డెబ్బయి ఆరేళ్ళ చూడామణి

Choodamani1941అది 1941 వ సంవత్సరం. ఈనాటి పోకడలు కలిగిన ఆ నాటి మేటి చిత్రం గుర్తింపు పొందిన గొప్ప చిత్రం చూడామణి.

ఈ చిత్రాన్ని జానకీ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. రాజా సాండో దర్శకత్వం వహించిన చిత్రమే చూడామణి. ఈచిత్రానికి పాటలు రాసిన సదాశివ బ్రహ్మం స్క్రీన్ ప్లే కూడా సమకూర్చారు. ఈ చిత్రంలో మొత్తం 11 పాటలు ఉన్నాయి.

ఈ చిత్రానికి సాహిత్యం అందించిన వెంపటి సదాశివబ్రహ్మం (1905 – 1968) తూర్పు గోదావరి జిల్లాలోని తుని గ్రామంలో వెంపటి బ్రహ్మయ్యశాస్త్రి, వెంకాయమ్మ దంపతులకు మూడవ కుమారుడిగా జన్మించారు. ఆయన పంచకావ్యాలు చదివారు. ఆంధ్ర, సంస్కృత భాషలలో ఆయన గొప్ప పండితుడిగా పేరు గడించారు. ఆయనపై తిరుపతి వేంకటకవుల ప్రభావం బాగానే ఉండేది. అవధాన విద్యపై మొగ్గు చూపిన సదాశివ బ్రహ్మం అష్టావధానాలు, శతావధానాలు చేసి బాలకవిగా మెప్పు పొందారు. ఈయనకు 1928 లో తన 23 వ ఏట శ్రీకాకుళానికి చెందిన జానకమ్మతో పెళ్లయ్యింది. అప్పుడు ఆమె వయస్సు ఎనిమిదేళ్లు. హరికథ, ప్రక్రియలో ప్రబోధాత్మక కథాగానాలతో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయటంలో సదాశివ బ్రహ్మం గొప్ప పాత్రనే ప్రదర్శించారు.

టైటిల్ చూడగానే ఇది జానపదచిత్రమో లేక పౌరాణిక చిత్రమో అనిపిస్తుంది. కానీ కొత్త పుంతలు తొక్కుతూ మేటి చిత్రంగా ప్రేక్షకుల ముందు వచ్చింది. అప్పటి వరకు వచ్చిన పౌరాణిక చిత్రాల మూసను విడిచిపెట్టి రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సి ఎస్ ఆర్, పుష్పవల్లి ముఖ్యపాత్రలు పోషించారు. నారాయణరావు, సుందరమ్మ, పులిపాటి తదితరులు కూడా నటించారు. వీరి పాత్రలు కూడా ప్రధానమైనవి. అలాగని మిగతా పాత్రలకు ప్రాధాన్యం లేదని చెప్పడానికి వీలు లేదు. ఈ చిత్రంలో క్యారెక్టర్లకు కొదవలేదు.

రకరకాల పాత్రలతోపాటు వ్యభిచారగృహం, కత్తులు, తుపాకులతో ప్రేక్షకులను కట్టిపడేసే ఈ చిత్రంలో కరుణరసానికి, భక్తి రసానికి లోటు లేదు. తెలుగు వాతావరణం కాకుండా కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా సరిపోయేలా సన్నివేశాలు సాగుతాయి. సినిమా చూస్తున్నంతసేపు నవ్వులు పూస్తూనే ఉంటాయి. అయితే కొన్ని చోట్ల నిజంగా బాధ కలిగించకపోదు. కానీ ప్రేక్షకుడు ఆ బాధను మరచి నవ్వుతున్నట్టే ఉంటుంది.

ఎడిటింగ్ విషయంలో తగు జాగర్తలు తీసుకోలేదు. దానితో సినిమా అంతా ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలుగా కనిపిస్తుంది. స్క్రీన్ ప్లే పట్టుగా ఉన్నా రచయితకు మాటల విషయంలో తగిన ఫ్రీడమ్ ఇవ్వలేదేమో అనిపిస్తుంది. అందుకే కథలో పట్టు లోపించిందా అనిపిస్తుంది. మరోవిషయం….నటీనటులు కాస్త ఎక్కువ స్వేచ్ఛ తీసుకుని నటించారా అనిపిస్తుంది. దర్శకుడు వారిని వారి నటనలో అడ్డు పడకుండా స్వేచ్ఛ ఇచ్చాడని అనుకునే వారు ఆ రోజుల్లో.

పుష్పవల్లిని మాత్రం చూసిన నాటి ప్రేక్షకులు తెగ పొగిడేవారట. ఆమె నటన ముందు కాంచనమాల ఎక్కడ అని చెప్పిన వారున్నారు.

సి ఎస్ ఆర్ మధుసూదన్ పాత్రలో నటించారు. ఆయన విద్యావంతుడు. వ్యాపారంలో దెబ్బ తిని సంసారం చిన్నాభిన్నమవుతుంది. దానితో ఆయనకు మతి చెడుతుంది. ఈ సన్నివేశంలో ఆయన నటన అమోఘం.

మొత్తం మీద ఈ చిత్రాన్ని ఆ నాటి మేటి సాంఘిక చిత్రంగా చెప్పుకోవచ్చు.

టి.జి.కమలాదేవి నటగాయనిగా ఈ చిత్రంతో పరిచయమయ్యారు.
——————
యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.