ఏప్రిల్ 17వ తేదీన విడుదల అయిన చిత్రం ఓకే బంగారం.
తెలుగులో మళ్ళీ చాలాకాలానికి మణిరత్నం దర్శకత్వంలో “ఓకె బంగారం” సినిమా వచ్చింది. ఈ చిత్ర నిర్మాత దిల్‌రాజు. సంగీతం స్వరపరచినది ఏ.ఆర్.రెహమాన్. ఈ సినిమా కథాంశం కొత్తదైనా కథ మాత్రం చాలా పాతదే. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీకి హ్యాట్స్ ఆఫ్.
దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్, ప్రకాష్ రాజ్, లీలా శామ్సన్ తదితరులు నటించిన చిత్రం “ఓకె బంగారం”.
ఒక ప్రముఖ గేమింగ్ సంస్థలో ఉద్యోగిగా చేరి ముంబై వచ్చిన ఆదిత్య పాత్రలో నటించిన దుల్కర్ సల్మాన్ ఆ నగర స్టేషన్ కు చేరుకోగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న తార పాత్రలో నటించిన నిత్యామీనన్‌ను చూస్తాడు. అనంతరం ఆమె ఆత్మహత్య ప్రయత్నాన్ని మానుకుంటుంది. కొంత కాలం అనంతరం వీళ్ళిద్దరూ ఒక కార్యక్రమంలో ఎదురుపడతారు. ఇద్దరూ దగ్గరవుతారు. తను పెరిగిన వాతావరణం వల్ల పెళ్ళి అనే పద్ధతి నిత్యకు గిట్టదు. మరోవైపు దుల్కర్ కు కూడా పెళ్ళి ఇష్టముండదు. అంతేకాదు అమెరికా వెళ్లి అక్కడ ఒక సంస్థ ఆరంభించాలని దుల్కర్ అనుకుంటాడు. ఇంకోవైపు నిత్యకు పారిస్ వెళ్ళి ఆర్కిటెక్చర్ చదవాలని అనుకుంటుంది. వీళ్ళిద్దరూ తమ ఆశయ సాధనకోసం ఉన్న సమయంలో ఓ ఆరు నెలలు పెళ్లి చేసుకోకుండా సహ జీవనం చేయాలనుకుంటారు. దుల్కర్ తాను ఉన్న ఇంట్లోనే నిత్య తో సహజీవనం చేస్తుంటాడు. దుల్కర్ తానూ ఉంటున్న ఇంటి యజమాని ప్రకాష్ రాజ్ దంపతులను ఒప్పించి నిత్యతో సహజీవనం చేస్తాడు. అయితే వీళ్ళిద్దరూ ఒకరినొకరు వదిలేసి వెళ్ళిపోయే సమయమొస్తుంది. అప్పుడు వాళ్ళల్లో ఎలాంటి మార్పు వచ్చింది? ప్రకాష్ రాజ్ దంపతుల నుంచి వాళ్ళు ఏం తెలుసుకున్నారు అనేదే మిగిలిన కథ.
ఈ సినిమాకు మణిరత్నం స్క్రీన్‌ప్లే ప్రధానమైంది. సినిమా సాగే కొద్దీ ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. ఇంటర్వెల్ తర్వాత కొన్నిభావపూరిత సన్నివేశాలను చూపించడంలో మణిరత్నం తనదైన మార్క్ తో విజయవంతమయ్యారు.
దుల్కర్, నిత్యామీనన్ల కెమిస్ట్రీ చాలా గొప్పగా ఉంది. అందుకే వారిద్దరినీ చూడగానే ఎవరైనా సరే వారి అభిమానులుగా మారిపోవడం ఖాయం. వీరిద్దరి నటన అద్భుతం. ప్రకాష్ రాజ్, లీలా శామ్సన్ లు కూడా బాగా నటించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చక్కగా ఉంది.
మొత్తం మీద “ఓకే బంగారం” చూడదగ్గ చిత్రమే.