కేరింత నాకో యాక్టింగ్ స్కూల్

“నాకు నటుడినవాలనే ఆశ ఉందిరా” అని తరచూ తన మిత్రులతో చెప్తుండే వారు విశ్వంత్.

తన కల ఏదో ఒక రోజు పండుతుందని అతనికి అలా చెప్తున్నా రోజుల్లో కొద్దిగానే తెలుసు.

డీ విశ్వంత్ మొదటగా దిల్ రాజ్ గారి కేరింత చిత్రంలో పోషించిన సిద్ పాత్ర అతనికి మంచి గుర్తింపే ఇచ్చింది. ఆ గుర్తింపే ఇప్పుడతనికి చంద్ర శేఖర్ యేలేటి గారి మనమంతా చిత్రంలో మోహన్ లాల్, గౌతమి తదితరులతో కలిసి నటించే అవకాశం తెచ్చిపెట్టింది.

అతను సినీ రంగంలో రావాలనుకోవడానికి మహేష్ బాబు చిత్రాలే స్పూర్తినిచ్చాయి. మహేష్ బాబు సినిమాలేవీ విడిచిపెట్టకుండా చూసే విశ్వంత్ మహేష్ బాబుకి వీరాభిమాని.

ఓమారు విశ్వంత్ గోవా కి వెళ్తుండగా అదే రోజు మహేష్ బాబు సినిమా విడుదల అవుతున్న విషయం తెలుసుకుని అప్పటికప్పుడు బస్సులో నించి దిగిపోయి మహేష్ బాబు సినిమా చూసిన తర్వాత అతను గోవా పర్యటనకు వెళ్ళారంటే అతనికి మహేష్ బాబు అంటే ఎంత ఇష్టమో అర్ధం చేసుకోవచ్చు. మహేష్ బాబు సినిమాలు చూడటంతోనే తాను ఎదిగినట్టు చెప్పుకునే విశ్వంత్ అమెరికాలో చదువుతున్న రోజుల్లోనే కేరింత చిత్రాన్ని నిర్మిస్తున్న వారికి ముందుగా తన ఫోటోలు, వీడియో క్లిపింగ్స్ పంపారు. అంతకు మించి అప్పట్లో విశ్వంత్ కు నటన గురించి పెద్దగా తెలీదు. అయితే తాను పంపిన ఫోటోలు, వీడియో క్లిపింగులు చూసిన దిల్ రాజ్ గారి ఆఫీస్ నుంచి తనకు పిలుపు వచ్చినప్పుడు ఆశ్చర్యపోయానని విశ్వంత్ అన్నారు.

దిల్ రాజ్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చినప్పుడు తన చదువు పూర్తి కావడానికి కొన్ని రోజులే ఉందని, కోర్స్ ముగియడంతోనే వస్తానని చెప్పినప్పుడు అందుకు వాళ్ళు సమ్మతించారని, కోర్స్ పూర్తి చేసుకున్న తర్వాత అమెరికా నుంచి భారత దేశం చేరుకున్న విశ్వంత్ తిన్నగా దిల్ రాజ్ గారిని కలిసి కేరింతలో ఒక సభ్యుడు కావడం మరచిపోలేనని అంటూ ఉంటారు.

కేరింత చిత్రం తనకు ఒక నటనాలయం అని, ఇప్పుడు తనకు బాగానే అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. అయితే మంచి స్క్రిప్ట్ కోసం నిరీక్షించిన విశ్వంత్ కు ఒకరోజు చంద్ర శేఖర్ నుంచి పిలుపు వచ్చి మనమంతా సినిమాలో నటించే అవకాశం దొరికింది. ఈ చిత్రం ద్విభాషా చిత్రమని, ఈ చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి అని విశ్వంత్ తెలిపారు.

మోహన్ లాల్ ను మొదటిసారి కలిసినప్పుడు ఆయనే తనను పరిచయం చేసుకోవడం ఆశ్చర్యం వేసిందని, ఎందుకంటే మోహన్ లాల్ అంటే తెలియని వారెవరని, అయినా ఆయన తనను నాకు పరిచయం చేసుకోవడం ఆయన తత్వాన్ని చెప్పక చెప్పిందని విశ్వంత్ అన్నారు. అలాగే నటనాపరంగా గౌతమి తనకు ఎన్నో అమూల్యమైన సూచనలు చేసారని విశ్వంత్ చెప్పారు.

Send a Comment

Your email address will not be published.