ఎన్టీఆర్ తెలుగు సినిమాకు గుర్తింపు...గౌరవం

స్వర్గీయ ఎన్టీఆర్ మహా నటుడే కాదు…గొప్ప రాజకీయ నాయకుడు కూడానూ …తెలుగు సినిమాకు గుర్తింపు, గౌరవం తీసుకొచ్చిన ఘనత కూడా ఆయనదే….తెలుగు సినిమాకు రెండు కళ్ళు ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్…కారణం వాళ్ళు పాటించిన క్రమశిక్షణ, వారు చేసిన పాత్రలు …వారు వేసిన మార్గం….అని వీ మధుసూదన రావు చెప్పిన మాటలు అక్షరాలా నిజం…నిజం….కాదనలేని నిజం….

మరోవైపు దాసరి నారాయణ రావు ఎన్టీఆర్ గురించి చెప్పిన మాటలు చూద్దాం…

“ఎన్టీఆర్ కు అహం ఉంది…దాని పేరు ప్రక్షాళన…ఆయనకు ఆవేశం ఉంది…దాని పేరు చైతన్యం….ఆయనకు పట్టుదల ఉంది…దానికి తార్కాణం మూడు సార్లు ముఖ్యమంత్రి కావడం…”

ఈ విధంగా ఎందరో ప్రముఖుల మన్ననలు పొందిన విశ్వవిఖ్యాత నట సామ్రాట్ నందమూరి తారకరామారావు అసామాన్యుడు…

మరో మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలతో ఆంధ్రుల గుండెల్లో ఒక గొప్ప ఆరాధ్యుడిగా గొప్ప మనీషిగా నిలిచిపోయారు.

ఆయన కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో ఒక రైతు కుటుంబంలో 1923 మే 28వ తేదీన జన్మించారు. ఆయనను కన్న తల్లి ఆయనకు కృష్ణ అని పేరు పెట్టాలనుకుంది. అయితే ఆయన మామయ్య తారకరాముడు అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఆయన పేరు తారక రామారావుగా స్థిరపడింది.
ఆయన తల్లిదండ్రులు వెంకట రమణమ్మ, లక్ష్మయ్య చౌదరి.

రైతు కుటుంబానికి చెందినప్పటికీ ఎన్టీఆర్ తల్లిదండ్రులు విద్యకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. ఎన్టీఆర్ ప్రాధమిక విద్య ఆయన పుట్టి పెరిగిన ఊళ్లోనే సాగింది. వారి ఇంటికి బహు దూరంలో స్కూల్ ఉండేది. దానితో తండ్రి లక్ష్మయ్య చౌదరి భుజాలపై కూర్చోపెట్టుకుని ఎన్టీఆర్ ను స్కూల్ కి తీసుకుపోయేవారు. అయితే ఆ తర్వాత ఆయన సమీప బంధువు రామయ్య ఎన్టీఆర్ ను దత్తత తీసుకుని విజయవాడకు తీసుకుపోయారు. విజయవాడలోని గాంధీ మునిసిపల్ స్కూల్ లో ఎన్టీఆర్ ఆరో క్లాస్ లో చేరారు. ఆయన తల్లిదండ్రుల పరిస్థితి దయనీయంగా మారినప్పుడు ఎన్టీఆర్ తన సైకిల్ కు రెండువైపులా పాల క్యాన్లు కట్టుకుని హోటళ్లకు, చుట్టుపక్కల వారికి పంపిణీ చేసి డబ్బులు సంపాదించారు. అలాగే తమ కుటుంబం గడవడానికి గాను రామారావు అనేక పనులు చేయవలసి వచ్చింది. ఒక చిన్న పచారీ కొట్టు నడపడమే కాకుండా గుమాస్తాగాను పని చేసారు. ఒకవైపు ఇన్ని రకాలుగా శ్రమిస్తున్నా స్కూల్ లోను, అనతరం కాలేజీలోను చదువుల్లో మంచి పేరే సంపాదించారు. విశాఖపట్నంలో ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో ఇంటర్ మీడియట్ చదువుతున్నప్పుడు ఒక రోజు తెలుగు విభాగం అధిపతి విశ్వనాధ సత్యనారాయణ శాస్త్రి గారు ఎన్టీఆర్ ను ఒక నాటకంలో స్త్రీ పాత్ర వెయ్యాలని అన్నారు. అయితే ఆ నాటకంలో నటించేందుకు ఎన్టీఆర్ ఒప్పుకున్నారు. అయితే ఇక్కడో చిక్కు వచ్చిపడింది. ఆయన తనకున్న మీసం తీయనని  చెప్పారు. ఆ సంఘటనతో ఆయనను మీసాల నాగమ్మ అని అందరూ పిలిచేవారు.

