‘ఒక మనసు’

Oka-Manasuమెగా ఫ్యామిలీ నుంచి ఈసారి ఒక కొత్త హీరోయిన్ వెండితెరకు “ఒక మనసు” టైటిల్ తో పరిచయమైంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు చిరంజీవి సోదరుడు నాగబాబు కూతురు నిహారిక.

నాగశౌర్య సరసన నిహారిక నటించిన ఒక మనసు చిత్రం తాజాగా విడుదల అయ్యింది. ఈ చిత్రంలో రావు రమేష్, ప్రగతి, అవసరాల శ్రీనివాస్, రాజా రవీంద్ర తదితరులు ఇతరపాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి సంగీతం సునీల్ కశ్యప్.

మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రచన చేసి దర్శకత్వం నిర్వహించింది రామరాజు.

గతంలో ‘మల్లెల తీరంలో సిరిమల్లె చెట్టు’ కు దర్శకత్వం వహించిన రామరాజు.ఇప్పుడో మరో అందమైన సినిమాతో మనముందుకొచ్చారు. నిజానికి ‘మల్లెల తీరంలో సిరిమల్లె చెట్టు’ సినిమా ఎంతో మంచి చిత్రం అయినాసరే ప్రేక్షకులకు ఎందుకో అది నచ్చలేదు. కానీ ఇప్పుడు దానికి ఏ మాత్రం తగ్గకుండా తీసిన చిత్రమే ఒక మనసు….అయితే మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక రావడంతో పాటు సినిమా విడుదలకు ముందే తెగ పబ్లిసిటీ ఇవ్వడంతో ఒక మనసు ఇప్పుడు ప్రేక్షకుల మధ్య బాగా రిజిస్టర్ అయ్యింది.

కథలోకి వస్తే….

సూర్య పాత్రలో నటించిన నాగశౌర్య ఎమ్మెల్యే అయిపోవాలన్న తన తండ్రి కలను నెరవేర్చడానికి కృషి చేస్తాడు. అయితే అతని జీవితంలోకి అనుకోని రీతిలో సంధ్య క్యారక్టర్ లో నిహారిక ప్రవేశిస్తుంది. ఆమె ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థిని. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. కానీ సూర్య ఎప్పుడూ ఎవరితోనో ఒకరితో గొడవ పడుతుండటం, . రాజకీయాల్లోకి వెళ్లడం ఆమెకు నచ్చదు. కానీ అతనికి దూరం కాలేకపోతుంది.

ఇదిలా ఉండగా, ఓ ఘర్షణలో నాగశౌర్య జైలు పాలవుతాడు. అతను బెయిలు మీద బయటకు వచ్చినా ఆ కేసుతో అతని భవిష్యత్తు సందిగ్ధంలో పడుతుంది. అప్పటికి కూడా నిహారిక అతనితోనే ఉండాలని ఆశపడుతోంది. కానీ కొన్ని అనుకోని కారణాలతో నిహారిక అతనికి దూరమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు నిహారిక ఎటువంటి నిర్ణయం తీసుకుందో తెలియాలంటే సినిమా చూడకతప్పదు.

పోస్టర్లు విడుదల చేసినప్పుడే ‘ఒక మనసు’ ఓ చక్కని అందమైన సినిమా అనే భావన కల్పించింది.అందుకుతగ్గట్టే ఓ మంచి కవిత చదివిన ఆనందం కలిగించింది సినిమా చూస్తున్నంత సేపు. అయితే అదేసమయంలో ఎంతో నెమ్మదిగా సాగిన ఈ ఎమోషనల్ పిక్చర్ ని ఆస్వాదించే మనసు ఎందరికి ఉంటుందో ఆలోచించాలి. ఓపిక ఉన్నవాళ్లకు ఇది మంచి సినిమాయే. లేనివాళ్లు విషయమే ఓ ప్రశ్న. ఇదొక భావోద్వేగాల సంఘర్షణకు అద్దం పట్టిన చిత్రం. ప్రేమమనసులకు ఈ చిత్రం నచ్చుతుంది. వారి మధ్య మాటలు బాగున్నాయి. మంచి అనుభూతి కలుగుతుంది. కానీ ఎమోషన్ లేని ప్రేక్షకులకు ఇదొక పరీక్ష.

నాగశౌర్య సూర్య పాత్రలో గొప్పగా జీవించాడు. అతని నటన ఎంతో మెరుగుపడింది. చాలా బాగా నటించాడు. మొదటిసారిగా హీరోయిన్ గా నటించిన నిహారిక నటనను బెస్ట్ అని చెప్పలేము కానీ పరవాలేదు. విసుగు పుట్టదు. నిహారిక నటనలో మరింత పరిణతి చెందాలి. రావు రమేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఆయనకు ఆయనే సాటి. అవసరాల శ్రీనివాస్, రాజా రవీంద్ర తదితరులు తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు.

పాటలు పరవాలేదు.

ఏదేమైనా ఇదో గొప్ప భావోద్వేగ ప్రేమ కథా చిత్రం అనడానికి ఆలోచించక్కర లేదు.

Send a Comment

Your email address will not be published.