ఇదో గొప్ప మలుపు

ఈమధ్యే విడుదలై అందరినీ అలరిస్తున్న ఊహలు గుస గుస లాడే సినిమా హీరో నాగసౌర్యకు ఈ చిత్రం అతని కెరీర్లో చెప్పుకోదగ్గ మలుపు కానున్నది.

విజయవాడ యువకుడైన నాగసౌర్య ప్రతిభ, అంకితభావంతో నటించిన తీరును సినిమా చూసిన వారంతా గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే తన ప్రస్తానం అనుకున్నంత సులువుగా మొదలు కాలేదని నాగసౌర్య చెప్పాడు. దాదాపు అయిదేళ్లపాటు అతను చూడని స్టూడియో లేదు. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాడు. నూతన నటుల కోసం పత్రికల్లో ప్రకటన వచ్చినప్పుడల్లా దరఖాస్తు పెట్టుకునే వాడు. అయితే పెట్టుకున్న అప్లికేషన్స్ కు ఒక్కసారీ అతనికి అవకాసం రాలేదు. దాంతో నిరుత్సాహపడిన నాగసౌర్య తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోవాలనుకున్నాడు. అటువంటి సమయంలో అతని కంట మరో ప్రకటన పడింది. కొత్త హీరో కోసం వచ్చిన ప్రకటన అది. అదే ఆఖరి ప్రయత్నంగా అతను తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. అతను తన వివరాలు పంపించాడు. కానీ అప్పుడూ పెద్దగా నమ్మకాలు లేవు. అయితే మరుసటిరోజు అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అతనిని వీడియోపంపమని అడిగారు. ఆ వీడియో మెయిల్ చెయ్యకుండా అతను తనకు సంబంధించిన ఒక సి డీ తో దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ను నేరుగా కలిసి సి డీ ఇచ్చాడు. మాట్లాడాడు. కొన్ని రోజుల తర్వాతా అతనిని తమ కార్యాలయానికి రావలసిందిగా దర్శకుడి నుంచి కాల్ వచ్చింది. తీరా అక్కడికి వెళ్ళిన నాగసౌర్య అక్కడున్న వారిని చూసి ఆశ్చర్యపోయాడు. కారణం అతనికోసం రాజమౌళి, కొర్రపాటి సాయి, కీరవాణి తదితరులు ఎదురుచూస్తున్నారు. చెక్కు మీద పేరు ఎలా రాయాలని దర్శకుడు శ్రీనివాస్ నాగసౌర్యను అడిగారు. ఆమాట ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని నాగసౌర్య అంటాడు. అనుకోనిదంతా క్షణాల్లో జరిగిపోయాయి. అంతకుముందు అయిదేళ్ళ పాటు పడిన శ్రమ ఇక్కడ ఉపయోగపడినట్టు అతను చెప్పుకొచ్చాడు.

ఏలూరులో పుట్టిన నాగసౌర్య పెరిగిందేమో విజయవాడలో. హైదరాబాదులో బీ కామ్ కంప్యూటర్స్ చదివాడు. అతని రోల్ మోడల్ నాగార్జున.

ప్రస్తుతం నాగసౌర్య రెండు సినిమాలు చేస్తున్నాడు. అవి దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావే మా ఇంటికి.

ఇప్పటికే అతని నటనపై అనేక మాటలు విన్నా నాగార్జున ఏం చెప్తారా అని నిరీక్షిస్తున్నాడు నాగసౌర్య.

నాగసౌర్య చెప్పేదొకటే….

“ప్రయత్నలోపం ఉండకూడదు. అవకాసం వచ్చే వరకు నిరీక్షించక తప్పదు. అవకాసం రాలేదని నిరుత్సాహపడకూడదు. ప్రతిభావంతులకు వెండితెర పరిశ్రమలో తప్పక చోటు ఉంటుంది. ఇందులో సందేహం వద్దు. కనుక డిప్రెషన్ లోకి వెళ్ళకూడదు. సినిమా మీద మోజు, మక్కువ ఉంటే ఎంతో కృషి అవసరం. అంకితభావంతో పని చేయాలి. అప్పుడు విజయం తప్పక వరిస్తుంది…” అని.

Send a Comment

Your email address will not be published.