ఇదంత సులభం కాదు

జగపతి బాబు తన సెకండ్ ఇన్నింగ్స్ ని నెగటివ్ రోల్ (లెజెండ్ సినిమా)తో ప్రారంభించారు. వందకుపైగా సినిమాలలో హీరోగా నటించిన జగపతి బాబు తానిప్పుడు ఇంకా హీరో పాత్రలు వేస్తూ అందులో తన ప్రతిభను చూపుకోవలసిన సమయం కాదని గ్రహించే ఇతర పాత్రలు వేయాలనే నిర్ణయానికి వచ్చారు. అలాగని తన కెరీర్ ముగిసిపోయినట్టు తానేమీ అనుకోవడం లేదన్నారు జగపతి బాబు.

సినీ పరిశ్రమ అనుకున్నంత సులభమైనది కాదని, ఈ రంగంలో ఎందరో విలన్ పాత్రలు పోషించారని, ఆ తర్వాత వాళ్ళు హీరోలు అయ్యారని, అయితే తన విషయంలో ఇది అటు ఇటు అయ్యిందని చెప్పారు. బహుశా తానొక్కడినే ముందు హీరోగా నటించి ఆ తర్వాత విలన్ గా నటిస్తున్నట్టున్నానని ఆయన అన్నారు.

తన సెకండ్ ఇన్నింగ్స్ ఫ్రెష్ గా ఆరంభించాలనుకుని లెజెండ్ తో ఆ కొత్తదనానికి శ్రీకారం చుట్టినట్టు ఆయన చెప్పారు. పైగా తానూ నెగటివ్ రోల్ వేసిన లెజెండ్ విజయవంతమవడం ఆనందంగా ఉందన్నారు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభానికి లెజెండ్ ఒక కీలకమైన చిత్రంగా అనుకునే తాను నటించానని, ఆ సినిమా విజయం సాధించక పోయినట్లయితే తన కెరీర్ ఆలోచనలో పడేదని జగపతి బాబు అన్నారు. అదృష్టం కొద్దీ లెజెండ్ క్లిక్ అయ్యిందని ఆయన తెలిపారు.

జగపతి బాబు ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నారు..వాటిలో రెండు త్వరలో విడుదల కానున్నాయి. మరో సినిమాలో జగపతి బాబు రజనీకాంత్ తో కలిసి లింగా అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా డిసెంబర్ లో విడుదల కానున్నది. అలాగే మహేష్ బాబు నటించబోయే సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించడానికి జగపతి బాబు ఒప్పందం కుదుర్చుకున్నారు.కరెంట్ తీగ సినిమాలో ఆయన రకుల్ ప్రీత్ కు తండ్రిగా నటించారు.

తన ప్లాన్ రచయితలకు కొత్త కొత్త ఆలోచనలు ఇవ్వడమే అని, తనను దృష్టిలో పెట్టుకుని రచయితలు కొత్త స్క్రిప్ట్స్ తో తన వద్దకు వస్తారనే నమ్మకం ఉందని జగపతి బాబు చెప్పారు.

తారలను సిఫార్సు చేయడానికో లేక ప్రమోట్ చేయడానికో తానేమీ సూపర్ స్టార్ కాదని, ఒకవేళ దర్శకుడు తనకు కొన్ని చాయిస్ లు ఇస్తే అప్పుడు తను ఒకరి పేరు సూచిస్తానని, అంతే తప్ప తానుగా ఎవరి పేరూ సూచించడమో సిఫార్సు చేయడమో జరగదని ఆయన స్పష్టం చేసారు.

తాను మహిళలను ప్రేమిస్తానని, గౌరవిస్తానని చెప్తూ వారిని డబ్బుతో ఆకట్టుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. తన భార్యకు గానీ పిల్లలకు గానీ ఫిల్మ్స్ పై పెద్దగా ఆసక్తి లేదని , అంతకన్నా ముఖ్యమైనది వాళ్ళు తనను నమ్మడమని జగపతి బాబు చెప్పారు. తాను పెళ్లి చేసుకున్నాకే సినీ రంగంలోకి వచ్చానని, తనకు నటించాలని ఉందని తన భార్యతో చెప్పే ఈ రంగంలోకి వచ్చానని ఆయన అన్నారు. తన పిల్లలకు పూర్తి స్వేచ్చ ఇచ్చానని, వాళ్ళు ఏం కావాలన్నా ఇస్తానని ఆయన అన్నారు.

జగపతి బాబు పెద్ద కుమార్తెకు ఇప్పుడు 28 ఏళ్ళు. ఆమె ప్రస్తుతం యు ఎస్ లో వర్క్ చేస్తున్నారు. సినీ పరిశ్రమలో ఆయనకు ఇష్టమైన నమ్మకమైన మిత్రుడు తమిళ హీరో అర్జున్.

Send a Comment

Your email address will not be published.