చిరుని పూరీ వద్దన్నారా?

వరుణ్ తేజ్ నటించిన లోఫర్ చిత్రం తాలూకు ఆడియో విడుదలకు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ మెగా స్టార్ చిరంజీవిని పిలవకపోవడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పూరీ ఎందుకని చిరుని పిలవలేదు అని గుసగుసలు మొదలయ్యాయి.

పూరీజగన్నాథ్ తాను దర్శకత్వం వహించిన చిత్రాల ఆడియో, వీడియో ఫంక్షన్ లకు చిరంజీవిని ముఖ్య అతిధిగా పిలవడం సర్వసహజం. కానీ ఇప్పుడు వరుణ్ తేజ్ నటించిన లోఫర్ చిత్రానికి చిరుని పూరీ ఎందుకు ఓవర్ లుక్ చేసారు అనేది చర్చయ్యింది.

ఇందుకు కారణంగా చిరు తన 150వ చిత్రానికి పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహిస్తారని ముందు ప్రకటించి ఆ తర్వాత పూరీ చెప్పిన కథలో సెకండ్ పార్ట్ తనకు నచ్చ లేదు అనే విషయాన్ని పూరీతో కాకుండా సరాసరి మీడియాకు చెప్పడం అప్పట్లో ప్రధాన అంశమైంది. తాను చెప్పిన కథలో నచ్చని విషయాన్ని మీడియాతో కంటే ముందు తనతో చెప్తే బాగుండేదని పూరీ నొచ్చుకుంటూ ఓ ప్రకటన కూడా చేసారు. బహుశా ఆ ఎపిసోడ్ ని మనసులో పెట్టుకునే ఇప్పుడు పూరీ జగన్నాధ్ లోఫర్ సినిమా ఆడియో కార్యక్రమానికి చిరంజీవిని గెస్టుగా పిలవలేదా అని అనుకుంటున్నారు.

లోఫర్ చిత్ర నిర్మాత సి కళ్యాన్ తో పూరీ జగన్నాధ్ ఈ చిత్ర ఆడియో కార్యక్రమానికి మెగా స్టార్ చిరు క్యాంప్ నుంచి ఎవరినీ పిలవకూడదని చెప్పినట్టు తెలిసింది. అందుకే ప్రభాస్ ను ముఖ్య అతిధిగా పిలిచినట్టు కూడా తెలిసింది.

ఈ విషయాన్ని నిర్మాత కళ్యాన్ ను అడగ్గా ఆయన ఇలా జవాబిచ్చారు …

“పూరీ జగనాద్, చిరు మధ్య నలిగిన గొడవ కారణంగానే చిరంజీవిని ఆడియో కార్యక్రమానికి పిలవ లేదా అనడం నిజం కాదు. ఈ ఆడియో కార్యక్రమాన్ని రొటీన్ కి భిన్నంగా నిర్వహించాలని అనుకున్నాం. అందుకే ప్రభాస్ ని చీఫ్ గెస్టుగా పిలిచాం. అయితే ఆడియో విడుదల కార్యక్రమంలో చిరంజీవి తదితర నటులు వరుణ్ తేజ్ ని దీవించిన మాటల వీడియో ప్రదర్శిస్తాం. పూరీ, చిరుల మధ్య గొడవల పర్వం ముగిసిపోయిన అధ్యాయం. వారిద్దరూ ఆ తర్వాత కలసి మాట్లాడుకున్నారు.. వారి మధ్య ఇప్పుడు విభేదాలు ఏవీ లేవు” అని కళ్యాన్ చెప్పారు.

Send a Comment

Your email address will not be published.