఆ యాడ్ కి మెగాఫోన్ పట్టుకోవలసి వచ్చింది. అందులో అమల నటించారు. ఆ తర్వాత సంజన ముంబై వెళ్లి అక్కడ ఒక యాడ్ ఏజెన్సీలో కొంతకాలం వర్క్ చేశారు.

కొన్ని రోజుల తర్వాత ఆమె హైదరాబాద్ చేరుకుంది. ఇక్కడకు రావడంతోనే నిర్మాత అనిల్ ని కలిసి ఏ కె ఎంటర్ టైన్మెంట్ లో ఓ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టరుగా చేరింది. ఆ సమయంలో వాళ్ళు సంజనను తన ప్రణాళికలు చెప్పామన్నారు. అప్పుడు ఆమె ఒక స్టోరీని విజువల్ గా చూపించగా అది చూసి వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. అంతేకాదు ఆ చిత్ర బాధ్యతలు కూడా చేపట్టామన్నారు. ఇంకేముంది, ఆమె ఆశ పండింది. ఆమె ఆనందపడ్డ క్షణాలవి. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న సంజనా రెడ్డి ఛాలెంజుగా తీసుకుని నలభై రోజుల్లో ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని చెప్పారు వారితో.

నిర్మాత అనిల్ ఆమె సవాల్ కి మెచ్చుకున్నారు. సుంకర అనిల్ తన మీద పెట్టుకున్న నమ్మకానికి ఆయనకు థాంక్స్ చెప్పకతప్పదని అన్నారు. అప్పుడు మారుతి తన కథను ఇచ్చారని అన్నారు. తక్కువ వ్యవధిలో సినిమా పూర్తి చెయ్యడం అనేది ఆర్జీవీ నుంచి నేర్చుకున్నానని ఆమె తెలిపారు.

రాజ్ తరుణ్, అమైరా దస్తూర్ ప్రముఖ పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కు కూడా ఓ ప్రధాన పాత్ర కల్పించారు ఆమె.

ఈ చిత్రం గానీ విజయవంతమైతే తనకు దర్శకురాలిగా రెండో సినిమా అవకాశం రావచ్చని సంజనా ఓ చిన్న నవ్వు నవ్వారు.

Send a Comment

Your email address will not be published.