కళాప్రపూర్ణ జగ్గయ్య

K Jaggaiah

“కళాకారుడు అనే వాడు ఎప్పుడూ ఒకే రకం పాత్రతో సరిపెట్టుకోకూడదు” అనే అభిప్రాయంవల్లే రకరకాల పాత్రలతో ప్రేక్షకులను రంజింపచేసిన సుప్రసిద్ధ నటుడు కొంగర జగ్గయ్య అక్షరాలా బహుముఖ ప్రజ్ఞాశాలి. రంగస్థల నటుడే కాదు సినీ నటుడు. రచయిత. పాత్రికేయుడు. చిత్రకారుడు. రాజకీయాలతోనూ ప్రత్యక్ష సంబంధం ఉన్న వ్యక్తి. రేడియోలో వార్తలు చదివిన అనుభవం. కళావాచస్పతి అనిపించుకున్న జగ్గయ్య కంఠం కంచుకంఠంగా ప్రఖ్యాతి చెందింది.

జగ్గయ్య గుంటూరు జిల్లాలోని మోరంపూడి అనే పల్లెలో 1928 డిసెంబర్ 31వ తేదీన జన్మించారు. వీరిది ధనిక కుటుంబమే. ఆయన తల్లిపేరు రాజ్యలక్ష్మమ్మ. తండ్రి పేరు సీతారామయ్య.

పదకొండో ఏట నటనకు శ్రీకారం చుట్టారు. సీత నే ఓ హిందీ నాటకంలో లవుడు పాత్రలో నటించారు.

గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడే ఎన్ టీ రామారావుతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి అనేక నాటకాల్లో నటించారు. అప్పట్లో జగ్గయ్యకు వరుసగా మూడేళ్ళపాటు ఉత్తమ నటుడు అనే అవార్డు అందుకోవడం ఓ విశేషంగా చెప్పుకునేవారు.

Jaggaiahఅడివి బాపిరాజు వద్ద మూడేళ్ళు చిత్రలేఖనంలో శిక్షణ పొందిన జగ్గయ్య డిగ్రీ తర్వాత కొంతకాలం ఓ స్కూల్లో టీచర్ గా పని చేశారు.

ఢిల్లీలో కొన్ని సంవత్సరాలు వార్తలు చదివిన జగ్గయ్య అక్కడ ఉన్న రోజుల్లో కొందరితో కలిసి నాటకాలు ప్రదర్శించారు.

జమునతో ఓ నాటకంలో నటింపజేసిన జగ్గయ్య సినిమాకు పరిచయమైంది ప్రియురాలు అనే చిత్రంతో. ఈ చిత్రానికి మూలపురుషుడు ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్. ఆ తర్వాత సినిమాలలో స్థిరపడడం కోసం ఆకాశవాణిలో ఉద్యోగం మానుకున్న జగ్గయ్య కెరీర్ లో మలుపు తిప్పిన చిత్రాలు – అర్థాంగి, బంగారు పాప.

కొన్ని చిత్రాలలో కథానాయకుడిగా, మరికొన్ని చిత్రాలలో సహాయనటుడిగా, ఇంకొన్ని చిత్రాలలో ప్రతినాయకుడి పాత్రలోనూ నటించిన జగ్గయ్య హాస్యపాత్రలు పోషించిన సందర్భాలూ ఉన్నాయి.

దాదాపు అయిదు వందల చిత్ర్రాల్లో నటించిన జగ్గయ్య తమిళంలో ఒకేఒక్క చిత్రంలో నటించకపోలేదు. ఆ చిత్రం పేరు శివగామి.

ప్రముఖ తమిళనటుడు శివాజీగణేశన్ కు తెలుగులో దాదాపు వంద చిత్రాలలో తన గొంతు దానం చేశారు జగ్గయ్య.

స్వాతంత్ర్య సమరంలో చురుకుగా పాల్గొన్న జగ్గయ్య విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే రాజకీయాలపట్ల ఆకర్షితులయ్యారు. పార్లమెంట్ సభ్యుడిగా ప్రజల మధ్య ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన 1967లో ఒంగోల్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన క్రమంలో తొలి భారతీయ సినీనటుడిగా రికార్డు నెలకొల్పారు. అప్పుడు సినీపరిశ్రమ ఆయనను ఘనంగా సన్మానించింది. ఈ సన్మాన కార్యక్రమానికి ఎన్ టీ రామారావు అధ్యక్షత వహించడం విశేషం.

నటుడిగానే కాకుండా నిర్మాతగానూ చలనచిత్రపరిశ్రమలోని కష్టసుఖాలు బాగా తెలిసిన వ్యక్తిగా జగ్గయ్య తన వరకు చేసిన మేలు చిరస్మరణీయమనే చెప్పుకోవాలి.

రచయితగా విశ్వకవి రవీంద్రుడి గీతాంజలిని జగ్గయ్య రవీంద్ర గీతా అనే పేరుతో తెలుగులో తర్జుమా చేశారు. తెలుగు సాహిత్యంలో గీతాంజలికి ఇది మొదటి అనువాదం కావడం విశేషం. అలాగే ఠాగూరు రాసిన నాటకం సాక్రిఫైస్ అనే దానిని కూడా జగ్గయ్య బలిదానం పేరుతో తెలుగులో అనువదించారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి 1992లో పద్మభూషణ్ సత్కారం పొందిన ఆయనను ఎన్నో అవార్డులూ రివార్డులూ వరించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను కళాప్రపూర్ణ బిరుదుతో ఘనంగా సత్కరించింది.
ఆయన తన 76వ ఏట 2004 మార్చి అయిదో తేదీన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.