గొప్పగా రాణించని తుంటరి

నారా రోహిత్, లతా హెగ్డే జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే తుంటరి.
ఈ చిత్రానికి కుమార్ నాగేంద్ర దర్శకులు. ఏ ఆర్ మురుగదాస్ కథ కావడంతో తుంటరి పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అనుకున్నంత విజయం సాధించలేక చతికిల బడింది తుంటరి. తమిళ్ లో సూపర్ హిట్ అయిన మాన్ కరాటే చిత్రాన్నే తెలుగు లో తుంటరి గా పునర్ నిర్మించారు.

తన మిత్రులతో కలిసి వెన్నెల కిషోర్ అనంతగిరి అడవులకు వెళ్ళతాడు. అక్కడ ఒక స్వామీజీ ఎదురుపడతారు. ఆ స్వామీజీ ఓ కాగితాన్ని వారికి వరమల్లే ఇస్తారు. అందులో ఏమేమున్నాయో అవన్నీ వాస్తవ జీవితంలో జరిగిపోతుంటాయి.

బాక్సర్ రాజు మూలంగా అయిదు కోట్ల రూపాయలు వస్తాయని ఆ కాగితంలో రాసి ఉంటుంది.
ఇంకేముంది, ఆ రాజు కోసం అన్వేషిస్తారు. ఎట్టకేలకు ఓ రోజు రాజు తారసపడతాడు.
ఆ రాజు ఇంకెవరో కాదు, ఈ చిత్ర కథా నాయకుడు అయిన నారా రోహిత్.

అయితే రాజుకి బాక్సింగ్ పైన ఏమంత ఆసక్తి ఉండదు. అతనితో బాక్సింగ్ చేయించడానికి తంటాలు పడతారు. “నువ్వు బాక్సింగ్ చేస్తే రోజుకి లక్ష రూపాయలు ఇస్తాం” అంటారు. వారి మాటగా రాజు బాక్సింగ్ పోటీలో పాల్గొంటాడు. ఆ పోటీలో రాజుతో పోటీ పడే ప్రత్యర్ధి పేరు కూడా రాజే కావడం గమనించవలసిన అంశం. ఆ రాజు పాత్రలో కబీర్ దుహన్ సింగ్ నటించాడు. అప్పుడు వెన్నెల కిషోర్ కు ఓ సందేహం కలుగుతుంది. తాను వెతుకుతున్న రాజులో ఎవరు అసలైన రాజు అని?
ఆ నిజమైన రాజు ఎవరు? అయిదు కోట్ల రూపాయలు వెన్నెల కిషోర్ కి లభించాయా వంటివి తెలుసుకోవాలంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే. ఈ క్రమంలో హీరో మదిలోకి లతా హెగ్డే సిరి పేరుతో ఎలా వచ్చింది కూడా తెలుస్తుంది.

నారా రోహిత్ నటన, సంగీతం ఈ చిత్రానికి కలసి వచ్చే అంశాలు. సాయి కార్తీక్ స్వరాలు అందించారు. రోహిత్ ఈ చిత్రంతో కామెడీ కూడా పండించాడు తన నటనలో. నృత్యాలు కూడా చెప్పుకోదగ్గ రీతిలోనే చేసాడు. విలన్ గా కబీర్ దుహన్ సింగ్ కూడా బాగానే నటించాడు. లతా హెగ్డే పరవాలేదు. మిగతా నటీనటులు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేయకపోలేదు.

Send a Comment

Your email address will not be published.