కిల్లింగ్ వీరప్పన్ - వెరీ థ్రిల్లింగ్

ఇప్పటికే తమిళం, కన్నడం భాషలలో స్మగ్లర్ వీరప్పన్ మీద సినిమాలు వచ్చాయి. అయితే వీటికి భిన్నంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన కిల్లింగ్ వీరప్పన్ విషయంలో ఒకరిద్దరు వేలెత్తి చూపినా మంచి టాకే వచ్చింది.

మంజునాథ్ నిర్మించిన ఈ వర్మ చిత్రానికి సంగీతం సాండీ సమకూర్చారు.

శివరాజ్ కుమార్, సందీప్ భరద్వాజ్, పరుల్ యాదవ్ తదితరులు నటించిన ఈ చిత్రంలో సందీప్ భరద్వాజ్ వీరప్పన్ పాత్రలో కనిపిస్తాడు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు.

ఆర్ జీ వీ అనగానే విలక్షణ దర్శకుడని, వివాదాస్పద దర్శకుడని అనుకోవడం కద్దు. ఆ మాటలకు మరోసారి అక్షర రూపమిచ్చిన రామ్ గోపాల్ వర్మ ఈసారి మరో సంచలనాత్మక కథనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే ‘కిల్లింగ్ వీరప్పన్’ చిత్రం.

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను గజగజలాడించి నిద్రపోనివ్వకుండా చేసిన వీరప్పన్ ను అతని సామ్రాజ్యమైన అడవిలో ఉంటే చంపడం కష్టమని అనుకుని అతనిని బయటకు రప్పించి కడ తేర్చాలన్న వ్యూహాన్ని పోలీసులు ఎలా అమలు చేశారన్నది ఈ చిత్ర కథనం.

వీరప్పన్ పాత్రలో నటించిన సందీప్ భరద్వాజ్ ఓవ్యవహారం కోసం అడవిలో నించి బయటకు వస్తున్నట్టు తెలిసి ఓ అటవీ శాఖ పోలీసుల బృందం అతనిని పట్టుకోవడానికి వెళ్తుంది. అయితే వారు వస్తున్న విషయం తెలుసుకుని వీరప్పన్ దారిలోనే వారిని తుదముట్టిస్తాడు. దానితో పోలీసు శాఖ ఆలోచనలో పడుతుంది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ కి సంబందించిన విజయ్ కుమార్ ఆలోచనలో పడ్డప్పుడు అతని అసిస్టెంట్ అయిన ఎస్.పి ఓ ప్లాన్ చెప్తాడు. అదేమిటంటే వీరప్పన్ ని ఎలాగైనా అడవిలో నుంచి బయటకు వచ్చేలా చేసి పట్టుకోవాలన్నదే ఆ పధకం.

పోలీసుల పధకానికి వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మీని ఎలా ఉపయోగించుకున్నారు….చివరకు వీరప్పన్ ని ఎలా హతమార్చారు అన్న విషయాలను తెలుసుకోవడానికి వెండితెరపై పండించిన వర్మ ప్రజ్ఞను చూడాల్సిందే.

ఈ చిత్రంలో వీరప్పన్ ప్రేమ కథా సన్నివేశం ఓ చిన్ని నవ్వు తెప్పిస్తుంది అనడంలో సందేహం లేదు.

అచ్చం వీరప్పన్ లాగానే సందీప్ భరద్వాజ్ కనిపించినట్టు చెప్పుకుంటున్నారు సినిమా చూసిన వాళ్ళు.

వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి పాత్రలో యజ్ఞ శెట్టి నటించింది. పరుల్ యాదవ్ కూడా తన పాత్రకు తగిన న్యాయం చేసింది. ఇతర నటీనటులు కూడా బాగానే నటించారు.

సినిమాలో కొన్ని చోట్ల ప్రేక్షకులకు విసుగు పుట్టక మానదు. స్క్రీన్ ప్లే ఇంకాస్త పట్టుగా ఉండాలని ప్రేక్షకుల అభిప్రాయం. ముత్తు లక్ష్మి ఎందుకు పోలీసులకి సహకరించింది అనే విషయాన్ని సరిగ్గా చెప్పలేదు.

రమ్మి సినిమాటోగ్రఫీ బాగున్న ఈ చిత్రంలో సాండీ కొన్ని కీలక సన్నివేశాల్లో సరిగ్గా సంగీతం సమకూర్చలేదు.

ఇటీవలి కాలంలో కొన్ని పేలవమైన చిత్రాలతో విమర్శలకు గురైన వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’ తో మళ్ళీ మంచి చిత్రాన్ని ఇచ్చాడని చెప్పుకోవచ్చు.

Send a Comment

Your email address will not be published.