వెండి తెర పై మరో విషాద కిరణ జీవితం ఆవిష్కృతమైంది. నూనూగు మీసాల వయసు లోనే ఉషాకిరణ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ ద్వారా ‘చిత్రం’ సినిమాతో అరంగేట్రం చేసిన ఉదయ్ కిరణ్ ఇక లేరు. లవర్ బాయ్ , చాక్లెట్ బాయ్ వంటి ఇమేజ్ తో తెలుగు ప్రేక్షకుల మనస్సులో గిలిగింతలు పెట్టిన ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొని అభిమానుల్ని తీవ్ర విషాదంలో ముంచారు. ఆదివారం రాత్రి ఆయన శ్రీనగర్ లోని వంశీ జ్యోతి అపార్ట మెంట్స్ లోని తన ఫ్లాట్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య కి పాల్పడ్డాడు. ఎన్నో రోజులుగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ఉదయ్ సినిమా అవకాశాలు రాక పోవడం, ఆర్ధిక ఇబ్బందులతో మానసికంగా కుంగి పోయారు. ఆరేళ్ళగా తండ్రితో మాటలు లేక పోవడం, తల్లి మరణించడం, స్నేహితులు దూరం కావడం కూడా ఉదయ్ ని తీవ్రమైన డిప్రెషన్ లోకి నెట్టిందని అందుకే తరుచుగా బతకాలని లేదని అనేవాడని ఉదయ్ భార్య విషిత అన్నారు. వీరికి 2011, అక్టోబర్ లో వివాహం జరిగింది.
ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకి పాల్పడిన రోజు ఆమె తన స్నేహితుడి బర్త్ డే పార్టీ కి మణికొండ వెళ్ళింది. ఆ సమయం లో ఉదయ్ కిరణ్ ఇంట్లో ఉన్న అత్తామామ కూడా వారి ఇంటికి వెళ్ళారు. పార్టీ అయిన తర్వాత కార్ లో పికప్ చేసుకొంటానని చెప్పిన ఉదయ్ ఎంతకీ రాక పోవడం, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని రావడం తో కంగారు పడిన విషిత తల్లితండ్రులతో కలిసి హటహుటిన ఇంటికి వచ్చారు. ఇంట్లో ఉదయ్ కిరణ్ ఉరి వేసుకోవడం చూసి ఏడుస్తూ అపోలో కి తరలించారు. అయితే అప్పటికే ఉదయ్ కిరణ్ మరణించాడని డాక్టర్లు నిర్ధారించారు.
ఉదయ్ కిరణ్ సినీ ప్రస్థానం చాలా ఎత్తు పల్లాలని చవి చూసింది. ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన వారికి మొదట పరాజయాలు, తర్వాత విజయాలు వరిస్తే ఉదయ్ కి మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఉదయ్ కిరణ్ స్వస్థలం హైదరాబాద్. తండ్రి మూర్తి ఎయిర్ ఫోర్సు ఉద్యోగి. తల్లి గృహిణి. ఒక అన్న, అక్కల ముద్దుల తమ్ముడు ఉదయ్. అయితే అన్న కూడా ఉదయ్ చిన్నతనం లోనే ఆత్మహత్య చేసుకొని మరణించాడు. హైదరాబాద్ వెస్లీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసాడు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. మెగాస్టార్ చిరంజీవి అంతే వీరాభిమానం. తల్లి తో కలిసి ప్రతి సినిమాని చూసే వాడు. ఆ ఆసక్తి తో పాటు హ్యాండ్ సమ్ గా ఉండటం తో మోడలింగ్ లోకి ప్రవేశించి సక్సెస్ అయ్యాడు. ఆ సమయం లోనే ఉషాకిరణ్ బానర్ పై తేజ దర్సకత్వంలో వస్తున్న ‘చిత్రం’ సినిమా ఆడిషన్స్ కి వెళ్ళడం ఉదయ్ కిరణ్ జీవితాన్ని మలుపు తిప్పింది.
చిత్రం సినిమా ఘన విజయం సాధించడంతో పాటు వరసగా ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ సినిమాల విజయం తో హ్యాట్రిక్ హీరో గా ఉదయ్ పేరు ఇండస్ట్రీ లో మారు మోగి పోయింది. ఆ సమయం లోనే ఉదయ్ అభిమాన హీరో మెగా స్టార్ చిరంజీవి తన పెద్దకుమార్తె సుస్మితని ఉదయ్ కిచ్చి వివాహం చేస్తాననడంతో అతని రేంజ్ అమాంతం గా పెరిగి పోయింది. సుస్మిత తో నిశ్చితార్దం జరిగిన తర్వాత పెళ్లికి మెగా కుటుంబం వెనక్కి తగ్గింది. ఉదయ్ తో సుస్మిత వివాహం జరగటం లేదని చిరంజీవి ప్రకటించారు. ఆ ప్రకటన తో ఎంతో ఉచ్చ స్థితిలో ఉన్న ఉదయ్ సినిమా గ్రాఫ్ దిగజారడం మొదలింది. అలా మొదలైన అతని పతనం చివరికి ఆత్మహత్య తో ముగిసింది. తెలుగు, తమిళ్ భాషల్లో మొత్తం 19 సినిమాల్లో నటించిన ఉదయ కిరణ్ 34 ఏళ్ల అతి చిన్న వయసులోనే జీవితాన్ని అర్ధాంతరంగా ముగించి అభిమానుల్ని దుఃఖ సాగరంలో ముంచాడు. జీవితంలో ఒడిదుడుకులు సహజం. వాటిని ధైర్యం గా ఎదుర్కొని పోరాడాలి తప్ప నిరాశతో కుంగి పోగూడదని ఈ యువ హీరో జీవితం మనకి నేర్పుతోంది.