కృష్ణ వంశీతో నా తీరు మారింది

sundeep kishanఇది సందీప్ కిషన్ సంవత్సరం. ఇప్పటికే ఈ ఏడాది అతను నటించిన మానగరం తమిళంలో విజయవంతమైంది. ఆ తర్వాత శమంతకమణి చిత్రం. ఇప్పుడు అతను నటించిన నక్షత్రం చిత్రం. కృష్ణవంశి దర్శకత్వంలో వచ్చిన చిత్రం నక్షత్రం. ఇదిలా ఉంటె అతని ముందు మరో రెండు మంచి ప్రాజెక్ట్స్ ఉండనే ఉన్నాయి.

సందీప్ కిషన్ మాట్లాడుతూ కృష్ణవంశితో మొదలైన తర్వాత అనుకోకుండా మరో రెండు ప్రాజెక్ట్స్ తన ముందుకొచ్చాయని అన్నారు. నక్షత్రం తన కెరీర్ లో ఓ ప్రత్యేకమైన చిత్రం అని చెప్తూ ప్రస్తానం, స్నేహ గీతం తదితర చిత్రాలతో ఈ సినీ జీవితం ప్రారంభించినట్టు తెలిపారు.

నక్షత్రం చిత్రం తన కెరీర్లో ఓ పెద్ద ప్రాజెక్ట్ అని అన్నారు. కృష్ణవంశి లాంటి పెద్ద దర్శకుడితో కలిసి చిత్రం చేయడం అనేది సంతోషకరమైన విషయమని చెప్పారు. తన ఫేవరెట్ దర్శకులలో ఆయన ఒకరని సందీప్ కిషన్ తెలిపారు. రామారావు అనే పాత్రలో నటించానని చెప్తూ ఈ పాత్ర తనకెంతో నచ్చిందని అన్నారు. ఈ పాత్ర పండించడానికి తాను శక్తివంచన లేకుండా కృషి చేసానని అన్నారు.

ఈ పాత్రలో రాణించడానికి ముందు ఎంతో ప్రిపేర్ అయ్యానని అంటూ హైదరాబాదులోని మాదాపూర్ పోలీసు స్టేషన్ లో మూడు నాలుగు రోజులు ఉండి పోలీసుల బాడీ లాంగ్వేజ్, ప్రవర్తన అధ్యయనం చేసానని తెలిపారు. పోలీసులు ఎలా కూర్చుంటారు, ఎలా మాట్లాడుతారు వంటివన్నీ సునిశితంగా గమనించానని సందీప్ కిషన్ చెప్పారు. అలాగే షూటింగ్ జరిగే ప్రాంతానికి కూడా వెళ్లి అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ వేషభాషలు చూశానని, ఇలా అన్ని కోణాలలో ఆయా వ్యక్తుల తీరుతెన్నులు పరిశీలించిన మీదట పోలీసు పాత్రలోకి పరకాయప్రవేశం చేసానని అన్నారు.

తార్నాక సమీపంలోని ఓ కాలనీలో చిత్రీకరణ జరిగిందని ఆయన గుర్తు చేసుకున్నారు. అలాగే షూటింగ్ కి ముందు దర్శకుడితో తానూ గమనించిన విషయాలపై చర్చించానని అన్నారు. తాను స్కూల్ డేస్ నుంచీ కృష్ణవంశిని ఫాలో అవుతున్నానని, ఆయన నేతృత్వంలో నటించాలని ఆశించానని, ఆ కల నెరవేరినట్టు కిషన్ తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో నటించడం తన కెరీర్లో ఓ గొప్ప అనుభవమని అన్నారు. ఇప్పుడు కొత్త కొత్త దర్శకుల సారధ్యంలో నటిస్తున్నానని అతనన్నారు.

Send a Comment

Your email address will not be published.