మరో తమిళ చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మించారు. అదే కాటమరాయుడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన చిత్రమే కాటమరాయుడు. తమిళ చిత్రాల కథలను కొనుగోలు చేసి తెలుగులో పునర్నిర్మించడం సర్వసాధారణమైపోయింది. మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రం కూడా విజయ్ నటించిన తమిళ చిత్రమే ఆధారం. ఇప్పుడు పవన్ నటించిన కాటమరాయుడు చిత్రం కూడా తమిళ చిత్రంతోనే పుట్టింది. కానీ ఇక్కడో విషయం చెప్పుకోవలసి ఉంది. పవన్ కాటమరాయుడు చిత్రంపై తమిళ ప్రేక్షకులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్టు వార్తలు రావడం విశేషం. ముఖ్యంగా అజిత్ అభిమానులు ఈ చిత్రం మీద భారీ అంచనాలతో ఉన్నారు.
ఇందుకు కారణం అజిత్ నటించిన “వీరం” చిత్రాన్నే తెలుగులో కాటమరాయుడు గా రూపొందించారు. తమిళనాడులో దాదాపో నూట యాభై హాల్స్ లో కాటమరాయుడు విడుదల చేయడం అనేది ఓ రికార్డు.
ఇలా ఉండగా కథానాయిక శృతి హాసన్ మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం ‘గబ్బర్ సింగ్’ చేసే సమయానికి, ఇప్పుడు ‘కాటమరాయుడు’ సమయానికి తనలో ఎంతో మార్పు వచ్చిందని.. కానీ పవన్ లో మాత్రం అప్పటికీ ఇప్పటికీ పెద్దగా మార్పు లేదని అంటోంది శ్రుతి హాసన్. పవన్ సినిమాల కన్నా సమాజం మీద ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు గ్రహించానని, ఆయన ఎప్పుడూ జనం గురించి ఆలోచిస్తూ ఉంటారని అన్నారు శృతి హాసన్.
కాటమరాయుడు షూటింగ్ సమయంలో చాలా సార్లు పవన్ జనం గురించి తనతో మాట్లాడుతుండే వారని చెప్పారు. పవన్ ఓ వినూత్న వ్యక్తి అని ప్రశంసించారు ఆమె.
తాను తెలుగులో సినిమాలు చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నప్పుడు తన కెరీర్ విషయంలో ఓ మలుపు తిప్పిన ఘనత పవన్ గారి సూచనలే అని అన్నారు.
పవన్ ను చూడటానికి ప్రేక్షకులు భారీ సంఖ్యలో వస్తారన్న విషయం తెలిసిందే కదా….అందుకే కాబోలు, ఇప్పుడు కాటమరాయుడు చిత్రంతో పాటు కొన్ని కొత్త చిత్రాల ట్రైలర్లు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అవి, వరుణ్ తేజ్ మిస్టర్ చిత్రం, నిఖిల్ నటించిన కేశవా చిత్రం, కార్తి చెలియా చిత్రం, వెంకటేష్ చిత్రం ట్రైలర్లు ప్రేక్షకులకు కానుక.
మరోవైపు, కాటమరాయుడు చిత్ర పబ్లిసిటీ ఖర్చులతో కలిపి 35 కోట్ల దాకా పూర్తి చేసినట్టు చిత్ర యూనిట్ సభ్యుల మాట. ఈ చిత్ర లాభాలు కూడా బాగానే ఉంటాయని అంచనా. ఇప్పటికి నూట అయిదు కోట్ల రూపాయల మేరకు బిజినెస్ అయినట్టు యూనిట్ తెలిపింది.
కధలోకేల్తే…
కాటమరాయుడికి నలుగురు తమ్ముళ్ళు. వాళ్ళంటే అన్నకు ప్రాణం. గ్రామస్తులకు ఆయన దేవుడు. అయితే ఈయన బలహీనత అమ్మాయిలంటే పడదు. పెళ్లి మాట ఎత్తడు. మరి తమ్ముళ్ళ మాటేంటి? అయితే అవంతిక కాటమరాయుడి జీవితంలోకి వస్తే…సినిమా చూడాల్సిందే.
నటన..
పవన్ అదిరింది. ప్రధమార్ధం బాగానే వుంది. ద్వితీయార్ధం సన్నివేశాల్లో శక్తి లేకపోవడం వలన సాధారణంగా సాగింది. చివర్లో దర్శకుడు కొంత ఎమోషన్స్ చూపించి పతాక సన్నివేశాలు బాగానే వున్నాయి.