కుర్రకారుకోసం కిరాక్ పార్టీ

Kirrak-Party

గతంలో కాలేజీ స్టూడెంట్స్ ని చాలా సినిమాలు వచ్చాయి. ఐతే వాటిలో కొన్ని మాత్రమే విజవంతమైనాయి. శుక్రవారం విడుదలయిన కిరాక్ పార్టీ సినిమా కూడా అలాంటిదే. ప్రస్తుతం పరీక్షల సీజన్ ముగిసి రిలాక్స్ కావాలని కోరుకునే కాలేజీ యూత్ ని అలరించే సినిమా ఇది. దీనికి హీరో నిఖిల్ గ‌త ఏడాది `కేశ‌వ‌`తో మ‌రో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్న హీరో నిఖిల్‌. ఇప్పుడు ఈ క‌థానాయ‌కుడు చేసిన మ‌రో చిత్ర‌మే `కిరాక్ పార్టీ`. పూర్తి స్థాయి కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన సినిమా ఇది..`హ్యాపీడేస్‌` త‌ర్వాత తాను న‌టించిన పూర్తి స్థాయి కాలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీ ఇదంటూ కిరాక్ పార్టీ గురించి ప్ర‌మోష‌న్స్‌లోనే ప్రకటించాడు నిఖిల్‌. అయితే క‌న్న‌డంలో విజ‌య‌వంత‌మైన `కిరిక్ పార్టీ` సినిమాకు ఇది రీమేక్‌. నిఖిల్ తొలిసారి రీమేక్ గా చేసిన కిరాక్ పార్టీ ఎలాంటి విజ‌యాన్నిచ్చిందో తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం.

