దాదాపు రెండేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న అల్లు శిరీష్ ఇప్పుడు శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం శిరీష్ కి మూడవది. 2013 లో అతను నటించిన మొదటి చిత్రం గౌరవం. ఆ తర్వాత కొత్త జంట చిత్రంలో నటించాడు. ఆ తర్వాత ఇంత గ్యాప్ రావడానికి గల కారణాలను చెప్తూ శిరీష్ 2014 లో తన మోకాలికి ఆపరేషన్ చేయించుకోవడంతో దాదాపు నాలుగైదు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని, ఆ తర్వాత మంచి కథ కోసం ఆగక తప్పలేదని అన్నారు. గౌరవం చిత్ర షూటింగ్ అప్పుడు తనకు గాయం తగిలిందని, మొదట్లో ఆ గాయం చాలా మామూలు గాయమనుకుని పెద్దగా పట్టించుకోలేదని అన్నారు. అయితే కొత్త జంట చిత్రం తర్వాత గాయం వల్ల చాలా బాధపడ్డానని, వైద్యులను సంప్రదిస్తే ఆపరేషన్ అవసరమని చెప్పడంతో సర్జరీ చేయించుకున్నానని శిరీష్ అన్నారు. సోలో, ఆంజనేయులు తదితర చిత్రాలను చూసిన తానూ ఉద్వేగానుభూతులను చిత్రీకరించడంలో పరశురామ్ చక్కగా రాణించగలరని అనుకుని మంచి కథ కోసం ఆయనను కలిశానని చెప్పారు.
ఆయనతో కలిసి పని చేయాలనుకున్నానని, ఆయన కూడా తనతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపారని శిరీష్ అన్నారు. ఆయన ఒక కథను టూకీగా చెప్పినప్పుడు దానిని డెవలప్ చేయడానికి అయిదు నెలలు పట్టిందని అన్నారు. అలా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ప్రతి పాత్రా ప్రధానమైనదని అన్నారు. రావు రమేష్, ప్రకాష్ రాజ్, తదితర గొప్ప నటులతో కలిసి నటించడం తనకు గొప్ప అనుభవమని చెప్పారు. తనతో నటించిన లావణ్యా త్రిపాఠి ఓ గొప్ప నటి అని, ఆమె నటించడం కోసం నటించలేదని, జీవించారని అన్నారు. తన పాత్ర గురించి మాట్లాడుతూ ఎప్పుడూ ఉల్లాసంగా తిరిగే పాత్ర అని శిరీష్ అన్నారు. ఈ తాజా చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు ఉండవని, ఇదంతా ఓ ఎమోషనల్ చిత్రమని శిరీష్ తెలిపారు. తన చిత్రాన్ని ప్రతిఒక్కరు ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.