ఇలా అయితే వచ్చే వాడిని కాను

“నాకు సన్మానం చేస్తారని తెలిసుంటే వచ్చేవాడినే కాను.  పాటల ఆడియో ఆవిష్కరణ అని చెప్పడం వల్లే ఇక్కడికి వచ్చాను…”
– సంగీత రాజా ఇళయరాజా మాటలివి.
ప్రకాష్ రాజు నటించి దర్శకత్వం వహిస్తున్న ఉలవచారు బిర్యాని సినిమా పాటల విడుదల సంబరాలు హైదరాబాద్ లోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో ఉగాది పండగ రోజున ఆహ్లాదకర వాతావరణంలో జరిగాయి. ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్ర రావు, సి కళ్యాణ్, డీ రామానాయుడు, అశ్వినీదత్. కె.ఎస్ రామారావు, సంగీత దర్శకులు కీరవాణి, మణిశర్మ, నటీనటులు ప్రకాష్ రాజ్, స్నేహ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఉలవచారు బిర్యాని చిత్ర సంగీత దర్శకుడు ఇళయరాజాను ఘనంగా సత్కరించారు. వేదమంత్రాలతో వేదికపైకి తీసుకు వచ్చి ఇళయరాజాను స్వర్ణ పతకంతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఇళయరాజా మాట్లాడుతూ ఇలా తనకు సన్మానం చేస్తారని తెలిస్తే వచ్చేవాడిని కానని, పాటల విడుదల వేడుక అని చెప్పి ఇక్కడకు తీసుకొచ్చారని అన్నారు. ఇక పాటల విషయానికి వస్తూ ఒక పాట మరొక పాటలా ఉండకూడదన్నది తన అభిప్రాయమని, పాట పాటకు తేడా ఉండాలని అన్నారు. జగదేక వీరుడు అతిలోకసుందరి చిత్రానికి తాను స్వరాలూ అందించినప్పుడు దర్శకుడు రాఘవేంద్ర రావు పాటలకు స్వరాలూ ఇలా ఉండాలి అలా ఉండాలి అని అడగలేదని, అందుకే అందులో పాటలు అనుకున్నదానికన్నా చాలా బాగా వచ్చాయని చెప్పారు. ఇప్పుడు కొందరు దర్శకులు  ఆ పాట ఇలా ఉండాలి ఈ పాట అలా ఉండాలి అని అడుగుతున్నారని అన్నారు.
ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ విశేషం ఒకటుంది. ప్రకాష్ రాజ్ తాను నటించడమే కాదు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. స్నేహ హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రకాష్ రాజ్, స్నేహా  ఇళయరాజా సంగీతాన్ని కొనియాడారు.
చంద్రబోస్ గీతాలు బాగున్నాయని ప్రకాష్ రాజ్ ప్రశంసించారు.

తెలుగు, తమిళం, కన్నడం భాషలలో ఈ చిత్రం నిర్మిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.