..కథానాయిక కూడా ...!

ప్రముఖ హాస్య నటుడు రేలంగి పేరు చెప్పడంతోనే గిరిజ పేరు కూడా గుర్తుకు రాకమానదు. అందుకు కారణం, ఆమె రేలంగి సరసన నటించడమే. ఈ క్రమంలో ఆమె ఓ హాస్య నటిగా పేరు ప్రఖ్యాతులు గడించారు. అయితే ఆమె కథానాయికగా కూడా నటించి ప్రశంసలు అందుకున్నారు.

girija1938 లో మార్చి మూడో తేదీన కృష్ణా జిల్లా కంకిపాడులో పుట్టిన గిరిజ తల్లి దాసరి రామతిలకం. గిరిజ తల్లి కూడా రంగ స్థల నటిగానే కాకుండా సినీ నటిగా కూడా తనకంటూ ఓ ప్రత్యెక స్థానం సంపాదించారు. అయితే గిరిజ గుడివాడలో పెద్దమ్మ దగ్గర పెరిగి అక్కడే చదువుసంధ్యలు నేర్చుకున్నారు. ఆమె పదమూడో ఏట మద్రాసు నగరానికి వెళ్లి అమ్మ దగ్గర ఉండిపోయారు. గిరిజది చక్కటి ముఖ వర్చస్సు. చూడగానే ఆకట్టుకునే రూపం. అందానికి మారు పేరుగా చెప్పుకునే గిరిజకు చిత్రాలలో నటించాలనే కోరిక కలిగింది. దాంతో ఆమె ఫోటో తీసుకు వెళ్లి కస్తూరి శివ రావుకి చూపించారు. గిరిజ ఫోటోలు చూసీ చూడటంతోనే శివరావుకు నచ్చేసింది. అంతే అమాంతం ఆయన తాను నిర్మించిన పరమానందయ్య శిష్యుల కథ చిత్రంలో ఆమెకు నటించే అవకాశం కల్పించారు. పైగా అప్పటికే నటుడిగా ఓ స్థాయికి ఎదిగిన అక్కినేని నాగేశ్వర రావు సరసన రాజకుమారిగా నటించే అదృష్టం దక్కింది గిరిజకు. కానీ ఆ చిత్రం అప్పట్లో ఓ మోస్తరు ఆడింది. అది 1950 లో వచ్చిన చిత్రం. అయినా గిరిజకు అనుకోకుండా రేలంగితో పరిచయం ఏర్పడటం, ఆయన తన వంతు కృషి చేసి “పాతాళభైరవి” చిత్రంలో నటించే అవకాశం కల్పించారు. పాతాళభైరవి చిత్రానికి ముందు 1951లో నవ్వితే నవరత్నాలు అనే చిత్రంలో నటించింది గిరిజ. అది ఆమెకు రెండో చిత్రం. కానీ పాతాలభైరవి చిత్రంలో ఆమె పాతాళభైరవి వేషంలో నటించారు. ఈ చిత్రం తర్వాత ఆమె వెనుతిరిగి చూడలేదు. ఆమెను వెతుక్కుంటూ అనేక అవకాశాలు వచ్చి యాభై, అరవై దశకాలలో అనేక చిత్రాలలో నటించి అందరి మన్ననలు పొందింది. అప్పటి హీరో హీరోయిన్లకు ఏమాత్రం తీసి పోనీ రీతిలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు గిరిజ. పాతాలభైరవి చిత్రంలో గిరిజ “నరుడా ఏమి నీ కోరిక” అనే డైలాగు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన గిరిజ రేలంగి సరసన నటించి హాస్యనటిగా అచిరకాలంలోనే ఆహా ఓహో అనే స్థాయికి ఎదగడం చెప్పుకోదగ్గ అంశం. పాతాళభైరవి చిత్రం ఆంద్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలోని 28 థియేటర్ లలో వంద రోజులు చొప్పున ఆడి అప్పట్లో చరిత్ర సృష్టించింది. అంతేకాదు, 1952 లో మన దేశంలో మొదటిసారిగా జరిగిన అంతర్జాతీయ ఫిల్మోత్సవానికి ఎన్నిక అయిన నాలుగు చిత్రాలలో పాతాళభైరవి కూడా ఉండటం విశేషం.

