కాసులు కురిపించిన "బాలనాగమ్మ"

బాలనాగమ్మ….
ఇదొక జానపద చిత్రం.
Bala Nagamma19421942 లో జెమినీ వాళ్ళు ఓ మాయల మరాటీని పుట్టించారు. అతను మాంత్రికుడు. ఈ క్యారక్టర్ బాలనాగమ్మ చిత్రంలోనిది. ఈ చిత్రాన్ని ఎస్ ఎస్ వాసన్ నిర్మించగా సి పుల్లయ్య దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో మాయల మరాటీగా నటించిన వారు గోవిందరాజుల సుబ్బారావు. అయన ఆ పాత్రలో నటించలేదు…జీవించారు అనే చెప్పుకోవాలి. అందుకే ఆయన ఆ పాత్రతో ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యారు.

బాలనాగమ్మ పాత్రలో కాంచనమాల నటించారు. ఆమె అందమే అందం. ఆమె స్టేజ్ నటిగా అప్పటికే ఎంతో పేరుప్రఖ్యాతులు గడించిన కాంచనమాల ఈ చిత్రంలో బాలనాగమ్మ పాత్రలో చూపులతోను, రూపంతోను ప్రేక్షలను కట్టిపడేశారు అనడం అతిశయోక్తి కాదు.

ఈ చిత్రంలో గోవిందరాజుల సుబ్బారావు కథానాయకుడు కాదు.

ఈ చిత్రంలో నిజమైన హీరో ఎవరంటే కాంచనమాల. ఆమె సరసన నటించిన వారు బందా కనకలింగేశ్వర రావు గారు.

హిందీ చిత్ర నటి అయిన రేఖ తల్లి పుష్పవల్లి ఈ చిత్రంలో నాట్యం, పాటలతో మాయలమరాటీని అలరించిన తీరుని అప్పట్లోనే కాదు ఇప్పటికీ విశేషంగా చెప్పుకుంటారు. ఆమెతో వాంప్ పాత్రలో నటింప చేయడం ఆశ్చర్యమే.

ఈ చిత్రంలో వీరితోపాటు కమలాకోట్నిస్, బలిజేపల్లి లక్ష్మీకాంతం, బళ్ళారి లలిత, టీ జీ కమలాదేవి, రేలంగి వెంకట్రామయ్య తదితరులు నటించారు. ఇద్దరు భార్యల మొగుడుగా రేలంగి తన హాస్యంతో అందరినీ నవ్వించారు.

బలిజేపల్లి లక్ష్మీకాంతం సాహిత్యం సమకూర్చగా ఎం డీ పార్థసారధి, సాలూరి రాజేశ్వర రావు స్వరాలూ అందించారు.

బాలనాగమ్మ కథలోకి వెళ్తే….
పిల్లలు లేని ఓ మహారాజుకి ప్రార్ధనలతో ఏడుగురు పిల్లలు పుడతారు. వారిలో ఆఖరి సంతానమే బాలనాగమ్మ. బాలనాగమ్మ యువరాణి. ఆమెకు పెళ్ళవుతుంది. ఆమెను మాయలమరాటి కిడ్నాప్ చేస్తాడు. అతను జంగమదేవర రూపంలో వచ్చి ఆమెను తన గుహలోకి తీసుకుపోతాడు. ఆమె భర్తను శిలారూపంలో బంధిస్తాడు. ఆమె పన్నెండు సంవత్సరాలు పైనే అక్కడ ఉంటూ తన పూజలతో మాయోపాయాలతో అతనిని దూరం పెడుతుంటుంది. తన శీలాన్ని కాపాడుకుంటుంది. బాలనాగమ్మ అంటే సంగు పాత్రలో నటించిన పుష్పవల్లికి నచ్చదు. ఆమె మాయలమరాటీ ఉంపుడుకత్తెగా నటించారు. ఆమెకు బాలనాగమ్మ అంటే అసూయ. ఇదిలా ఉండగా బాలనాగమ్మ కుమారుడు పెరిగి పెద్దవాడై తన తల్లి గురించి తెలుస్తుంది. అతను మాయలమారాటీతో పోరాడి గెలుస్తాడు. అమ్మను తెచ్చుకుంటాడు. ఇదీ కథ. ఈ చిత్రాన్ని జెమినీ వారు భారీ సెట్టింగులతో తీయడం విశేషం.

ఆంద్రప్రదేశ్, తమిళనాడులలో ఈ చిత్రం 25 వారాల పైనే ఆడింది.

ఈ చిత్రాన్నే జెమినీ వారు ఆ తర్వాత హిందీలో కూడా తీసారు. హిందీలో మధుబాల బాలనాగమ్మ పాత్రలో నటించగా సంగు పాత్రలో సావిత్రి నటించారు. Bala Nagammaహిందీలో సావిత్రి చేసిన మొదటి చిత్రం ఇదే. హిందీలో ఈ చిత్రం పేరు బహుత్ దిన్ హుయే.

1959 లో ఇదే కథతో బాల నాగమ్మ చిత్రం తీయగా అందులో ఎన్టీ రామారావు, అంజలీదేవి, ఎస్ వీ రంగా రావు తదితరులు నటించారు. ఈ చిత్రం కూడా విజయవంతంగా ఆడింది. ఈ చిత్రానికి వేదాంతం రాఘవయ్య దర్శకులు. రాజసులోచన పుష్పవల్లి పాత్రను పోషించగా అంజలీదేవి కాంచనమాల పాత్రలోనూ, ఎస్వీ రంగారావు మాయలమరాటీ పాత్రలోనూ నటించారు. ఈ చిత్రంలోనూ రేలంగి తలారి రాముడి పాత్రలో నటించారు. 1942 నాటి బాలనాగమ్మ చిత్రంలోనూ రేలంగి అదే పాత్ర పోషించారు. అలాగే ఈ రెండు బాలనాగామ్మలోను లంక సత్యం చాకలి తిప్పాడు పాత్రలో నటించారు. 1966 లో కన్నడంలో బాలనాగమ్మ కౌండిన్య దర్శకత్వంలోను, 1981 లో కె శంకర్ దర్శకత్వంలో తమిళ, మళయాళ భాషల్లో బాలనాగమ్మ చిత్రం విడుదల అయ్యింది.

బాలనాగమ్మ చిత్రంతో జెమిని సంస్థ మళ్ళీ ఆర్ధికంగా బాగా పుంజుకుంది.
——————–
చౌటపల్లి నీరజ

Send a Comment

Your email address will not be published.