డబ్బు ప్రధానం కాదు

శ్రీమంతుడు సినిమా ఊహించిన దానికన్నా విజయవంతంగా ఆడుతున్న క్రమంలో మహేష్ బాబు ఆ చిత్రం కలెక్షన్స్ గురించి మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. ఆ విషయం గురించి తాను ఏదీ చెప్పానని అన్నారు.

శ్రీమంతుడు సినిమాకు తాను వందశాతం అంకితభావంతో వర్క్ చేశానని, కెరీర్ మొదట్లో ఎంత శ్రమించానో ఆ స్థాయిలోనే ఈ చిత్రానికి కూడా వర్క్ చేశానని మహేష్ బాబు చెప్పారు. ఈ చిత్రం తనకెంతో ప్రధానమని, ఓ చిత్రానికి శాయశక్తులా కష్టపడినప్పుడు, తన వల్ల ఆ చిత్రానికి ఓ మంచి జరగాలనే తలంపుతో కృషి చేసినప్పుడు కలెక్షన్స్ గురించి మాట్లాడటం సబబు కాదని, డబ్బులు వాటంతట అవే వస్తాయని చెప్పారు.

ఈ చిత్రం షూటింగ్ సమయంలో కొన్ని సన్నివేశాలప్పుడు జగపతి బాబు వంటి వాళ్ళు ఎంతో ఎమోషన్ ఫీల్ అయ్యారని, అప్పుడే ఈ చిత్రం విజయం ఖాయం అనిపించిందని, తన సన్నివేశం పూర్తి అయిన తర్వాత జగపతి బాబు కన్నీళ్లు కార్చడం తాను చూశానని మహేష్ బాబు అన్నారు. అలాగే యూనిట్ సభ్యులు కూడా కొందరు అనేక సార్లు ఎమోషన్ కు లోనవడం చూశానని మహేష్ చెప్పారు. అప్పుడే ఈ చిత్రం కథ చాలా బలమైనదని అర్ధం చేసుకున్నానని చెప్పారు.

శ్రీమంతుడు సినిమా మరో వారంలో విడుదల అవుతుందనగా తనకు నిద్రపట్టేది కాదని, సినిమా విడుదల అయిన తర్వాత ఇప్పుడు విజయవంతం కావడంతో పొందిన ఆనందం వల్ల నిద్ర రావడం లేదని అంటూ ఈ చిత్రం విజయం అందరికీ ఆనందంగా ఉందని మహేష్ అన్నారు. శ్రీమంతుడు ఇంతగా విజయవంతం అవుతుందని తాను అనుకోలేదని, ఈ చిత్రం హిట్ అవుతుందని అనుకున్నామని, కానీ ఊహించిన దానికన్నా విజయవంతమవుతుందని అనుకోలేదని చెప్పారు.

తమ స్వస్థలం బుర్రిపాలెంను దత్తత చేసుకోవడం గురించి త్వరలో వివరాలు తెలియజేస్తానని, శ్రీమంతుడు చిత్రం షూటింగ్ ప్రారంభం కాగానే బావ గల్లా బుర్రిపాలెం ను దత్తత తీసుకునే విషయాన్ని తనతో ప్రస్తావించారని, కానీ ఆ సమయంలో తాను ఒక ప్రకటన చేస్తే శ్రీమంతుడు సినిమా పబ్లిసిటీ కోసం చేసినట్టు తలిచే అవకాశం ఉండటంతో అప్పట్లో ఆ ప్రకటన చేయలేదని అన్నారు.

శ్రీమంతుడు చిత్రాన్ని తన సరసన నటించిన శృతి హాసన్ తండ్రి కమల్ హాసన్ కూడా కొనియాడారని, ఈ సినిమా సూపర్ హిట్టవుతుందని విడుదలకు ముందే ఆయన చెప్పారని మహేష్ గుర్తు చేసారు.

Send a Comment

Your email address will not be published.