చందమామ, నాగిరెడ్డి

B-NAGIచందమామ అనే పిల్లల మాస పత్రిక పేరు చెప్పడంతోనే ఠకీమని తలపునకొచ్చే పేరు బొమ్మిరెడ్డి నాగిరెడ్డి. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రచురణకర్తగా, విజయావాహినీ స్టూడియో అధినేతగా, ప్రముఖ దక్షిణ భారత చలనచిత్ర నిర్మాతగా, తెలుగు సినీ రఁగ మార్గదర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న బొమ్మిరెడ్డి నాగిరెడ్డి 1912 డిసెంబర్ రెండవ తేదీన కడప జిల్లా పులివెందుల సమీపంలోని పొట్టెంపాడు గ్రామంలో జన్మించారు.

రైతు కుటుంబానికి చెందిన నాగిరెడ్డి ప్రాథమిక విద్య పొట్టెంపాడు గ్రామంలోనే సాగింది. అనంతరం మద్రాసు వెళ్ళి హైస్కూల్ చదువు చదివారు. నాగిరెడ్డి పన్నెండేళ్ళకల్లా పురాణాలు, ఇతిహాసాలు వంటివన్నీ క్షుణ్ణంగా చదివేశారు.

(నాగిరెడ్డి సోదరుడు బీఎన్ రెడ్డికి కూడా చలనచిత్ర పరిశ్రమతో ఎనలేని సంబంధముంది.) హైస్కూలు చదువు పూర్తికాకముందే ఆయన కొన్ని కారణాల వల్ల వ్యాపార బాధ్యతలు చేపట్టకతప్పలేదు. ఓ ఏడాదికాలంపాటు తండ్రితో కలిసి స్వగ్రామానికి చేరుకుని అక్కడే గడపాల్సి వచ్చింది. ఆ ఏడాదిపాటు ఏ పనీ పాటా లేకుండా గడిపానని ఆయన తన గురించి రాసుకున్న స్వగతంలో చెప్పుకున్నారు.

ఇలా ఉండగా, ప్రముఖ దర్శకుడు నిరామత కె.వి. రెడ్డి తాను నిర్మించిన భక్తపోతన చిత్రానికి పబ్లిసిటీ కోసం బొమ్మిరెడ్డి నాగిరెడ్డి సహాయం తీసుకున్నారు. కెవి రెడ్డి పిలుపు మేరకు మద్రాసు వచ్చిన బొమ్మిరెడ్డి నాగిరెడ్డి పబ్లిసిటీ కార్యక్రమంలో భాగంగా అరవై అడుగుల ఎత్తులో అతి పెద్ద హనుమంతుడి కటౌటుని తయారు చేయించి మద్రాసులోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేశారు. ఈ పబ్లిసిటీ కోసం ఆయనకు అయిదు వందల రూపాయలు పారితోషికం లభించింది. ఆ సొమ్ముతో ఆయన ఆస్టిన్ కారు కొనుగోలు చేసారు. అంతేకాదు, ఏదయినా వ్యాపారం చేయాలని ఆలోచించి ఓ ప్రింటింగ్ ప్రెస్ నెలకొల్పారు. తొలి రోజుల్లో ఈ ప్రెస్సులో శుభలేఖలు మాత్రం అచ్చయ్యేవి.

అంతకుముందే ఏర్పాటు చేసిన వాహినీ సంస్థ నిర్మించిన స్వర్గసీమ చిత్రానికి చక్రపాణి రచయితగా కుదిరినప్పుడు ఆయనతో పరిచయం కలిగింది. ఆ తర్వాత వీరి మధ్య పరిచయం కలకాలం సాగింది. నాగిరెడ్డి అంటే చక్రపాణి, చక్రపాణి అంటే నాగిరెడ్డి అన్నట్లుగా వారి మధ్య బంధం విడదీయరానంతగా అల్లుకుంది.

వీరి మధ్య బంధం అన్నదమ్ములకన్నా ఎక్కువగా సాగింది.

చక్రపాణి సంపాదకత్వంలో నాగిరెడ్డి ప్రింటింగ్ ప్రెస్సులో మొట్టమొదటగా ఆంధ్రజ్యోతి మాస పత్రిక అచ్చయ్యింది. ఈ సంస్థ ఓ కొలిక్కి వచ్చి నిలబడ్డాక చందమామ మాస పత్రిక శ్రీకారం చుట్టుకుంది. చందమామ పత్రిక 1947లో ఆరంభమైంది. పిల్లల కోసం ప్రారంభించిన ఈ పత్రిక పన్నెండు భాషలలో ముద్రితమైంది. మనదేశంలోనే కాకుండా విదేశాలకు కూడా చందమామ పంపిణీ అయ్యేది. కాలక్రమంలో చందమామ బ్రెయిలీ లిపిలోను నాలుగు భాషల్లో అచ్చవడం విశేషం. ఇక సినిమా పత్రిక విజయచిత్ర, మహిళ కోసం వనిత అనే పత్రిక కూడా ఈ సంస్థ నుంచి వెలువడ్డాయి.

ఈయన సారధ్యంలో వాహినీ సంస్థ నుంచి అనేక చిత్రాలు వెండితెరకెక్కాయి. పాతాళభైరవి చిత్రం తెలుగు, తమిళం, కన్నడం భాషలలో 28 థియేటర్లలో శత దినోత్సవాలు జరుపుకోవడం ఓ రికార్డు. ఈ చిత్రం తర్వాత ఆయన ఇక వెనుతిరిగి చూడలేదు. ఆయన ఏ కార్యం చేపట్టినా అది విజయవంతమయ్యేది.

మిస్సమ్మ, గుండమ్మకథ, జగదేకవీరుని కథ, మాయాబజార్, రాముడు భీముడు తదితర జానపద, సాంఘిక, పౌరాణిక చిత్రాలను సమర్పించిన బొమ్మిరెడ్డి నాగిరెడ్డి చలనచిత్రరంగానికి చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం గుర్తించి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. పొరుగుననున్న తమిళనాడు ప్రభుత్వం కలైమామణి బిరుదుతో ఆయనను సత్కరించింది.
చక్రపాణి మరణించిన తర్వాత ఆయన సినిమాలు తీయడం మానేశారు. అయితే చాలాకాలం తర్వాత ఆయన 1990లలో విజయా బ్యానరుపై ఓ సినిమా తీశారు. ఆ చిత్రం పేరు విజయ. ఇందులో రజనీకాంత్ నటించారు.
విజయాసంస్థ నుంచి వెండితెరపై ఓ వెలుగు వెలుగిన వారిలో నటులు రామారావు, ఏస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావు, సూర్యకాంతం, రేలంగి, రమాణారెడ్డి తదితరులెందరో ఉన్నారు. అలాగే, చక్రపాణితోపాటు పింగళి నాగేంద్రరావు కూడా ఈ సంస్థ తరఫున ప్రముఖ రచయితగా ఎదగడమే కాకుండా ఎనలేని కీర్తిప్రతిష్టలు సంపాదించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా ఉండిన ఆయన విజయ ఆస్పత్రితో వైద్యరంగానికి కూడా ఎనలేని సేవలు అందించారు.

ఈయన సారధ్యంలో నిర్మితమైన విజయ కలర్ లాబరేటరీస్ అత్యున్నతమైనదిగా వినుతికెక్కింది.

గొప్పమానవతావాదిగాను పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఆయన తన 92వ ఏట 2004 ఫిబ్రవరి 25వ తేదీన కన్నుముశారు.

Send a Comment

Your email address will not be published.