నాగ చైతన్య చేతి నిండా చిత్రాలున్నాయి.
చందు మొండేటి తో ఈ మధ్యే నాగచైతన్య ఓ చిత్రానికి ఒప్పందం చేసుకున్నాడు. గతంలో ప్రేమం చిత్రంతో నాగ చైతన్య కలిసి పని చేసిన విషయం తెలిసిందే. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి భారీ చిత్రాలు తీసిన మైత్రి మూవీస్ ఇప్పుడు నాగచైతన్య, చందులతో సినిమా చేయడం విశేషం. దర్శకుడి సన్నిహితుడైన ఒకరు మాట్లాడుతూ ఈ చిత్రం థ్రిల్లర్ చిత్రమని అన్నారు.
దర్శకుడు ఓ వినూత్న కథతో ముందుకు వచ్చారని చెప్పారు. ఆయన మొదటి చిత్రం కార్తికేయ కూడా థ్రిల్లర్ చిత్రమే. అందులో ఓ అతీత శక్తి ఉండేదని, కానీ ఇప్పుడు నాగ చైతన్యతో చేసే చిత్రంలో అలాంటి శక్తి ఉండదని తెలిపారు. ఈ చిత్రంలో ప్రేమ అంశం కూడా ఉంటుందని తెలిపారు. ఇప్పటికింకా కథానాయికను ఎంపిక చేయలేదు. శతమానంభవతి కథానాయిక అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఈ కథలో కథానాయికకు కూడా అధిక ప్రాధాన్యం ఉన్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. అనుపమ లాటి మంచి నటే ఆ పాత్రకు న్యాయం చేయగలదని దర్శకుల అభిప్రాయం. జూన్ నెలాఖరులో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది.