గాంగ్ లీడర్ కి ఇరవై అయిదేళ్ళు

‘‘చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో. రఫ్ఫాడించేస్తా’’
– ఈ డైలాగ్ ఎవరిది..ఏ చిత్రంలోది అని ఆలోచించక్కర లేదు. పిల్లల్ని అడిగినా చెప్పే చిత్రం అది. అదే గాంగ్ లీడర్.
ఈ చిత్రం విడుదలై ఈ నెల తొమ్మిదో తేదీ నాటికి ఇరవై అయిదేళ్ళు పూర్తి అయ్యింది.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరు అభిమానులు ఈ చిత్రంపై మాట్లాడుకోవటమే కాదు సంబరాలు కూడా చేసుకుంటున్నారు. ఈ వేడుకల్లో చిరు తనయుడు రామ్ చరణ్ కూడా పాలుపంచుకోవడం కూడా. .

GangLeader గాంగ్ లీడర్ చిత్రం 1991 మే 9న ఘనంగా విడుదల అయ్యింది. అలాగే విజయవంతమయ్యింది కూడా. ఈ చిత్రంలో చిరంజీవి, విజయశాంతి, మురళీ మోహన్, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య తదితరులు నటించారు. ఆ చిత్రానికి విజయాబాపినీడు దర్శకులు. బప్పీలహరి సంగీతం స్వరపరిచారు. కోరియోగ్రఫీ ప్రభు దేవా కావడం విశేషం.

పాటలపరంగా సూపర్ హిట్టైన ఈ చిత్రంలో నాలుగు పాటలు భువనచంద్ర రాయగా మిగిలిన రెండు పాటలు వేటూరి సుందర రామమూర్తి (పాలబుగ్గ , వయసు వయసు అనే పాటలు) కలం నుంచి జాలువారినవే. అన్ని పాటలూ యుగళగీతాలే. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఆలపించారు.

జగదేక వీరుడు – అతిలోక సుందరి చిత్రాన్ని మించి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో రికార్డు తిరగరాసిన ఈ చిత్రాన్ని హిందీలో “ఆజ్ కే ఆ గూండా రాజ్ ” పేరుతో పునర్ నిర్మించారు. హిందీలో చిరుతో మీనాక్షి శేషాద్రి నటించారు. అలాగే అరవంలో “గాంగ్ లీడర్” పేరుతో వచ్చింది. కన్నడంలో “కుటుంబ” అనే టైటిల్ తో తీసారు. కన్నడంలో ఉపేంద్ర నటించారు.

కథలోకి వస్తే, రఘుపతి (మురళీమోహన్), రాఘవ (శరత్ కుమార్), రాజారాం (చిరంజీవి) అన్నదమ్ములు. ఈ ముగ్గురిలో రఘుపతి ఒక్కడే సంపాదనపరుడు. అతని సంపాదనతోనే ఇల్లు గడుస్తుంటుంది. రాఘవ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటాడు.. రాజారాం నిరుద్యోగి. రాజారాంకి నలుగురు మిత్రులున్నారు. వారు రోజూ ఉద్యోగవేటలో ఉంటారు. అర్ధరాత్రి దాకా వారితో కలిసి తిరుగుతుంతాడు రాజారాం. అర్ధరాత్రిపూట రాజారాం ఇంటికి చేరుకుంటాడు. . అప్పుడు పడుకున్న రాజారాం మధ్యాన్నం దాకా నిద్రపోతాడు. అతని బామ్మ (నిర్మలమ్మ) అతని బాధ్యతారాహిత్యానికి బాధపడేది. ఓసారి అద్దెకుండే విజయశాంతిని అద్దె ఇవ్వడం లేదని ఇల్లు ఖాళీ చేయమంటాడు ఆమె యజమాని. విజయశాంతి కన్యాకుమారి పాత్రలో నటించింది. దానితో ఆమె రాజారాం ఇంట్లోకి మకాం మారుస్తుంది. ఒక దశలో డబ్బుల విషయంలో రాజారాం జైలుకి వెళ్తాడు. ఐ ఏ ఎస్ ప్రిపరేషన్ కోసం డిల్లీకి వెళ్ళడానికి డబ్బు కావలసి వస్తుంది అతని సోదరుడికి. ఈలోగా ఏకాంబరం, కనకాంబరం కలిసి వీరి పెద్దన్నయ్య ను (మురళీమోహన్) హతమారుస్తారు. ఓ హత్య కేసులో సాక్ష్యం చెప్పడంతో రాజారాం అన్నయ్యను వారు హతమారుస్తారు. ఆ సమయంలో రాజారాం జైల్లో ఉంటాడు. కానీ ఆ అన్నయ్య ఎలా మరణించారు అన్నది రాజారాం మిత్రులకి తెలుసు. అయితే రాజారాం తన అన్నయ్య ఓ ప్రమాదంలో చనిపోయినట్టు అనుకుంటాడు.

