చలనచిత్ర పరిశ్రమకు బాహుబలి

baahubali-Prabhas

ఈశ్వర్ సినిమాతో రంగ ప్రవేశం చేసిన ప్రభాస్ బాహుబలి కథానాయకుడిగా అంతర్జాతీయస్థాయికి ఎదిగిన పర్వం టాలీవుడ్ కే కాదు భారతీయ చలనచిత్ర పరిశ్రమకే ఓ పెట్టని కోట. అతని పూర్తి పేరు ఉప్పలపాటి ప్రభాస్. అలనాటి కథానాయకుడు కృష్ణంరాజు సోదరుడి కుమారుడు అయిన ప్రభాస్ తండ్రి సూర్యనారాయణరాజు, తల్లి శివకుమారి. ప్రభాస్ తండ్రి ఓ నిర్మాత.

పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు ప్రభాస్ పూర్వీకుల స్వగ్రామం. 1973 అక్టోబర్ 23 వ తేదీన చెన్నయ్ లో జన్మించిన ప్రభాస్ కు ఓ అన్నయ్య (ప్రబోధ్), ఓ సోదరి (ప్రగతి) ఉన్నారు.

బాహుబలితో ఆకాశాన్ని మించినంత ఎత్తుకు ఎదిగిన ప్రభాస్ ఆరేళ్ళకు పైగానే ఒక్క బాహుబలికే తన నట జీవితాన్ని అంకితం చేసాడు. ఏంటీ ఒక్క ప్రాజెక్టు కోసమే తన సమయాన్నంతా కేటాయించాలా అని అందరూ అనుకున్నారు. కానీ రాజమౌళి దృష్టికి నూటికి రెండు వందల శాతం అంకితమై ఆయన సృష్టించిన కళాఖండానికి తనను సమర్పించుకున్న ప్రభాస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఇంట చెప్పుకునే గొప్ప నటుడయ్యాడు అంటే అతిశయోక్తి కాదు.

బాహుబలి ముందు వరకూ దక్షిణాదికే పరిమితమైన ప్రభాస్ పేరు, అనంతరం అతని ప్రతిభాపాటవాలు దేశం నలుమూలలకు విస్తరించాయి.

హైదరాబాదులోని శ్రీచైతన్య కాలేజీ నుంచి బీ టెక్ డిగ్రీ చేసిన ప్రభాస్ నటించిన తొలి సినిమా ఈశ్వర్. ఇది 2002లో వచ్చిన సినిమా. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయవంతమైనా ప్రభాస్ కెరీర్ కు అనుకున్నంతగా దోహదపడలేదు. ఈ చిత్రంలో ప్రభాస్ తోపాటు ప్రముఖ తమిళనటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవి నటించింది. ఆమెకు తెలుగులో ఇదే తొలి చిత్రం కావడం గమనార్హం. అయితే మరో రెండేళ్ళకు 2004లో వచ్చిన వర్షం సినిమా ప్రభాస్ నట జీవితాన్ని మార్చేసింది. టాలీవుడ్ లో పది మందీ చెప్పుకునే మాటగా ప్రభాస్ ఎదగడానికి వర్షం సినిమా ఎంతగానో తోడ్పడింది. వర్షం సినిమాలో ప్రభాస్ సరసన త్రిష నటించింది.

బాహుబలి కన్నా ముందే రాజమౌళితో కలిసి ప్రభాస్ 2005 లో చేసిన చిత్రం ఛత్రపతి. ఆంధ్రప్రదేశ్ లో ఈ చిత్రం ఏకంగా యాభై నాలుగు కేంద్రాలలో వంద రోజులకుపైన ఆడి బ్లాక్ బస్టర్ చిత్రంగా రికార్డు పుటలకెక్కింది. ఈ ఛత్రపతి చిత్రంలో ప్రభాస్ జోడీగా శ్రియా నటించింది.

ఇక 2008 లో ప్రభాస్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో త్రిష సరసన తన కెరీర్ లో రెండో సారి నటించిన బుజ్జిగాడు చిత్రం కూడా విజయవంతమైంది.

2010లో విడుదల అయిన డార్లింగ్ చిత్రం ప్రభాస్ కు మొదటిసారిగా ఓ అవార్డు తెచ్చిపెట్టింది. ఉత్తమ నటుడు క్యాటగరీలో ప్రభాస్ కు ఈ ఘనత దక్కింది.

బాహుబలికన్నా ముందు మిర్చి చిత్రం ప్రభాస్ నటించిన యాక్షన్ చిత్రంగా తెరకెక్కింది. ఇది కూడా విజయవంతమైన చిత్రమే.

మిర్చి చిత్రం తర్వాత ప్రభాస్ రాజమౌళితో కుదుర్చుకున్న ఒప్పందం బాహుబలి చిత్రానికే. ఈ చిత్రంకోసం మరే చిత్రం చేయడానికి ఒప్పుకోని ప్రభాస్ అమరేంద్ర బాహుబలిగా, మహేంద్ర బాహుబలిగా ఎదిగి కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్నాడు.