ఇదీ కథ :
కృష్ణ(నిఖిల్‌) ఉషా రామా ఇంజ‌నీరింగ్ కాలేజీలో మెకానిక‌ల్ గ్రూపులో ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో జాయిన్ అవుతాడు. ఇత‌ని గ్యాంగ్‌లో రాకేందుమౌళి స‌హా స్నేహితుల‌తో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. త‌న సీనియ‌ర్ మీరా(సిమ్రాన్ ప‌రింజ‌)తో ప్రేమ‌లో పడ‌తాడు. అందువ‌ల్ల సీనియ‌ర్స్‌తో గొడ‌వ అవుతుంది. కృష్ణ‌, అత‌ని స్నేహితులంతా క‌లిసి ఓ సెకండ్ హ్యాండ్ కారును కూడా కొని దానితో మీరాను ఇంప్రెస్ చేయాల‌నుకుంటారు. ఎదుటివారిని న‌వ్వించాల‌నే కృష్ణ మ‌న‌సు న‌చ్చడంతో అత‌నంటే ఇష్ట‌పడుతుంది. అనుకోకుండా మీరా ప్ర‌మాద‌వ‌శాతు మీరా చ‌నిపోతుంది. దాంతో కృష్ణ యారోగెంట్‌గా మారుతాడు. ఎవ‌రైనా అమ్మాయిల‌ను కామెంట్ చేస్తే వారిని చావ‌గొడుతుంటాడు. నెమ్మ‌దిగా కృష్ణ నాలుగో సంవత్స‌రంలోకి ఎంట్రీ ఇస్తాడు. అదే స‌మ‌యంలో కృష్ణ స్నేహితుడు అర్జున్ త‌న నుండి గొడ‌వ‌ప‌డి మ‌రో వ‌ర్గంగా విడిపోతాడు. రెండు వ‌ర్గాలు కాలేజ్‌లో అధిప‌త్యం కోసం గొడ‌వ‌లు ప‌డుతుంటారు. అదే స‌మ‌యంలో స‌త్య‌(సంయుక్తా హెగ్డే) కృష్ణ‌ను ఇష్ట‌ప‌డుతుంటుంది. న‌వ్వ‌డ‌మే మ‌ర‌చిపోయిన కృష్ణ‌ను మామూలు మ‌నిషిగా మార్చే ప్ర‌య‌త్నం చేస్తుంది. మ‌రి కృష్ణ లైఫ్ ఎలాంటి ట‌ర్న్ తీసుకుంటుంది? త‌ను స‌త్య‌కు ద‌గ్గ‌రైయ్యాడా? విడిపోయిన స్నేహితులందరూ క‌లుసుకుంటారా? అనే ఆసక్తి కలిగించే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
సినిమా విశ్లేషణ
పూర్తి స్థాయి కాలేజీ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. ఫ‌స్టాఫ్ అంతా స్నేహితులు.. అల్ల‌రి చిల్ల‌ర‌గా అంద‌రినీ ఆట‌ప‌ట్టించ‌డం.. క్లాసులు ఎగ‌ర‌గొట్ట‌డం. సీనియ‌ర్స్‌తో గొడ‌వ‌ప‌డ‌టం. ఇంట్లో అబ‌ద్ధాలు చెప్పి.. ఓ సెకండ్ హ్యాండ్ కారు కొని దాంట్లో చ‌క్క‌ర్లు కొట్ట‌డం ఇలాంటి స‌న్నివేశాల‌ను పాటు హీరో నిఖిల్‌.. హీరోయిన్ సిమ్రాన్ ప‌రింజ మ‌ధ్య చిన్న ప్రేమ‌క‌థ కూడా అంత‌ర్గతంగా సాగుతుంటుంది. ఇంత‌కు ముందు చాలా సినిమాల్లో చూసిన‌ట్లుగానే హీరో.. హీరోయిన్ కోసం ఆమెకు న‌చ్చిన ప‌నులు చేయ‌డం.. మందు, సిగ‌రెట్ త్రాగ‌డం మానేయ‌డం… హీరోయిన్ ఎవ‌రికో స‌హాయం చేయాల‌నుకుంటే ఆమెకు త‌న వంతుగా స‌హాయం చేయ‌డం, హీరోయిన్ మ‌న‌సుని గెలుచుకోవ‌డం.. వంటి స‌న్నివేశాలు ఈ సినిమాలో క‌న‌ప‌డ‌తాయి. ఇలాంటి స‌న్నివేశాలు చాలా సినిమాల్లో చూసినట్లుగా ఉన్నా కూడా కొన్ని స‌న్నివేశాల‌కు ప్రేక్ష‌కులు.. ముఖ్యంగా యూత్ ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అయ్యే సంద‌ర్భాలు ఎక్కువ‌గా ఉన్నాయి. అలాగే సీనియ‌ర్ హీరోయిన్ వెనుక హీరో ప‌డే స‌న్నివేశాల‌న్నీ.. హ్యాపీడేస్‌లో స‌న్నివేశాలు కొన్నింటిని గుర్తుకు తెస్తాయి. ఇక సెకండాఫ్ వ‌చ్చేసరికి హీరో గ్యాంగే రెండుగా విడిపోవ‌డం.. కాలేజీ ఎల‌క్ష‌న్స్‌, గొడ‌వ‌లు.. ఓ హీరోయిన్ ప్ర‌మాద‌వ‌శాతు మ‌ర‌ణించ‌డంతో .. మ‌రో హీరోయిన్ ఎంట్రీ.. ఆమె హీరోను ప్రేమించ‌డం.. సీరియ‌స్‌గా ఉండే హీరోను న‌వ్వించేలా చేయ‌డం.. ఎప్పుడూ న‌వ్వుతూ ఉండాల‌ని చెప్ప‌డం ఇలాంటి స‌న్నివేశాల‌తో సాగుతుంది. ఇందులో కొన్ని స‌న్నివేశాలు రిపీటెడ్‌గా ఎక్క‌డో చూసిన భావన క‌లిగించినప్ప‌టికీ, కొన్ని కొత్త‌గా ఉన్న‌ట్లు అనిపిస్తాయి.

