ఆ చిత్రం తర్వాత...

కైకాల సత్యనారాయణ క్యారక్టర్ యాక్టర్ గా తనకంటూ ఒక ఇమేజ్ కల్పించుకున్నారు. ఆయన డీ ఎల్ నారాయణ నిర్మించిన సిపాయి కూతురు చిత్రంలో హీరోగా నటించారు. అప్పుడు ఆయనను తన దగ్గరకు పంపించు చూస్తానని ఎన్టీఆర్ అడగ్గా డీ ఎల్ ఆయన దగ్గరకు పంపించారు. కైకాలను చూసి ఎన్టీఆర్ “మా గుడివాడ తాలూకా కుర్రాడే…సినీ రంగంలో పైకి రావాలంటే క్రమశిక్షణ ఎంతో ముఖ్యం” అని దీవించి పంపారు. కైకాలతో డీ ఎల్ పదేళ్లకు ఒప్పందం చేసుకున్నారు. నెల నెలా జీతం ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు డీ ఎల్.  నిజానికి సిపాయికూతురుకన్నా ముందు కైకాల ఒక చిత్రంలో నటించారు. కానీ అది విడుదలకు నోచుకోలేదు. సిపాయి కూతురు చిత్రం విడుదలై ఫెయిల్ అవడంతో ఇక లాభం లేదని తమ ఊరికి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్న తరుణంలో ఎస్ డీ లాల్ ఒక సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత విటలాచార్య పరిశ్రమలో హీరోల పోటీ ఎక్కువగా ఉందని, ఇందులో నిలబడి తట్టుకోలేవని చెప్పి కనకదుర్గ పూజామహిమ చిత్రంలో కైకాలకు విలన్ వేషం ఇచ్చారు. అంతే ఇక ఆతర్వాత ఆయనకు అన్నీ విలన్ వేషాలే వచ్చాయి. అంతేకాదు, సినీ రంగంలో తనకంటూ ఒక స్థానం సుస్థిరం చేసుకోగలిగారు కైకాల సత్యనారాయణ.

Send a Comment

Your email address will not be published.