Prabhas Bujjigadu

ఈ బాహుబలి కోసం ప్రభాస్ తన హృదయాన్ని ఆత్మను ఒక్కటి చేసి తనను అంకితం చేసుకున్నాడనడం అక్షరసత్యం…

బాహుబలి కన్నా ముందు వరుసగా మూడు హిట్లు కొట్టిన ప్రభాస్ తో చిత్రం చేయడానికి అనేక మంది నిర్మాతలు కాసుల వర్షం కురిపిస్తామని ముందుకు వచ్చారు. కానీ ఎవరితోనూ ఏ ఒప్పందమూ కుదుర్చుకోని ప్రభాస్ బాహుబలికి మాత్రమే

తన పనితనాన్ని అప్పగిస్తున్నట్లు ప్రకటించడం, ఆ చిత్రం తర్వాతే మరే చిత్రమైనా చేస్తానని కచ్చితంగా చెప్పడం పలువురిని ఆశ్చర్యపరిచింది. అయితేనేం, ఆ చిత్రం వల్ల ప్రభాస్ కు వచ్చిన పేరు ఇంతా అంతాకాదు. ఖండఖండాతరాలు దాటాయి అతని ప్రతిభ. అతని నైపుణ్యం.

Mirchi-Movie-Posterబాహుబలి చేస్తున్నప్పుడైతే, చాలా మంది నిర్మాతలు నగదు, చెక్కులతో ప్రభాస్ ఇంటి చుట్టూ తిరిగారట. ఆ సమయంలో తనకేం చేయాలో తెలీక ప్రభాస్ ఈ విషయమై రాజమౌళితో చర్చించాడు. తానేం చేయాలని అడిగాడు. అప్పుడు రాజమౌళి తన పనితనానికి డబ్బుతో ఎలాంటి సంబంధం లేదని ఓ అఫిడవిట్ రాయించుకోమని సలహా ఇచ్చారు. కానీ అందుకు ప్రభాస్ సమ్మతించలేదు. ఒకవేళ డబ్బులు ఇచ్చిన వారు తన వద్దకు వస్తే తాను తిరిగి అంత డబ్బు ఎలా ఇచ్చుకోగలనని, కనుక అలాంటి అఫిడవిట్ కు ససేమిరా అన్నాడు ప్రభాస్. ఓ అడ్వర్ టైజ్ మెంట్ కోసం ప్రభాస్ కు ఏకంగా పది కోట్లు ఇవ్వడానికి ఓ సంస్థ ముందుకు వచ్చింది కూడా ఆ సమయంలోనేనట. కానీ ప్రభాస్ వద్దని ఆ అవకాశాన్ని సైతం సున్నితంగా తిరస్కరించాడు. ఎవరి హృదయాలను నొప్పించకుండా ఏం మాటలు చెప్పాలో అనే విషయంలో ప్రభాస్ తర్జనభర్జనలు పడుతుండే వాడు. తన వల్ల ఎవరి హృదయమూ గాయపడకూడదన్నదే ప్రభాస్ మనసు మాట.

ప్రభాస్ అనుష్క, రానా దగ్గుబాటి తదితరులతో కలసి నటించిన బాహుబలి సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది. ఇందులో మొదటి భాగమైన “బాహుబలి – ది బిగినింగ్” తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో విడుదలై భారత చలనచిత్ర రంగంలో ఇంతవరకు నమోదు చేయని కలెక్షన్లను వసూలు చేసింది. ఇక రెండవ భాగమైన బాహుబలి – 2 2017 ఏప్రిల్ 28న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళతో భారతీయ సినిమా చరిత్రలో మొట్ట మొదటగా వెయ్యి కోట్లు దాటిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా దాదాపు 1700 కోట్ల వరకూ వసూలు చేయడం విశేషం. ఈ సినిమాతోనే ప్రభాస్ కు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు వచ్చాయనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం ప్రభాస్ ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో సాహు అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం 2018 లో విడుదలకానుంది.

ఇలా ఉండగా, కుటుంబ సభ్యులు పెళ్ళి చేసుకోమని సూచించినప్పుడు బాహుబలి ప్రాజెక్టు తర్వాతే అని ప్రభాస్ చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి కూడా. కానీ వాటిని కూడా ప్రభాస్ సున్నితంగా తిరస్కరించాడు.

ప్రభాస్ ను ఎవరైనా మీకు నచ్చిన చిత్రం ఏదని అడిగితే అతను చెప్పే సమాధానం – భక్త కన్నప్ప చిత్రం. ఈ చిత్రం 1976లో విడుదల అయింది. ఈ చిత్రంలో కృష్ణంరాజు కథానాయకుడుగా నటించడం తెలిసిన విషయమే.
హిందీలో మున్నాబాయ్ ఎంబిబిఎస్ అండ్ త్రీ ఇడియట్స్ చిత్రాన్ని ప్రభాస్ ఇరవై సార్లు పైనే చూసిన ప్రభాస్ కు హాలీవుడ్ లో రాబర్ట్ డి నీరో అంటే ఎంతో ఇష్టమైన నటుడు.

బాహుబలి చిత్రం కోసం అతని శరీర సౌష్టవం కోసం మిస్టర్ వరల్డ్ 2010 లక్ష్మణ్ రెడ్డి ప్రభాస్ తో తీవ్రస్థాయిలో వ్యాయామాలు చేయించారట.

ఇక మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు ప్రతిమ తీర్చి దిద్దడంలోనూ ఓ రికార్డు ముడిపడి ఉంది. దక్షిణాది చలన చిత్ర పరిశ్రమ నుంచి మేడమ్ టుస్సాడ్ లో చోటుచేసుకున్న తొలి నటుడిగా ప్రభాస్ పేరు రికార్డు పుటలకెక్కింది.
– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.