రాఘవ ఐ ఏ ఎస్ ఆఫీసర్ అవుతాడు. అతనికి సుమలతతో పెళ్ళవుతుంది. ఈ పెళ్లి జరగడంలో ఏకాంబరం, కనకాంబరం కుతంత్రం ఉంది. నిజానికి సుమలతకు రాఘవ కుటుంబ సభ్యులంటే అంటే ఇష్టం లేదు. మరోవైపు విజయశాంతి రాజారాంని ప్రేమిస్తుంది. అతని కుటుంబ సభ్యులంటే ఆమెకు ఎంతో ఇష్టం.
ఇంతలో రాజారాం కు తన సోదరుడి హత్య వ్యవహారం తెలుస్తుంది. ఎవరు కారకులో ఆరా తీసే పనిలో పడతాడు. ఈలోగా ఏకాంబరం, కనకాంబరం కలిసి రాజారాం మిత్రులను హత్య చేస్తారు. మిత్రుల హత్యలో రాజారాం పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వస్తాయి. కానీ విజయశాంతి సహాయంతో రాజారాం జైలునుంచి తప్పించుకుని బయటకు వస్తాడు. విజయశాంతి తాను ఏకాంబరం కూతురునని చెప్తుంది. తన తండ్రి తల్లిని హతమార్చడంతో విజయశాంతి ఇంట్లోనుంచి పారిపోతుంది. ఈ నిజం తెలిసిన తర్వాత రాజారాం కూడా ఆమె అంటే ఇష్టపడతాడు. ప్రేమిస్తాడు. విలన్ల అంతు చూడటంతో , రాజారాం, కన్యాకుమారి ఒక్కటవడంతో శుభం కార్డు పడుతుంది.

ఈ చిత్ర కథ మూల కర్త విజయాబాపినీడు. మాటలు పరుచూరి బ్రదర్స్ రాసారు. అన్ని విధాల హిట్టు కొట్టిన ఈ ఛిత్రాన్ని మాగంటి రవీంద్రనాధ్ చౌదరి శ్యాం ప్రసాద్ శ్యాం ప్రసాద్ ఆర్ట్స్ సంస్థ పేరిట నిర్మించారు.

ఇలా ఉండగా రామ్ చరణ్ మాట్లాడుతూ తన చిన్నతనంలో ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలోని పాటలకు రోజూ డ్యాన్స్ చేస్తూ ఉండేవాడనని అన్నారు. వాటిలో మరీ మరీ తనను కట్టి పడేసిన పాట టైటిల్ సాంగ్ అని, ఆ పాట తన ఆల్ టైం ఫేవరెట్ పాటల్లో ఒకటని రామ్ చరణ్ ఫేస్ బుక్‌లో ఒక కామెంట్ పెట్టాడు.

ఇలా ఉండగా, చిరు మాట్లాడుతూ ఈ చిత్రాన్నితన పుత్రుడు పునర్నిర్మిస్తే బాగుంటుందని అన్నారు. మరి చిరు ఈ కోర్కెను రామ్ చరణ్ తీరుస్తాడో లేదో చూడాలి.

Send a Comment

Your email address will not be published.