చలాకీగా అక్కినేని

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు పూర్తి ఆరోగ్యం తో ఉన్నారు. “మనం” షూటింగ్ లో ఎంతో చలాకీగా పాల్గొంటున్నారని ఆయన మనమడు సుమంత్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 39 సంవత్సరాల క్రితం తొలిసారిగా శస్త్ర చికిత్స చేయించు కున్నారు. అప్పట్లో డాక్టర్లు ఆయన మరో పధ్నాలుగు సంవత్సరాలు బతుకుతారేమో అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది జరిగి నలభై ఏళ్ళు కావస్తోంది. అయినా అక్కినేని ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. శస్త్ర చికిత్స తర్వాత కూడా హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు నాట తిరుగులేని హీరో అని నిరూపించు కున్నారు. తొమ్మిది పదుల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా సినిమాల్లో నటిస్తూ తన తర్వాత తరానికి స్పూర్తిని ఇస్తున్నారు. తన నట వారసుడిగా రంగ ప్రవేశం చేసిన నాగార్జున విజయాల్ని, ఆ తర్వాత వచ్చిన మూడో తరం వారసులు సుప్రియ, సుమంత్, నాగ చైతన్య, సుశాంత్ ల విజయాల్ని చూసి ఆనందిస్తున్నారు.

అంతే కాదు అక్కినేని కుటుంబం లోని మూడు తరాల నటులు కలిసి నటించాలన్న అభిమానుల కోరిక మేరకు “మనం” సినిమా లో నాగార్జున, నాగ చైతన్యతో కలిసి నటిసున్నారు. అయితే ఈ సినిమా ప్రారంభం అయిన తర్వాత అక్కినేని శరీరంలో కాన్సర్ కణాలు ఉన్నాయని డాక్టర్లు గుర్తించారు. ఈ విషయాన్ని అక్కినేని నాగేశ్వర రావు ప్రెస్ మీట్ పెట్టి మరీ అభిమానులకి చెప్పారు. అభిమానుల అండదండలు ఉన్నంత వరకూ ఎన్ని శస్త్ర చికిత్సల కైనా తన శరీరం ఏమీ కాదని, అందువల్ల తనకి కాన్సర్ వచ్చిందని అభిమానులు ఎవరూ ఆందోళన చెంద వద్దని ఆయన పిలుపునిచ్చారు.

ఆ తర్వాత ఆయనకి హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో శస్త్ర చికిత్స జరిగింది. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అప్పటినుంచీ ఆయన చాలా ఆరోగ్యం గా ఉన్నారు, ఇప్పుడు రెగ్యులర్ గా మనం షూటింగ్ లో పాల్గొంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి దర్శకుడు విక్రం కుమార్.

Send a Comment

Your email address will not be published.