కదిలించే ‘కణం’

kanam-movie

హారర్ చిత్రాలు తెలుగులో ఎన్నో వచ్చాయి..వాటిలో విజయవంతమైనవి కొన్నే. అలాంటిదే శుక్రవారం విడుదలైన “కణం”.. అయితే కొంచెం విభిన్నమైన సినిమా ఇది. ఎందుకంటే హారర్‌ సినిమాలు తీయడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో శైలి. ఒకరు భయంతో నవ్వులు పూయిస్తే, మరొకరు అదే భయానికి కాస్త సందేశాన్ని, మరికాస్త సెంటిమెంట్‌ను ఇంకాస్త ఎమోషన్‌ను కూడా జోడిస్తారు. రెండో కోవకు చెందిన దర్శకుడే ఏఎల్‌ విజయ్‌. గతంలో ఆయన తెరకెక్కించిన చిత్రాలు చూస్తే అది మనకు అర్థమవుతుంది. తాజాగా మరో విభిన్న కథాంశంతో తమిళంలో తెరకెక్కించిన చిత్రం ‘దియా’ తెలుగులో ‘కణం’ పేరుతో వచ్చింది. అయితే ఇందులో యువ కథానాయకుడు నాగశౌర్య, తెలుగువారికి బాగా దగ్గరైన సాయిపల్లవి జంటగా నటించడం విశేషం. మరి ఏఎల్‌ విజయ్‌ తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉంది? నాగశౌర్య, సాయిపల్లవి ఏ మేరకు ఆకట్టుకున్నారు? అసలు ‘కణం’ కథేంటి?

కథలో ఏముంది?
కృష్ణ(నాగశౌర్య), తులసి(సాయిపల్లవి) చదువుకుంటున్నప్పుడే ప్రేమించుకుంటారు. పెళ్లికి ముందే తొందరపడతారు. దీంతో తులసికి గర్భం వస్తుంది. kanamఆ వయసులో పెళ్లి చేయడం ఇరు కుటుంబాలకు ఇష్టం ఉండదు. దీంతో తులసిని బలవంతం చేసి అబార్షన్‌ చేయిస్తారు. అందుకు కృష్ణ కూడా ఒప్పుకొంటాడు. అయిదేళ్ల పాటు అటు కృష్ణని, ఇటు తులసిని కలవకుండా ఉంచుతారు. కృష్ణ చదువు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగంలో చేరిన తర్వాత తులసిని ఇచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లయిన తర్వాత కూడా తులసి ముభావంగానే ఉంటుంది. అయిదేళ్ల కిందట కడుపులో చనిపోయిన పాప గురించి ఆలోచిస్తుంటుంది. ఆ పాపకు దియా అని పేరు పెట్టుకుంటుంది. అయితే కృష్ణ రాకతో తులసి జీవితం మళ్లీ ఆనందమయం అవుతుంది. కానీ, దియా అనే పాప వాళ్ల మధ్య ఆత్మ రూపంలో తిరుగుతుంటుంది. తన తల్లిని తనని దూరం చేసిన వాళ్లందరి మీద పగ తీర్చుకుంటుంది. తనింట్లో తనకు పుట్టని ఓ పాప తిరుగుతోందని, అది ఆత్మ రూపంలో ఒక్కొక్కరిని చంపేస్తోందని తెలుసుకున్న తులసి ఏం చేసింది? ఆ ఆత్మ నుంచి తన భర్తను ఎలా కాపాడుకుంది? అనేది కథ