అది 1942వ సంవత్సరం. ఆయన ఇంటర్ మీడియట్ లో ఉన్నప్పుడే పెళ్లి అయిపోయింది. ఆమె పేరు అడుసుమల్లి బసవతారకం. వీరి సంతానం – నందమూరి రామకృష్ణ (చనిపోయాడు), జయకృష్ణ, సాయి కృష్ణ (చనిపోయాడు), హరికృష్ణ, మోహన కృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ జూనియర్, జయశంకర్ కృష్ణ, గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, కె ఉమా మహేశ్వరీ. బసవతారకం ఎన్టీఆర్ కు దగ్గర చుట్టాలే. ఈ పెళ్లితో కాస్తంత అంతరాయం కలిగి రెండు సార్లు ఎన్టీఆర్ ఇంటర్ మీడియట్ లో ఫెయిల్ అయ్యారు. అయినా ఆయన చదువులకు గుడ్ బాయ్ చెప్పలేదు. తదుపరి పరీక్షలో ప్యాస్ అయ్యారు. గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో బీ ఏ లో చేరారు. అప్పటికే ఆయనలో నటించాలనే తాపత్రయం ఉంటూనే వచ్చింది. ఆ ఆరాటంతోనే ఆయన స్టేజ్ నాటాకాల పట్ల ఆసక్తి చూపించారు. కాలేజీలోని అమెచ్యూర్ నేషనల్ ఆర్ట్స్ థియేటర్ గ్రూప్ తరఫున ఆయన క్రమం తప్పకుండా నాటకాలు వేస్తూ వచ్చారు. అంతే కాదు అనేక నాటకాలకు దర్శకత్వం కూడా వహించారు. జగ్గయ్య, ముక్కామల, కె వీ ఎస్ శర్మ తదితరులతో కలిసి నటించారు. పేద ప్రజల సహాయార్ధం విరాళాలు పోగు చేస్తుండే వారు.
బసవతారకం మరణించిన తర్వాత 1993 లో లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నారు ఎన్టీఆర్.
ఆయన మంచి చిత్రకారుడు కూడా. రాష్ట్ర స్థాయిలో జరిగిన పెయింటింగ్ పోటీలో ఆయన బహుమతి కూడా పొందారు.

సుభాష్ చంద్ర బోస్ విజయవాడ వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఆయన బొమ్మ గీసి బోసుకి కానుకగా ఇచ్చారు.

1957 లో ఎన్టీఆర్ డిగ్రీ పూర్తి చేసారు. ఆతర్వాత 1100 లో ఒకడుగా మద్రాస్ సర్వీస్ కమీషన్ పరీక్ష రాసి ఆయన ప్యాసయ్యారు. ఆ పరీక్షలో మొత్తం ఏడుగురు సెలెక్ట్ అయ్యారు. వారిలో రామారావు ఒకరు. 1947 లో ఆయన మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్ గా చేరారు. అక్కడ కేవలం కొద్ది కాలమే పని చేసి సినిమాల వైపు దృష్టి మళ్ళించారు.

