నటి దేవిక తండ్రిగారి పూర్వీకులది రాయలసీమలోని చిత్తూరు ప్రాంతం. తాతగారు మిరాసీదారులు. దేవిక నాన్న గారి పేరు గజపతిరావు నాయుడు. ఆయనకు ఇద్దరు తమ్ముళ్ళు. వారిలో ఒకరు బాసుదేవనాయుడు. బాసుదేవనాయుడుగారికి దర్శకులు సి పుల్లయ్య మిత్రులు. సన్నిహితులు. ఆ పరిచయం దేవికకు తోడ్పడింది. సి పుల్లయ్య గారు దర్శకత్వం వహించిన రేచుక్క చిత్రంలో ఎన్ టీ రామారావు సరసన నటించే అవకాశం దేవికకు లభించింది. అది తనకు ఓ గొప్ప అదృష్టంగా దేవిక చెప్పుకునే వారు. ఆ చిత్రంలో రాజుగారు చనిపోతే దేవిక ఏడవవలసి ఉంటుంది. అయితే ఆమెకు ఎంతసేపటికీ ఏడుపు రాలేదు. ఆ సీను ఓకే అయ్యేందుకు సి పుల్లయ్య గారు ఏడవవలసినంత పని అయ్యిందట. దేవిక ఏడుపు సీను ఓకే చెయ్యడానికి చాలాసేపు పట్టినా సి పుల్లయ్య గారు ఓపిక వహించారు. అంతే కాదు, షూటింగు అంతా అయిన తర్వాత ఆయన దేవిక నటనను మెచ్చుకుని జూనియర్ శ్రీరంజనిలా పైకి వస్తావని దేవికను ఆశీర్వదించారు. ఆ మాటలు నిజమయ్యాయి. వెండితెరకు పరిచయమైన తర్వాత మొదటి రెండు మూడు చిత్రాల వరకు ఆమె పేరు ప్రమీలాదేవిగా టైటిల్ కార్డులో వేసే వారు. ఆ తర్వాతే ఆమె దేవిక అయ్యారు.