ఊపిరి….నాగార్జున ఎంతో మనసుపెట్టి చేసిన చిత్రం…..
కార్తి , తమన్నా, ప్రకాష్‌రాజ్, జయసుధ, ఆలీ, తనికెళ్ళ భరణి తదితరులతో కలిసి నాగార్జున నటించిన చిత్రం ఊపిరి.
గోపి సుందర్ స్వరపరచిన ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి. నిర్మాతలు: పరమ్ పొట్లూరి, కవిన్ అన్నే.
‘ది ఇన్‌టచబుల్స్’ అనే ఫ్రెంచి సినిమా నాలుగైదు సంవత్సరాలక్రితం వచ్చిన సినిమా. ఎంతో ఉద్వేగ భరిత చిత్రమే అది. దానిని తెలుగులో ఊపిరి టైటిల్ తో పునర్ నిర్మించారు. ఊపిరి.
వంశీ పైడిపల్లి ఈ ఫ్రెంచ్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు నాగార్జున హీరోగా రూపొందించిన తీరు అమోఘం. ఇదొక ప్రయోగాత్మక చిత్రం. అయినా నిర్మాతలు ఖర్చు విషయం ఆలోచించక ఓ మంచి చిత్రం ప్రేక్షకులకు అందించాలన్న సదాశయంతో ముందుకు రావడం ముదావహం.
నాగార్జునలాంటి రొమాంటిక్ హీరోని వీల్ చైర్ కి పరిమితం చేసి నటించాలనుకున్న దర్శకుడి ఆలోచన సాహసపూరితం. నిజంగా అది రిస్కుతో కూడుకున్నదే. అయినా ఆ పాత్రలో నాగార్జున నటించడానికి ఒప్పుకోవడం ఊహించనిది.
ఏమాత్రం మనసున్నా ఊపిరి చిత్రం కట్టిపడేయటం ఖాయం.
ఓ ప్రమాదంలో మెడ కింది భాగమంతా ప్యారలైజ్ అయిపోతుంది. అతను ధనవంతుడు. పేరు విక్రమాదిత్య. ఈ పాత్రలో నటించిన హీరో నాగార్జున. అతను తనకు సహాయం చేయడానికి ఒకరిని ఏర్పాటు చేసుకుంటాడు. అతను మరెవరో కాదు, జైలు నుంచి విడుదలై బయటి ప్రపంచంలోకి వచ్చిన వ్యక్తి. అతని పేరు శీను. ఈ పాత్రలో నటించిన నటుడు కార్తి. అతను తనకు ఎక్కడైనా బతకడానికి ఇంత ఆధారం లభిస్తుందా అని చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో నాగార్జున అతనిని తన సహాయకుడిగా నియమించుకుంటాడు. విక్రమాదిత్య అవిటివాడనే ఆవగింజంత జాలి లేకుండా అతనితో శీను ఓ ఆట ఆడుకుంటాడు. అయితే అది విక్రమాదిత్యకు కలిసొస్తుంది. అతనిలో మునుపటి ఉత్తేజం వస్తుంది. విక్రమాదిత్య జీవితాన్ని శ్రీను ఎలా మారుస్తాడు, అందుకు అతను ఏం చేసాడు, వీరి కథ మలుపులు తిరిగి ఎట్టకేలకు ఎలా పూర్తవుతుంది అన్నదే ఊపిరి చిత్రం కథనం.
“ఊపిరి” చిత్రంలో ఏ సన్నివేశమూ విసుగు పుట్టించదు. నాగార్జున, కార్తీ తమ పాత్రలు అచ్చంగా సరిపోయారు. ఆ పాత్రలు వారి కోసమే పుట్టాయా అన్నంతగా ఉన్నాయి. ఇద్దరూ తమతమ పాత్రలకు అన్ని విధాలా న్యాయం చేసారు అనేకన్నా వాటిలో జీవించారు అనడం సరిపోతుంది. ఈ చిత్రంలో తమన్నా తదితరులు కూడా చక్కగా నటించారు. జయసుధ సెంటిమెంట్ చిత్రానికి బోనస్ పాయింట్.
దర్శకుడి ప్రతిభకు ఈ చిత్రం అద్దం పట్టింది అని చెప్పుకోక తప్పదు.
అయితే పాటల విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకోవలసింది. మాటలు టాప్.
ఓ మంచి చిత్రం చూసామన్న తృప్తి కలిగించే చిత్రం ఊపిరి.