తరుణంలో అరుణ కిరణుడు

Tarun Bhasker

యువ దర్శకుడు తరుణ్ భాస్కర్

అచంచలమైన ఆత్మవిశ్వాసం, ఆదర్శవంతమైన లక్ష్యం, ప్రేమ కావ్యంలో వినూత్నం, మధ్యతరగతే ప్రధానాంశం, వైవిధ్యమే అభిమతం, ప్రయోగంలో సరిక్రొత్త కోణం, హాలీవుడ్ ప్రామాణికం, బాధ్యతనెరిగిన వ్యవహారం, మరుతరానికి ఆదర్శం.

బాల్యం నుండి తల్లిదండ్రుల ప్రేరణ మరియు కళాతృష్ణతో ఇటు కుంచెకు అటు కలానికి పదును పెట్టి వైవిధ్యమున్న వ్యక్తుల అభిలక్షణాలను తనలో ఇనుమడింపజేసుకొని వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలోని మలుపులుని గెలుపులుగా మార్చుకొని తెలుగు చిత్ర రంగంలో సరిక్రొత్త వరవడి దిద్దుతున్న రచయిత, దర్శకుడు తరుణ్ భాస్కర్.

చిన్నప్పుడు హైదరాబాద్, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాల్లో పెరిగి ఎంతోమంది స్వంతంత్ర లక్షణాలు కలిగిన వ్యక్తులను కలిసి వారి ప్రవర్తనావళిని అవపోసనపట్టి తన హృదయంలో చెరగని ముద్ర వేసుకొని భవిష్యత్తులోని ఊహా చిత్రాలకు రేఖా చిత్రాలను గీసిన హస్తవాసి.

తొలి చిత్రం “పెళ్లి చూపులు”తోనే నూటికి నూరు శాతం మార్కులు తెచ్చుకొని ఎంతోమంది అగ్ర సంస్థల ప్రశంసలనందుకున్న విశిష్ట వ్యక్తి తరుణ్. ప్రస్తుతం నాగార్జున మరియు సురేష్ బాబు వంటి సినీ దిగ్గజాలు వారితో కలిసి పనిచేయడానికి ఆహ్వానాన్ని అందుకున్న చిద్విలాసి.

లఘు చిత్రం “అనుకోకుండా” హైదరాబాద్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ ఫిల్మ్ అవార్డునందుకొని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు షార్ట్ లిస్టు చేయబడడం విశేషం. “సైన్మా” కూడా తెలంగాణా ప్రాంతంలోని ఒక పల్లెటూర్లో చిత్రీకరించబడి ఎంతో ప్రజాదరణ పొందింది.

తన శ్రీమతి లత గారితో ఈ మధ్య మెల్బోర్న్ వచ్చిన సందర్భంగా “తెలుగుమల్లి” పలకరించడం జరిగింది.

“పెళ్లి చూపులు” చిత్రంలో ప్రేమ కావ్యానికి క్రొత్త కోణం చూపించి యువతను ఆకట్టుకునే విధంగా కధను రసవత్తరమైన మలుపులతో చిత్రీకరించారు తరుణ్. చిత్రం 21వ శతాబ్దానికి చెందినదైనా ఇందులోని పాటలు సినీ స్వర్ణయుగాన్ని గుర్తు చేసేవిగా కధకు అనుగుణంగా సాహిత్యానికి సంగీతానికి పెద్ద పీటవేసి మంచి బాణీలో తీర్చిదిద్దటం గమనార్హం.

ఈ చిత్ర నిర్మాణంలో సరిక్రొత్తగా హాలీవుడ్ తరహాలో సింక్ సాంగ్ కాన్సెప్ట్ ని వాడుకలోకి తేవడం జరిగింది. సామాన్యంగా సినిమా షూటింగ్ పూర్తి చేసిన తదుపరి డైలాగులు రికార్డు చేయడం జరుగుతుంది. కానీ ఈ చిత్రంలో షూటింగ్ సమయంలోనే డైలాగులు రికార్డు చేసి సరిక్రొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టడం ఎంతో ముదావహం.

తరుణ్ శ్రీమతి లతగారు ఆంగ్ల భాషలో పట్టబద్రులు.  గ్రాఫిక్ డిజైన్ లోనూ మంచి ప్రావీణ్యం వుంది. కాస్ట్యూమ్ డిజైన్ లోనూ, గ్రాఫిక్ డిజైన్ లోనూ నిష్ణాతురాలైన తన శ్రీమతి లతగారితో పాటు పలువురు వ్యక్తులు ఎంతో శ్రద్ధతో సహాయ హస్తం అందివ్వడంతో “పెళ్లి చూపులు” చిత్రం దిగ్విజయంగా శత దినోత్సవం జరుపుకుందని చిత్ర నిర్మాణం ప్రారంభించే ముందు షుమారు 6 నెలలు స్టొరీ బోర్డులతో సహా ప్రణాళికా బద్ధమైన ప్రక్రియను అనుసరించడం జరిగిందని శ్రీ తరుణ్ చెప్పారు.

ఆస్ట్రేలియా తనకి రెండో గృహంగా భావిస్తున్నానని ఇక్కడ చాలామంది చుట్టాలు, బంధువులు వుండడం వలన  చిన్నప్పటినుండి ఆస్ట్రేలియా గురించి ఇక్కడి వాతావరణం, అందమైన ప్రదేశాలు ముచ్చట గొలుపుతుంటాయని శ్రీ తరుణ్ చెప్పారు.  అవకాశం వుంటే తప్పకుండా ఆస్ట్రేలియా న్యూ జిలాండ్ దేశాల్లో ఒక సినిమాని చిత్రీకరిస్తానని కూడా చెప్పారు.

ప్రస్తుతం చిత్రసీమ రంగంలో పెను మార్పులు వస్తున్నాయని, పలువురు దర్శకులు, నిర్మాతలు నాణ్యమైన కధావస్తువుకి ప్రాధాన్యం ఇస్తూ సినీ స్వర్ణయుగానికి బాటలు వేస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేసారు.

Send a Comment

Your email address will not be published.