1952 లో ధర్మవీరుడు (పాత్ర పేరు – వాసంతి), వెలుగునీడలు (పాత్ర పేరు – వరలక్ష్మి) చిత్రాలలో నటించిన గిరిజ మరుసటి ఏడాది ద్విభాషా చిత్రంలో నటించే అవకాశం దక్కింది. తెలుగులో నా ఇల్లు చిత్రంలో నటించిన గిరిజ తమిళంలో ఎన్ వీడు (ఎం అంటే నా, వీడు అంటే ఇల్లు అని అర్థం) పేరుతో వచ్చిన చిత్రంలో నటించింది. ఇక 1954లో తమిళంలో వచ్చిన మనోహరా అనే చిత్రంలో యువరాణిగా నటించిన గిరిజకు అన్నపూర్ణ, గుడిగంటలు, అప్పు చేసి పప్పు కూడు, జగదేకవీరుని కథ, ఆరాధన తదితర చిత్రాలు బాగా పేరు తెచ్చి పెట్టాయి.

హాస్యనటిగానే కాకుండా అక్కినేని నాగేశ్వర రావు, ఎన్ టీ రామారావు, జగ్గయ్య, శివాజీ గణేషన్, హరనాథ్, చలం వంటి మేటి కథానాయకుల సరసన కూడా ప్రముఖ పాత్రలలో నటించడం చెప్పుకోదగ్గ విశేషం.

తన పదిహేడో ఏట తల్లి రామతిలకంను కోల్పోయిన గిరిజకు ఒక దర్శకుడితో పెళ్ళయ్యింది. ఆయన పేరు సి సన్యాసి రాజు. భర్తను సినీ నిర్మాతగా చూడాలనుకుని ఆమె విజయగిరి ధ్వజ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది. ఈ సంస్థ కింద 1969 లో భలే మాస్టారు చిత్రం తీసారు. ఈ చిత్రంలో ఎన్ టీ ఆర్, కాంచన జంటగా నటించారు. ఆ తర్వాత మరో రెండేళ్లకు ఎన్టీ ఆర్ తో ఇంకొక సినిమా తీసారు. ఈ చిత్రం పేరు పవిత్ర హృదయాలు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన చంద్రకళ నటించారు. గిరిజ నిర్మాణంలో వచ్చిన ఈ రెండు చిత్రాలూ సరిగ్గా ఆడకపోవడంతో ఆమె ఆస్తిపాస్తులు కరిగిపోయాయి. అంతేకాదు ఆమెకు నటించే అవకాశాలు కూడా క్రమేపీ తగ్గాయి. గిరిజ చివరగా నటించిన చిత్రం ఆడదాని అదృష్టం. ఈ చిత్రం 1974 లో వచ్చింది.

టైగర్ రాముడు, లవకుశ, అప్పు చేసి పప్పు కూడు, మంగమ్మ శపథం, భట్టి విక్రమార్క తదితర చిత్రాలలో రేలంగి, గిరిజ మధ్య చిత్రీకరించిన హాస్యభరిత సన్నివేశాలు ఎప్పటికీ ఆకు పచ్చని జ్ఞాపకాలే.

సొంత ఇల్లు కోల్పోయి ఓ అద్దె ఇంట్లో ఉండాల్సిన పరిస్థితిలో జీవనం గడిపిన గిరిజకు పూట గడవడం కూడా కష్టమైంది. కొందరు సహనటీనటులు ఆమెను ఆదుకున్నారు కూడా.

ఆమె కుమార్తె శ్రీరంగ. ఈమె కూడా నటే. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన మేఘసందేశం చిత్రంలో నటించిన శ్రీరంగ ఆ తర్వాత సలీమాగా పలు మళయాళ చిత్రాలలో నటించింది. ఈమె 1975 – 1989 సంవత్సరాల మధ్య నటించారు. ఆమె నాట్యం కూడా చేసే వారు.
– చౌటపల్లి నీరజ

Send a Comment

Your email address will not be published.