ప్రముఖ నిర్మాత బీ ఏ సుబ్బారావు గారు ఎన్టీఆర్ ఫోటో చూసి మద్రాసుకు పిలిపించి పల్లెటూరి పిల్ల చిత్రంలో హీరో గా నటించే అవకాశం ఇచ్చారు. ఎలాంటి మాక్ అప్ గానీ స్క్రీన్ టెస్ట్ గానీ లేకుండానే బీ ఏ సుబ్బా రావు గారు ఎన్టీఆర్ కు అవకాశం ఇవ్వడం విశేషం. ఎన్టీఆర్ కు 1116 రూపాయలు ఇచ్చి ఆయనతో ఒప్పందం చేసుకున్నారు బీ ఏ సుబ్బారావు. అయితే కెమెరా ముందు మొదటిసారిగా ఎన్టీఆర్ నిల్చున్నది మాత్రం మన దేశం చిత్రానికే.  1949వ సంవత్సరం. అందులో ఎన్టీఆర్ కు చిన్నపాటి పోలీసు వేషం ఇచ్చారు. అయితే 1959 లో ఆయన ప్రముఖ పాత్ర పోషించింది మాత్రం పల్లెటూరి పిల్లగానే చెప్పుకోవాలి. ఆ ఏడాదే ఆయన షావుకార్ అనే చిత్రంలోనూ నటించారు. షావుకార్ చిత్రం ఎల్ వీ ప్రసాద్ గారిది. ఆ తర్వాత ఆయన మద్రాసులో ఒక చిన్న గది అద్దెకు తీసుకున్నారు. పల్లెటూరి పిల్ల సినిమాకు ఇచ్చిన డబ్బును ఖర్చు పెట్టిన తర్వాత ఆయన అనేక కష్టాలు పడ్డారు. సిటీలో బస్సు ఎక్కడానికి కూడా డబ్బులు ఉండేవి కావు. మూడు రోజులైతే అన్నానికి కూడా డబ్బులు లేక పస్తులున్నారు ఎన్టీఆర్.

అనంతరం కె వీ రెడ్డి గారి పాతాళ భైరవి (1951), బీ ఎన్ రెడ్డి గారి మల్లేశ్వరి (1951), ఎల్ వీ ప్రసాద్ గారి పెళ్లి చేసి చూడు (1952), కె కామేశ్వర రావు గారి చంద్ర హారం సినిమాలలో ఎన్టీఆర్ నటించి తనకంటూ ఒక ఇమేజ్ పెంచుకున్నారు. ఈ చిత్రాలన్నీ విజయా సంస్థవారి నుంచి విడుదల కావడం గమనార్హం. ఈ సినిమాలప్పుడు ఒక్కో దానికి ఆయనకు అయిదు వందల రూపాయల చొప్పున నెల జీతంగా ఇచ్చేవారు. కాగా అయిదువేల రూపాయలు విడిగా ఇచ్చే వారు. పాతాళ భైరవి చిత్రం 34 కేంద్రాలలో వంద రోజులు ఆడి రికార్డు నెలకొల్పింది. 13 కేంద్రాలలో 25 వారాలు ఆడింది. ఎన్టీఆర్ అందాల రూపం అందర్నీ ఆకట్టుకుంది. ఇక పౌరాణిక చిత్రాలలోనూ ఎన్టీఆర్ కు గొప్ప పేరుప్రఖ్యాతులు వచ్చాయి. అనతికాలంలోనే ఆయన నటనను ఆంధ్ర దేశమంతటా ఆహా ఒహో అని చెప్పుకొచ్చారు. కృష్ణుడు లేదా రాముడు లేదా రావణాసురుడు వేషం వేస్తే ఎన్టీఆర్ మాత్రమే వెయ్యాలని అనిపించుకున్నారు.

44 ఏళ్ళ ఫిలిం కెరీర్ లో ఎన్టీఆర్ 297 చిత్రాలలో నటించారు. వాటిలో 280 చిత్రాలు తెలుగులో అయితే 15 తమిళ చిత్రాలున్నాయి. నాలుగు హిందీ సినిమాలలోనూ ఆయన నటించారు. పౌరాణిక చిత్రాలు 44 అయితే 13 చిత్రాలు చారిత్రికమైనవి. 55 జానపద చిత్రాలైతే 185 చిత్రాలు సాంఘిక మైనవి. 140 చిత్రాలు వంద రోజులు ఆడితే 33 సినిమాలు సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి. అర డజన్ సినిమాలు ఏకంగా యాభై వారాలు ఆడాయి. లవకుశ చిత్రం ఒక సెంటర్ లో 75 వారాలు ఆడి రికార్డు నెలకొల్పింది. 63 కేంద్రాలలో వంద రోజులు ఆడింది. మాయా బజార్ నుంచి శ్రీ కృష్ణుడి వేషం వెయ్యడానికి 7500 రూపాయలు తీసుకున్నారు. అప్పట్లో అది అతి ఎక్కువ ఫీజుగా చెప్పుకునే వారు. 1972 నుంచి ఆయన ఒక్కో చిత్రానికి లక్ష రూపాయలు ఫీజు తీసుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన ఏడు లక్షలు తీసుకున్నారు.

సీతారామ కల్యాణం, దాన వీర శూర కర్ణ, శ్రీ రామ పట్టాభిషేకం, అడవి రాముడు, యమగోల తదితర చిత్రాలు కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 1990 లో బ్రహ్మర్షి విశ్వామిత్ర చినేమాలో నటించి దర్శకత్వం కూడా వహించారు. ఆయన నటించిన ఆఖరి చిత్రం శ్రీనాథ కవి సార్వభౌముడు. ఇది 1993 లో విడుదలైంది.

ఆయన 1982 లో రాజకీయాలలోకి అడుగు పెట్టి తెలుగు దేశం అనే పార్టీ సొంతంగా ఆరంభించారు. తెలుగు వారి ఆత్మ గౌరవం అనే నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ వారిని ఓడించి సంచలనం సృష్టించారు. అంతే కాదు రాష్ట్రంలో మొదటి సారిగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర పుటలకెక్కారు. పాలనలోను తన ముద్రను నమోదు చేసుకుని ఆయన తిరుగు లేని నాయకుడని అనిపించుకున్నారు. నేషనల్ ఫ్రంట్ పార్టీకి చైర్మన్ అయి జాతీయ స్థాయిలోనూ ఆయన తనదైన గుర్తింపు పొందారు.

ఆయన ఉన్నంతకాలం లెజెండుగా ఓ వెలుగు వెలిగి 1996 జనవరిలో తన 73వ ఏట తుది శ్వాస విడిచారు.

సినీ రంగంలో ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన ఎన్టీఆర్ ను కేంద్ర ప్రభుత్వం 1968 లో పద్మశ్రీ తో సత్కరించింది.

కొసమెరుపు… నేను పుట్టి పెరిగిన బజుల్లా రోడ్డులోనే(మద్రాస్) ఎన్టీఆర్ ఇల్లు ఉండేది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి తిరుపతికి వచ్చి మొక్కు తీర్చుకున్న వాళ్ళు అనంతరం మద్రాస్ వచ్చి ఎన్టీఆర్ ను దర్శించుకుని కానీ ఆంధ్రాకు తిరుగు ప్రయాణం చేసేవారు కాదు అనడం అతిశయోక్తి కాదు. అలా తిరుపతి నుంచి ఆయనను చూడడానికి వచ్చిన అభిమానులతో కలిసి ఎన్టీఆర్ గుమ్మంలో గుంపులో ఒకడిగా నిల్చుని నేనూ ఆయనను చూసిన సందర్భాలు ఉన్నాయి. ఒకసారైతే కృష్ణుడి వేషంలోనే ఎన్టీఆర్ ను చూసాను. అదెప్పటికీ మరచిపోలేను.

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.