తను నేను

అష్టాచెమ్మ, గోల్కొండ హై స్కూల్, ఉయ్యాలా జంపాలా వంటి మంచి కథాత్మక చిత్రాలను అందించిన రామ్ మోహన్ ఇప్పుడు దర్శకుడి అవతారమెత్తి “తను నేను” సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చారు. ఈ చిత్రంలో నాయికానాయికలు అవికా గోర్, సంతోష్ శోభన్. సంతోష్ శోభన్ కు ఇది తొలి చిత్రం.

కథంతా అవికా గోర్, సంతోష్ శోభన్ ల చుట్టూ సాగుతుంది. సంతోష్ శోభన్ ఓ కాల్ సెంటర్ ఉద్యోగి. అతను కీర్తి పాత్రలో నటించిన అవికా గోర్ తో ప్రేమలో పడతాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఇంతలో అవికా గోర్ కు అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశం వస్తుంది. ఆమె అమెరికాకు వెళ్లాలని అనుకుంటుంది. మరోవైపు కథానాయకుడు సంతోష్ శోభన్ కు అమెరికా అంటే ఇష్టం లేదు. అంతే కాదు అక్కడి ప్రజలన్నా అతనికి నచ్చదు. అదే విషయం ఆమెతో చెప్తాడు. కానే అవికా గోర్ తండ్రి కూడా తన కూతురు అమెరికా వెళ్లి ఉద్యోగం చెయ్యాలనుకుంటాడు. ఆమె అక్కడకు వెళ్లి బోలెడు డబ్బు సంపాదించాలని చెప్తాడు.

ఈలోగా అవికాకు సంతోష్ శోభన్ తల్లిదండ్రుల గురించి ఓ ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. తన తల్లిదండ్రులు చనిపోయారని సంతోష్ శోభన్ మునుపు చెప్పిన విషయానికి సంబంధించి ఓ ఆసక్తికర సమాచారం ఆమెకు తెలుస్తుంది. అక్కడి నుంచి జరిగే కథలోని మలుపులను వెండితెరపై చూడవలసిందే.

దర్శకుడు రామ్ మోహన్ చిత్రాలన్నీ లో బడ్జెట్ చిత్రాలే. అంతే కాదు, కథలు కూడా చాలా సింపుల్ గా ఉంటాయని అందరికీ తెలిసిందే. తను నేను చిత్రం కూడా ఆ కోవలోకే వస్తుంది. ఇదొక ప్రేమ కథా చిత్రం. ఇదేమీ మెలికలు పెట్టే ప్రేమ కథ కాదు. చెప్పదలచుకున్న కథను దర్శకుడు తిన్నగా సాగించారు. సెకండ్ హాఫ్ లో కథ కాస్త నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది. అయినా ఇది బోర్ కొట్టించని చిత్రమే.

సంతోష్ శోభన్ కు ఇదే మొదటి చిత్రం అయినా తన కిచ్చిన పాత్రకు అతను వంద శాతం న్యాయం చేసేడనే చెప్పుకోవాలి. అతని నటన చాలా సహజంగా సాగింది. అతని నటన అదేదో మొదటి చిత్రంలా అనిపించదు చూసే వారికి.

అవికా గోర్ గురించి ప్రత్యేకించి చెప్పక్కరలేదు. బాగానే నటించింది.

రవిబాబు, సత్యకృష్ణ, రోహిత్ వర్మ, నరేష్ తదితరులు నటించిన ఈ సినిమాను ఓ సారి చూడవచ్చు.

Send a Comment

Your email address will not be published.