జగదేక సుందరి విలనా?

మానవా …. మానవా అంటూ ముద్దు ముద్దు మాటలతో మురిపించిన జగదేక సుందరి శ్రీదేవి గయ్యాళి గంపమ్మ లా విలన్ పాత్రల్లో కనిపిస్తే తట్టుకోవడం కష్టమే. అందుకే, ఈ ముద్దుగుమ్మ విలన్ పాత్రలకి నో చెబుతోందట.

ఇంద్రుడి కూతురు ఇంద్రజ ఎలా ఉంటుందో మనకు తెలియదు. అయితే శ్రీదేవి కంటే అందంగా మాత్రం ఉండదు అని భారతీయుల నమ్మకం. నాలుగు దశాబ్దాల పాటు అల్ ఇండియా స్టార్ హీరొయిన్ గా వెలిగిన ఏకైక నటీమణి శ్రీ దేవి మాత్రమే.

చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ జీవితాన్ని ప్రారంభించిన శ్రీ దేవి ఆనాటి అగ్ర నటులు నందమూరి తారక రామారావు కి మనమరాలి గా బడి పంతులు సినిమాలో నటించింది, ఆ తర్వాత ఆమె ఆకుచాటు పిందె తడిసే అంటూ ఎన్.టి.ఆర్ సరసన హీరొయిన్ గా నటించింది, ఎన్ టిఆర్ పక్కన హిట్ పెయిర్ గా క్రెడిట్ కూడా దక్కించుకొంది. కొడవీటి దొంగ, జస్టిస్ చౌదరి, అనురాగ దేవత వంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ మూవీస్ వీరి కాంబినేషన్ లో వచ్చాయి. అలాగే అక్కినేని నాగేశ్వర రావు కి కూతురి గా నటించి మెప్పించిన శ్రీదేవి అయన తో ప్రేమాభిషేకం లో పాటలు పాడింది. శోభన్ బాబు తో దేవత కృష్ణ తో పచ్చని కాపురం వంటి ఎన్నో సినిమాల్లో నటించి వారందరికీ ఈడూ జోడు నేనే అని చాటింది. ఆ తర్వాత తరం నటులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి హీరో లతో కూడా నటించి హిట్ పెయిర్ పేరు తెచ్చుకొంది.

హిందీ లోనూ అగ్ర తార గా వెలుగొందిన శ్రీ దేవి అగ్ర నటీమణి గా ఉండగానే బాలీవుడ్ నిర్మాత, అనిల్ కపూర్ సోదరుడు బోణీ కపూర్ ని వివాహం చేసుకొని సినిమా ల నుంచి నిష్క్రమించారు. ఎంతమంది నిర్మాతలు, దర్శకులు, నటులు శ్రీదేవిని నటించమని కోరినా, ఆ ఆఫర్లని ఆమె తిరస్కరించారు. సుమారు పది హేను సంవత్సరాల పాటు సినిమాలకి దూరంగానే ఉన్నారు. అయితే ఇంగ్లిష్ – వింగ్లిష్ సినిమా కధ బాగా నచ్చడం తో తిరిగి మూఖానికి రంగు వేసుకొన్నారు. ఆ సినిమా ఊహించని విజయం సాధించడంతో మా సినిమాల్లో నటించమని తెలుగు, తమిళ్, హిందీ నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కట్టారు. యాభై సంవత్సరాలు దాటినా వన్నె తరగని అందంతో మెరిసి పోతున్న శ్రీ దేవి తమ సినిమాల్లో నటిస్తే విజయం ఖాయమని నిర్మాతలు భావిస్తుంటే, ఈ వయసులో అయినా శ్రీదేవి సరసన హీరోగా నటించాలని ఎంతో మంది కుర్ర హీరోలు కలలు కంటున్నారు. అయితే ఆమె మాత్రం పాత్రల ఎంపిక విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటున్నారు. ప్రేక్షకుల ద్రుష్టిలో అందాల రాణిగా , అతిలోక సుందరిగా ఉన్న ఊహల్ని కాదని అక్క, అత్త వంటి పాత్రలు చేయడానికి ఇష్టపడటం లేదు. ఇంకా హాలీవుడ్ చిత్రం గ్రేట్ ఎక్స్పెక్టెషన్ ఆధారంగా హిందీలో అభిషేక్ కపూర్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఫితూర్ సినిమాలో ప్రతి నాయిక పాత్ర కి శ్రీదేవిని అడిగారట. అయితే ఈ పాత్రకి నేను రైట్ ఛాయస్ కాదు అని శ్రీదేవి దర్శకుడితో చెప్పారట. దాంతో శ్రీదేవి వసంత కోకిలలో అమాయకురాలిగానే ప్రేక్షకుల మనసులో ఉండాలని భావిస్తున్నట్టు సినీ జనాలు చెప్పు కొంటున్నారు .

Send a Comment

Your email address will not be published.