ఆస్ట్రేలియా తెలుగు అబ్బాయే హీరో

Inkenti Nuvve Cheppuతనలో వున్న కళను ఒక కలగా సాకారం చేసుకోవడం. పట్టుదలతో వెండితెరపై ఒక ప్రణయ కావ్యానికి శ్రీకారం చుట్టడం. ప్రవాసంలో నివాసమైనా మాతృ భూమిపై మమకారం. నూనూగు మీసాల వయసులో నూతన బాటకు నుడికారం.

తెలుగువారు చేజిక్కిన అవకాశాన్ని అందుకొని ప్రవాసంలో అంచలంచెలుగా ఎదగడానికి తమవంతు కృషి చేసి విజయ పధంలో బావుటాని ఎగురవేసే మరో కధనం.

వృత్తి రీత్యా తండ్రి శ్రీ ధననజయ్ గారు ఆస్ట్రేలియా ఆరేళ్ళ క్రితం వచ్చి అడిలైడ్ నగరంలో వున్నపుడు కన్న కొడుకు నటనపై మోజు చూపడం, దానికి తగ్గట్లే శారీరకంగా హీరోలా వుండటం చూసి ఏదైనా ఒక సినిమా తీస్తే బాగుంటుందని సుమాలోచనకు శ్రీకారం చుట్టారు. ఆ నగరంలోనే యాదృచ్చికంగా టకీల అనే అమ్మాయిని కలవడం ద్వారా కధానాయికగా ఆ అమ్మాయిని ఎంచుకొని ప్రశాంత్ బొడ్డేటి మొదటి చిత్రాన్ని విశాఖ పట్టణం పరిసర ప్రాంతాల్లో వెల్ఫేర్ క్రియేషన్స్ బ్యానర్ పై “ఇంకేంటి నువ్వే చెప్పు” చిత్రాన్ని డా.విజయ ప్రసాద్ మల్ల నిర్మాతగా చిత్రీకరించారు.

ఈ బ్యానర్ పై ఇంతకు మునుపు “సిద్ధు ఫ్రం శ్రీకాకుళం”, “సీమ టపాకాయ” మరియు “సీతారాముల కళ్యాణం లంకలో” చిత్ర నిర్మాణం జరిగింది. సరిక్రొత్త తరహా నేపధ్యంతో క్రొత్త నటీనటులను, దర్శకులను వెల్ఫేర్ క్రియేషన్స్ వారు ప్రోత్సహిస్తూ ఈ చిత్రానికి శివ శ్రీ గారిని మొదటిసారిగా దర్సకత్వ బాధ్యతలనివ్వడం కూడా ఒక ఘనతే.

సహాయ పాత్రల్లో తెలుగు సినిమా రంగంలో బహు పరిచితులు సుమన్, హేమ, మధు నందన్ ఈ చిత్రంలో నటించారు. “బాహు బలి” సంపాదకులు శ్రీ కోటగిరి వెంకటేశ్వర రావు ఈ చిత్రానికి సంపాదకత్వం చేయడం గమనార్హం.

కధలోకి వెళితే ఇదొక కుటుంబ ప్రేమ కధా చిత్రం. పొరపాటున ఒకరిని ఇంకొకరనుకొని విభిన్న మలుపులతో కుటుంబ, సామాజిక విలువలు కలబోసిన మంచి చిత్రం. ఈ నెల 10 వ తేదీన ఆడియో లాంచ్ ని చేసి నెలాఖరులో భారత దేశంలోనూ, అమెరికా లోనూ మరియు ఆస్ట్రేలియాలోనూ విడుదల చేయాలని నిర్మాత విజయ్ ప్రసాద్ గారు చెప్పారు.

ప్రశాంత్ తెలుగు అబ్బాయి కావడం టకీల భారతీయ సంతతికి చెందిన అమ్మాయి కావడం ఎంతో శ్లాఘనీయం. ఇక్కడి తెలుగువారందరూ ఈ చిత్రాన్ని ఆస్వాదించి ఆదరిస్తారని ఇద్దరూ ఎదురు చూస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.