కనకం కన్నుమూత

ప్రముఖ సినీనటి కనకం విజయవాడలో కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, శోభన్‌బాబు తదితరులు నటించిన సినిమాల్లో కనకం నటించారు. హాస్యనటిగా ఆమె ప్రసిద్ధులు. కనకం మృతి పట్ల సినీరంగం తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది.

చిత్ర రంగంలోకి ప్రవేశించక ముందు ఆమె నాటకాలు ఆడారు. సినిమాలో నటించడం మొదలు పెట్టిన తర్వాత కూడా ఆమె నాటకాలలో నటించడం మానలేదు. గృహప్రవేశం, గుణసుందరి కథ, కీలుగుర్రం, రక్షారేఖ, షావుకారు, పాతాళభైరవి, దాసి, లేత మనసులు, భక్త ప్రహ్లాద తదితర సినిమాల్లో ఆమె నటించారు. ఆమె పాటలు కూడా పాడేవారు.

1930లో అప్పారావు, సోళాపురమ్మ దంపతులకు ఖరగ్‌పూర్ లో కనకం జన్మించారు. ఆమె తండ్రిగారు ఉద్యోగరీత్యా విజయవాడలో స్థిరపడ్డారు. ఆ రోజుల్లో రంగస్థలం మీద పురుషులే స్త్రీ పాత్రలను వేసేవారు. బళ్లారి రాఘవలాంటి గొప్ప నటుల ప్రోత్సాహంతో నటిగా పరిచితురాలైన కనకం పురుషులకు దీటుగా పాటలూ, పద్యాలూ పాడి పలువురి మన్ననలు అందుకున్నారు.

చిన్ననాడే ఆమె ఆకాశవాణి బాలల కార్యక్రమంలో తన గొంతు వినిపించారు. 1948లో మద్రాసు ఆలిండియా రేడియో ఆమె పాడిన జానపద గేయాలను ప్రత్యేకించి ప్రసారం చేయడం విశేషం.
ఆమె నటించిన తొలి నాటకం నాయకురాలు. నాటకాలలో ఆమె కురుక్షేత్రం నాటకంలో కృష్ణ పాత్రను, పాండావోద్యోగంలో అర్జునుడు, కృష్ణ పాత్రలను, కృష్ణ తులాభారంలో నారదుడు, కృష్ణ పాత్రలను, రామాంజనేయ యుద్ధంలో రాముడి పాత్రను, చింతామణి నాటకంలో చింతామణి పాత్రను పోషించారు.

కీలుగుర్రం, గుణసుందరి కథ, షావుకారు చిత్రాలలోని పాత్రలు ఆమెకు మంచి గుర్తింపునే తెచ్చిపెట్టాయి. షావుకారు చిత్రంలో ఆమె “చాకలి రామి” పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు.

అవకాశాలు కలిసి వచ్చిన కాలంలో ఓ వెలుగు వెలిగిన కనకం తర్వాత అవకాశాలు సన్నగిల్లినప్పుడు దుర్భర జీవితం గడిపారు.

నాటకరంగంలో చేసిన కృషికిగాను తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక పురస్కారం, సినీ రంగంలో సేవలందిన వారికి ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ ఆర్ట్ అవార్డ్ ను కనకం అందుకున్నారు.

Send a Comment

Your email address will not be published.