"కబాలి" సంచలనమే

డబ్బింగ్ సినిమా చరిత్రలో “కబాలి” సంచలనమే సృష్టించింది.

కొంతకాలంగా ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ రజనీ కాంత్ చిత్రం “కబాలి” విశ్వవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదలకు ముందే మొదటివారానికి సంబంధించిన టిక్కెట్లు అమ్ముడైపోవడం ఇటీవలి కాలంలో ఓ రికార్డు.

ఇలా ఉండగా, తెలుగు కబాలి వెర్షన్ హక్కులను షణ్ముక ఫిల్మ్స్ 31 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ హక్కుల అమ్మకం కూడా భారీ మొత్తానికి పెట్టింది. నైజాంలో డిస్ట్రిబ్యూషన్ హక్కులను అభిషేక్ పిక్చర్స్ సుమారు 8.75 కోట్ల రూపాయలకు సొంతం చేసుకోగా తూర్పు గోదావరి 2.5 కోట్లు, పశ్చిమ గోదావరి 2 కోట్లకు దక్కించుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు భారీ మొత్తాలకు అమ్ముడుపోవడం విశేషం.

అయితే ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు లీక్ అవ్వడం సోషల్ మీడియాలో కలకలం రేపింది. రజనీ ఇంట్రోతో పాటు కొన్ని ఇతర సన్నివేశాలు లీకై, వాట్సాప్ తదితర మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. అయితే ఈ సన్నివేశాలు ఎక్కడి నుంచి ఎలా లీక్ అయ్యాయో తెలియడంలేదు.

దీనితో రజనీకాంత్ అభిమానులు, సినీ పరిశ్రమ మాత్రం ఈ సన్నివేశాల వీడియోలను తొలగించి సినిమాను థియేటర్లలోనే చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పా రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను కళైపులి థాను నిర్మించారు.