టాలీవుడ్ లో మళ్ళీ అక్ష..

నటి అక్ష తన సినిమా డాక్టర్ సలీం విడుదల కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తోంది. తమిళంలో ఈ చిత్రం ఇప్పటికే హిట్టు కొట్టింది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగులో రావాల్సి ఉంది.

“ఈ చిత్రం నాకెంతో  ప్రధానం. ఎందుకంటే తెలుగులో నటించి ఏడాది పైనే అయ్యింది. ఈ చిత్ర కథను అన్ని వర్గాల వారూ ఆదరిస్తారనే నా గట్టి నమ్మకం” అని అక్ష చెప్పింది.

తెలుగులో నటించడం మొదలుపెట్టి కొన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించింది అక్ష. ఆమె నటించి హిట్టైన  చివరి సినిమా కందిరీగ. ఈ చిత్రంలో ఆమె రామ్ సరసన నటించింది. ఆ చిత్రం తర్వాత ఆమె పెద్దగా విజయాన్ని చవిచూడలేదు.

“నిజానికి  ఎక్కడా  తప్పు జరగలేదు. కొన్నిసార్లు కాలం కలిసిరాదు. మనమెంత శ్రమించినా కాలం సహకరించదు. కందిరీగ తర్వాత నేను రెండు సినిమాలు చేసాను. ఆ రెండు చిత్రాలూ సరిగ్గా  ఆడ లేదు. కొన్ని నిర్ణయాలు తప్పాయి. ఆ తర్వాత నేను తమిళంలో నటించడం మొదలుపెట్టాను. మంచి ఆఫర్లే వచ్చాయి” అంటున్న అక్ష ఈ రోజు వరకు ఎనిమిది సినిమాలు చేసింది.

“నేను నటించే సినిమాలు చిన్నవో పెద్దవో అని అనుకోకుండా చేసే ప్రతి సినిమాకు ఎంతో కష్ట పడ్డాను. దేనినీ చిన్న చూపు చూడక శ్రమించాను. నా ప్రాజెక్టులను ప్రిస్టేజ్ గా తీసుకునే చేసాను. ప్రతీ సినిమాకు సంతకం చేసేటప్పుడు నా నటన ఎంతో బాగుండాలి అనుకుంటాను. పాత్రను అర్ధం చేసుకుని నటిస్తాను. అయితే అది ఆడటం ఆడకపోవడం ప్రేక్షకులపై ఆధారపడి ఉంటుంది. అందుకే నేను ఫలితాలను దేవుడికి విడిచిపెడతాను. నా సినిమాలు విఫలమైనప్పుడు నేను ఎంతో బాధ పడతాను. అయితే సినిమాలు విజయవంత మైనప్పుడు  నాలో కొత్త శక్తి పుట్టుకొస్తుంది. అందుకే అంటాను  గెలుపోటములు నా అధీనంలో ఉండవని. . నా ధ్యేయమల్లా వందశాతం అంకిత భావంతో నటించడం. ఈమధ్యే నేను శ్రీకాంత్ జోడీగా నటించడానికి ఒక సినిమాకు ఒప్పందం చేసుకున్నాను. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుంది. అయితే ఇప్పుడే ఆ సినిమా వివరాలు చెప్పలేను. ఏదేమైనా నేను మళ్ళీ టాలీవుడ్ లో విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది…” అని అక్ష ఆశాభావం వ్యక్తం చేసింది.

Send a Comment

Your email address will not be published.