జయాపజయాలు ఆలోచించను

బెంగాల్ టైగర్ కమర్షియల్ ప్యాకేజీతో కూడిన రెగ్యులర్ కథే తప్పించి అత్యద్భుతమైన కథ కాదని ఆ చిత్ర కథానాయకుడు రవితేజ అన్నారు.

మూడేళ్ళ క్రితం దర్శకుడు సంపత్ నంది బెంగాల్ టైగర్ కథ తనకు చెప్పారని, అయితే అప్పట్లో కొన్ని కమిట్ మెంట్స్ వల్ల అది ఇప్పుడు కార్యరూపం దాల్చిందని రవితేజ అన్నారు.

సంపత్ మంచి రచయిత అని, ఆయన మాటలు తనకు చాలా ఇష్టమని, కనుక ఆయన తనకు కథ చెప్పినప్పుడు దానిని డెవలప్ చెయ్యమని సూచించినట్టు ఆయన అన్నారు.

బెంగాల్ టైగర్ ని చాలా తెలివైన జంతువుగా అందరూ చెప్పుకుంటారని, అందుకే ఆ టైటిల్ ఈ చిత్రానికి పెట్టినట్టు రవి తేజ తెలిపారు. రాశిఖన్నా, తమన్నా లాంటి పాసిటివ్ తారలతో వర్క్ చేయడం చాలా బాగుంటుందని అంటూ ఒక పాటలో ఈ ఇద్దరు తారలను పైకెత్తి మోసే విషయాన్ని చెప్తూ కెమెరా ముందుకి వచ్చి నిల్చున్నప్పుడు తన శక్తి పెరుగుతుందని చెప్పారు. అది ఆ క్షణంలో జరిగిన సంగతని అన్నారు.

తాను నటించిన చిత్రం విడుదల అయ్యేటప్పుడు తాను ఏ మాత్రం నెర్వస్ గా ఫీల్ కాబోనని , తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తానని రవితేజ అన్నారు. అంతేతప్ప విడుదల అయిన చిత్రం ఫలితం గురించి ఆలోచించనని చెప్పారు.

ఓ సినిమా ఫ్లాప్ అయినా విజయవంతమైనా ఆ ఫలితాలను విశ్లేషించనని, గతంలోనే తాను ఉండిపోనని అన్నారు.

కిక్ – 2 సరిగ్గా ఆడనందుకు ఆ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డిని తాను విమర్శించినట్టు వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ అది పూర్తిగా తప్పుడు వార్త అని అన్నారు. తన చిత్రం ఫ్లాప్ అయినప్పుడు తాను ఎవరినీ నిందించబోనని, ఈ పరిశ్రమలో జయాపజయాలు సహజమని, తన దర్శకులు అందరితోను తాను మంచి సంబంధాలే కొనసాగిస్తానని, అలాగే ఇతర నటులతోనూ అని రవితేజ తెలిపారు. తాను, సురేందర్ రెడ్డి మంచి మిత్రులమని, సమీప భవిష్యత్తులో మళ్ళీ తామిద్దరం కలసి పనిచేస్తామని ఆయన చెప్పారు.

వ్యక్తిగత జీవితంతో వృత్తిపరమైన జీవితాన్ని కలపనని, రెండూ రెండు జీవితాలని, అంతేతప్ప వాటిని కలిపి చూస్తే సమస్యలు తలెత్తుతాయని , తన ప్రైవేటు జీవితం గురించి పబ్లిక్ లో మాట్లాడానని రవితేజ అన్నారు. ఎవరి జీవిత పంధా వారిదని, అంతేతప్ప ఒకరికొకరితో పోల్చి చూడటం తగదని ఆయన అన్నారు.

Send a Comment

Your email address will not be published.