కమల్ తర్వాత నానీ బెస్ట్

ఇటీవలే విడుదల అయిన “జెంటిల్మన్” చిత్రంలో నటించిన నివేదా థామస్ కు టాలీవుడ్ లో ఇదే మొదటి చిత్రం.

కేరళకు చెందిన నివేదా థామస్ ఇప్పుడు చెన్నైలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. పాపనాశనం అనే ఓ చిత్రం పై తన ఇంటర్వ్యూ చూసిన దర్శకుడు మోహన్, సహాయ దర్శకుడు సురేష్ తనను కలిసి జెంటిల్మన్ సినిమాలో నటించమని అడిగారని నివేదా చెప్పారు. మోహన్ కథ చెప్పడం మొదలుపెట్టిన వెంటనే తనకు ఆ కథ ఎంతో నచ్చిందని ఆమె అన్నారు. కథ పై పుట్టిన ప్రేమతోనే జెంటిల్మన్ చిత్రంలో తానూ ఓ పాత్ర పోషించాలని అనుకున్నానని నివేదా తెలిపారు.

ఆమె కొన్ని తమిళ, మళయాళ చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు. తనకు నాని నటన చాలా ఇష్టమని, అందుకే తాను నానీ వీరాభిమాని అయ్యానని నివేదా చెప్పారు. నాని నటించిన చిత్రాలేవీ మిస్సవకుండా చూస్తూ వస్తున్నానని అంటూ తమిళ చిత్రం అయిన వెప్పంలో నాని నటన ఎంతో గొప్పగా ఉందని చెప్పారు. 2008 లో తాను చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించానని , అప్పుడు నానే మొదటి సినిమా వచ్చిందని గుర్తు చేసారు.

నానీ గొప్ప నటుడే అందులో తనకు ఎలాంటి సందేహం లేదని, కమల్ హాసన్ తర్వాత బెస్ట్ యాక్టర్ ఎవరని తనను అడిగితే ఏ మాత్రం ఆలోచించకుండా నానీ పేరు చెప్తానని నివేదా చెప్పారు.

నానీ సహజ నటుడని, ఇప్పుడు అతనితో కలిసిన జెంటిల్మన్ చిత్రం తన కెరీర్ లో మరచిపోలేని గొప్ప అనుభవమని ఆమె చెప్పారు.

కమల్ హాసన్, గౌతమి అంటే తనకు ఓ ప్రత్యేకమైన అభిమానం ఉందని, మలయాళంలో వచ్చిన దృశ్యం అనే చిత్రాన్ని తమిళంలో పాపనాశనం అనే పేరుతో రిమేక్ చేయగా అందులో తాను శృతి హాసన్ తో కలిసి నటించానని అన్నారు. తనను ప్రోత్సహించే వారిలో గౌతమి ఎప్పుడూ ముందు ఉంటున్నారని ఆమె తెలిపారు.

ప్రస్తుతం నివేదా చదువుకుంటూనే మరోవైపు నటిస్తున్నారు సినిమాల్లో. తనకు తెలుగు, తమిళం, మలయాళం అంటూ ఏ చిత్ర పరిశ్రమా పెద్దగా తేడాలేదని, అంతా ఒకటేలా ఉందని అన్నారు నివేదా. అయితే టాలీవుడ్ లో వినూత్నమైన స్క్రిప్ట్లు వస్తున్నాయని, వాటిలో తనకు ఏదైనా నచ్చితే తప్పకుండా నటిస్తానని ఆమె అన్నారు.

Send a Comment

Your email address will not be published.