కరీనాపై చిత్రీకరిస్తారని తెలీదు

ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ పై చిత్రీకరించిన ఓ ఐటెం సాంగ్ టీజర్ తాజాగా విడుదలైనప్పటి నుంచి ఇప్పుడు ఎవరి నోట విన్నా ఆ పాటే. బ్రదర్స్ అనే చిత్రంలో మేరా నాం మేరీ అనే పాట అది. ఇంతకూ ఆ పాట పాడింది ఎవరో కాదు, హైదరాబాద్ అమ్మాయి శ్రీపాద చిన్మయి. ఆమె తన 15 ఏళ్ళ కెరీర్ లో పాడిన మొదటి ఐటెం సాంగ్ ఇది. ఆమె చెన్నైలో పెరిగినప్పటికీ ఇప్పుడు చాలా కాలంగా హైదరాబాద్ లోనే ఉంటోంది. ఆమెకు నటుడు రాహుల్ రవిచంద్రన్ తో పెళ్లి అయ్యింది.

ఈ ఐటెం సాంగ్ గురించి మాట్లాడుతూ ఒకరోజు అమితాభ్ భట్టాచార్య నుంచి తనకు కాల్ వచ్చిందని, ఐటెం సాంగ్ కోసం ఒక ప్రత్యేకమైన వాయిస్ ఎదురుచూస్తున్నామని ఆయన చెప్పారని, ఆ తర్వాత తాను మ్యూజిక్ కంపోజర్స్ అజయ్ – అతుల్ తో మాట్లాడానని చిన్మయి అన్నారు. అజయ్ – అతుల్ ఒక పాట పంపుతూ దానిని పాడి వాయిస్ నోట్ జత చేస్తూ తమకు పంపమన్నారని. ఆ మేరకే తాను పాడి పంపానని చిన్మయి అన్నారు. తాను పాడిన ఈ ఐటెం సాంగ్ తప్పకుండా హిట్ అవుతుందని ముందే ఊహించానని, అయితే దీనిని కరీనాపై చిత్రీకరిస్తారని తనకు తెలియదని, చిత్ర దర్శకుడు కరణ్ మల్హోత్రా పాట రికార్డు అయిన తర్వాతే ఆ పాటను కరీనా పై చిత్రీకరించినట్టు తనకు తెలిపారని ఆమె చెప్పారు. కరీనా మీద ఆ పాట చిత్రీకరిస్తే తాను అనుకున్న దానికన్నా మరింత పెద్ద హిట్టయ్యిందని అన్నారు. అందుకు తనకెంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ పాట టీజర్ విడుదల అయినప్పటి నుంచి చిన్మయిని ప్రశంసిస్తూ ఎందరో ఆమెకు ఫోన్ చేస్తున్నారు కూడా. చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో కూడా ఆమె ఒక పాట పాడింది.

చిన్మయి శాస్త్రీయ సంగీతంతో పాటు హిందుస్తానీలోనూ శిక్షణ పొందిన గాయని. అయితే తాను ఇప్పుడు ఐటెం సాంగ్ పాడిన గాయనిగా గుర్తింపు పొందడం ఆశ్చర్యంగా ఉందని చెప్పారు చిన్మయి.

ఐటెం సాంగ్స్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నప్పటికీ ప్రజలు లలితమైన పాటలను స్వాగతిస్తారని తెలుసనీ, అయితే ఐటెం సాంగ్ పాడాలంటే ప్రత్యేకమైన వాయిస్ కల్చర్ అవసరమని, పాడే తీరులోనే కాస్త భిన్నత్వం కనబరచాలని చిన్మయి అన్నారు. తాను ఇప్పుడు పాడిన ఐటెం సాంగ్ లో కొన్ని పదాలు తనకు చాలా కొత్తవని, ఆ పదాలను ఎలా పాడాలో నేర్చుకుని పాడానని అన్నారు. మొదట్లో నెర్వస్ గానే ఫీల్ అయ్యానని, అయితే కంపోజర్స్ తనకెంతో సహకరించారని చెప్పారు.

30 ఏళ్ళ చిన్మయి ధర్మా ప్రొడక్షన్స్ కి ఇప్పటికే చాలా పాటలు పాడారు. అలాగే బాలీవుడ్ లో ఆమె అనేక ట్రాక్స్ కి పాడారు కూడా.

బాలీవుడ్ కోసం ముంబై వెళ్ళిపోతారా అని అడగ్గా, బాలీవుడ్ లో పాడటం వల్ల బాగా పాపులర్ కావచ్చని తెలుసనీ, అంతమాత్రాన ఒక్క భాషకే తాను పరిమితం కాదలచుకోలేదని చిన్మయి స్పష్టం చేశారు.

Send a Comment

Your email address will not be published.