న‌టీన‌టుల అభినయం
హీరో కృష్ణ క్యారెక్ట‌ర్‌ను చాలా బలంగా తీర్చిదిద్దారు. ఫ‌స్టాఫ్‌లో స‌ర‌దాగా ఉండే హీరో.. సెకండాఫ్‌లో సీరియ‌స్‌గా ఉండ‌టం.. గొడ‌వ‌లు ప‌డ‌టం.. చివ‌ర‌కు మార‌డం .. సినిమా అంతా హీరో చుట్టూనే తిరుగుతుంది. ఈ పాత్ర‌లో నిఖిల్ చ‌క్క‌గా న‌టించాడు. ముఖ్యంగా నార్మ‌ల్ లుక్‌, గ‌డ్డం ఉన్న లుక్‌లో నిఖిల్ మంచి వేరియేష‌న్ చూపించాడు. హీరోయిన్‌.. హీరోను ఓ బంగ్లాలోకి తీసుకెళ్ల‌డం… అక్క‌డ నుండి దెయ్యాల‌కు భ‌య‌ప‌డి పారిపోవ‌డం వంటి కొన్ని సీన్స్ సినిమాని కొంచెం పొడిగించాయే కానీ.. మ‌రేం ఉప‌యోగం క‌న‌ప‌డ‌దు. అయితే సినిమా అంతా కాలేజీలోనే సాగ‌డం సినిమాకు ప్ర‌ధాన బ‌లం. కాబ‌ట్టి స్టూడెంట్స్ స‌హా మధ్యవయసులో ఉండే ప్రేక్షకులకు వారి కాలేజీ రోజులు గుర్తుకు వ‌స్తాయ‌న‌డంలో సందేహం లేదు. అలాగే ఇద్ద‌రు హీరోయిన్స్ పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. సిమ్రాన్ పాత్ర సైలెంట్‌గా ఉంటే.. సంయుక్తా పాత్ర చాలా ఎన‌ర్జిటిక్‌గా ఉంటుంది. నిజానికి క‌న్న‌డ `కిర్రిక్ పార్టీ`లో చేసిన రోల్ కావ‌డంతో సంయుక్తా ఎక్క‌డా క‌ష్ట‌ప‌డలేదు. అదే జోష్‌, ఎనర్జీని ఈ సినిమాలో కూడా చూపించింది. సిజ్జు, రాకేందు మౌళి స‌హా మిగిలిన నటులు తమ అభినయంతో తమ తమ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.
సాంకేతికంగా
ద‌ర్శ‌కుడు శ‌ర‌ణ్ కొప్పిశెట్టి ఈ సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. క‌న్న‌డ మాతృక‌లోని ఫీల్‌ను ఆ రేంజ్‌లో కాక‌పోయినా.. బానే ఉంద‌నేలా క్యారీ చేశాడు. దీనికి తోడు సుధీర్ వ‌ర్మ స్క్రీన్‌ప్లే, చందు మొండేటి మాట‌లు అద‌న‌పు బ‌లంగా నిలిచాయి. అజ‌నీశ్ లోక‌నాథ్ సంగీతం, నేప‌థ్య సంగీతం బాగున్నాయి. అద్వైత గుర్తుమూర్తి సినిమాటోగ్ర‌ఫీ బాగుందిది. ముఖ్యంగా పాట‌ల్లోని సన్నివేశాల‌ను ఎలివేట్ చేసిన తీరు బావుంది. ఎడిటింగ్ చేసేటప్పుడు ఎం.ఆర్‌.వ‌ర్మ సినిమాలో కొన్ని అన‌వ‌స‌ర సన్నివేశాల‌ను తొలగించి ఉంటే బావుండేది. ముఖ్యంగా సినిమా సెకండాఫ్ సాగదీతగా అన్పిస్తుంది.
———————–
నిర్మాణ సంస్థ‌: ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్‌
నటీన‌టులు: నిఖిల్‌, సిమ్రాన్ ప‌రింజ‌, సంయుక్తా హెగ్డే, రాకేందు మౌళి, వైవా రాఘ‌వ్‌, బ్ర‌హ్మాజీ, హ‌నుమంతే గౌడ త‌దిత‌రులు
సంగీతం: అజ‌నీశ్ లోక్‌నాథ్
సినిమాటోగ్ర‌ఫీ: అద్వైత గుర్తుమూర్తి
మాట‌లు: చ‌ందు మొండేటి
ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వ‌ర్మ‌
క‌ళ‌: అవినాశ్‌
స్క్రీన్ ప్లే: సుధీర్ వ‌ర్మ‌
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి
—————-

ప్ల‌స్ పాయింట్స్‌:
– నిఖిల్ న‌ట‌న‌
– అక్క‌డ‌క్క‌డా క‌నెక్టయ్యే కాలేజీ స‌న్నివేశాలు
– పాట‌ల పిక్చ‌రైజేష‌న్‌

మైన‌స్ పాయింట్స్‌:
– సినిమా సెకండాఫ్ సాగ‌దీత‌
– ఎమోష‌న్స్ ని బలంగా చూపించలేకపోవడం
– కామెడీ అంతగా ఆకట్టుకోలేక పోవడం
రేటింగ్ : ౩/5

Send a Comment

Your email address will not be published.