అమ్మ పిలుపు కోసం తపించే ఆత్మ
ఇది ఒక ఆత్మ కథ. ఇందుకు దర్శకుడు భ్రూణ హత్యలను పాయింట్‌గా తీసుకున్నాడు. ఈ లోకాన్ని చూడకుండానే ఎన్నో పిండాలు బలైపోతున్నాయి. ప్రస్తుతం అబార్షన్‌ అనేది చాలా చిన్న మాట అయిపోయింది. కానీ, కడుపులో ఉన్న పిండానికీ ప్రాణం ఉంటుందని, తల్లిని చూడటానికి తహతహలాడుతుంటుందని అనుకొని దానిపై సినిమా తీయాలన్న దర్శకుడి ఆలోచనను అభినందించకుండా ఉండలేం. హారర్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో చాలా సినిమాలు వచ్చాయి. చిన్నపిల్లల శరీరంలోకి ఆత్మలు వెళ్లిపోవడం, వారితో హత్యలు చేయించడం అనేది కూడా పాతదే. కానీ, ఆ ఆత్మ ఒక పిండానిది కావడం ప్రేక్షకుడిని కదిలిస్తుంది. అమ్మ పిలుపు కోసం ఆ ఆత్మ ఎప్పుడూ పరితపిస్తుంటుంది. ఈ సన్నివేశాలకు భయం, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో పాటు, తల్లి సెంటిమెంట్‌ను కూడా జోడించి ఎమోషనల్‌గా చూపించాడు. తనింట్లో తన కళ్ల ముందే తనకు కనిపించకుండా తనకి పుట్టని ఓ కూతురు తిరుగుతోందని తెలుసుకున్న ఓ తల్లి ఏం చేస్తుంది? ఎలా ఆలోచిస్తుంది? ఎలా ఉద్వేగానికి లోనవుతుంది? అనే పాయింట్‌ హృదయానికి హత్తుకునేలా దర్శకుడు తీర్చిదిద్దాడు. విశ్రాంతి ఘట్టం అందరినీ కదిలిస్తుంది. ఆ..! అబార్షన్‌ ఏముంది చాలా చిన్న విషయం అనుకున్నవారికి ఈ సినిమా ఒక కనువిప్పు. సాధారణంగా సినిమాల్లో ఆత్మలను, దెయ్యాలను చూడగానే భయం కలుగుతుంది. కానీ, దియాను చూడగానే ప్రేమ కలుగుతుంది. దర్శకుడి ఆలోచన కూడా అదే కావచ్చు.
సెకండాఫ్ ప్రారంభంలో కథ కాస్త నెమ్మదిస్తుంది. దియా టార్గెట్‌ ఏంటో తెలిసిన తర్వాత కథను నడిపించడం మామూలు విషయం కాదు. సాధారణంగా సన్నివేశాల్లో స్తబ్దత వచ్చేస్తుంది. పోలీసు విచారణ మొదలైన తర్వాత మళ్లీ కథలో చలనం వస్తుంది. క్లైమాక్స్‌ అంతుపట్టని విధంగా రాసుకున్నాడు దర్శకుడు. అక్కడ కూడా తల్లీ కూతుళ్ల మధ్య ఉన్న ఎమోషనల్‌ బాండింగ్‌ను హైలైట్‌ చేశాడు. ద్వితీయార్ధం అంతా ఒక భర్తను కాపాడుకునేందుకు భార్య పడే తపన కనపడుతుంది. అదే సమయంలో క్లైమాక్స్‌ కొత్తగా ఉంది. గుండెలకు హత్తుకునేలా ఆయా సన్నివేశాలు ఉంటాయి. ఇంతకు మించిన క్లైమాక్స్‌ ఊహించకూడదు. కథకు మంచి ముగింపు ఇచ్చాడు దర్శకుడు.

మూడు పాత్రలే కీలకంః
మూడు పాత్రల మధ్య సాగే కథ ఇది. కృష్ణ, తులసి, దియాల మధ్య సాగే కథ. సాయి పల్లవి మరోసారి ఆకట్టుకుంటుంది. తల్లిగా, భార్యగా తన ఎమోషన్‌తో కట్టిపడేసింది. విశ్రాంతి ముందు సాయిపల్లవి నటన తప్పకుండా నచ్చుతుంది. ఎప్పుడూ చలాకీగా కనిపించే నాగశౌర్య ఈసారి సీరియస్‌ పాత్రలో కనిపిస్తాడు. ఒక రకంగా ఇది తనకి కొత్త ప్రయత్నమే. దియాగా నటించిన పాప విరోనికా నటన మెప్పిస్తుంది. డైలాగ్‌లు కూడా ఉండవు. ‘నిన్ను చూడనీయకుండా చేశారు కదమ్మా!’ అనే ఒకే ఒక్క డైలాగ్‌ ప్రేక్షకుల హృదయాలను పిండేస్తుంది. ఇందులో ప్రియదర్శి ఎస్సైగా కనిపిస్తాడు. మొదట్లో తన పాత్రని కాస్త కామెడీ చేశారు. చివర్లో సీరియస్‌నెస్‌ తీసుకొచ్చారు. మిగిలిన వాళ్లు పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా.. సినిమా బాగుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతానికి మంచి మార్కులు పడతాయి. తక్కువ బడ్జెట్‌లో తీసిన సినిమా ఇది. కానీ, ఎక్కడా అలాంటి ఫీలింగ్‌ రాదు. భ్రూణ హత్యల నేపథ్యంలో ఒక కథను ఇలా కూడా చెప్పొచ్చా..? అనిపిస్తుంది. దర్శకుడి ఆలోచనకు, అతను తీసిన విధానానికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే. నాగశౌర్య, సాయిపల్లవి, దియాల నటన, సాంకేతిక నిపుణుల పనితనం, నిడివి, క్లైమాక్స్‌ ఈ సినిమాకి బలాన్నిస్తే రెగ్యులర్‌ ప్రేక్షకులకు నచ్చకపోవడం ప్రధానమైన బలహీనత. అంతేకాదు ద్వితీయార్ధంలో ప్రారంభ సన్నివేశాలు కూడా అంత ఆకట్టుకునేలా లేవు

తెరముందుః
నటీనటులు: నాగశౌర్య.. సాయిపల్లవి.. విరోనికా అరోరా.. గాంధారి నితిన్‌.. ప్రియదర్శి.. సంతాన భారతి.. రేఖ.. రవి.. స్టంట్‌ సిల్వా తదితరులు

తెరవెనుకః
సంగీతం: శామ్‌ సీఎస్‌, సినిమాటోగ్రఫీ: నీరవ్‌ షా, ఎడిటింగ్‌: ఆంథోని, నిర్మాత: అలీరాజా సుభాష్‌కరణ్‌, దర్శకత్వం: ఏ.ఎల్‌.విజయ్‌

Send a Comment

Your email address will not be published.