తుత్తి ఏవీఎస్ ఇక లేరు

మీ ఇంట్లో గోడ ఉందా? గోడ మీద బల్లి ఉందా ? అంటూ వరస ప్రశ్నలతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన తుత్తి ఏవీఎస్ ఇక లేరు. తీవ్రమైన కాలేయ, మూత్ర పిండాల సంబంధిత వ్యాధితో పది రోజులుగా ఆస్పత్రి లో ఉన్న ఏవీఎస్ శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాలకి హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో మృతి చెందారు.

ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. ఇదే ఏవీఎస్ అసలు పేరు. ఈయన స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. ఏ.వీ.ఎస్. మొదట జర్నలిస్ట్ గా తన జీవితాన్ని ప్రారంభించారు. పాత్రికేయుల హక్కుల కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. రచనా వ్యాసంగం పట్ల ఉన్న మక్కువతో ఆయన సినిమారంగంలోకి ప్రవేశించారు. తర్వాత నటనలోకి ప్రవేశించారు. హాస్య నటుడిగా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఎస్. వి. కృష్ణా రెడ్డి, ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం లో వచ్చిన పలు సినిమాల్లో ఆయన నటించారు. ముఖ్యంగా ఎస్.వి. కృష్ణారెడ్డి దర్శకత్వం లో వచ్చిన శుభలగ్నం, మాయలోడు, యమలీల, మావిచిగురు, ఊయల, ఆహ్వానం వంటి సినిమాల్లో ఏ.వి.ఎస్. నటన ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోయింది.

హాస్య నటుడి గా ఉన్నత స్థితిలో ఉన్నప్పుడే ఆయన సినిమా నిర్మాణం, దర్శకత్వం వైపు వెళ్లారు. అయితే అవి రెండు సక్సెస్ కాక పోవడం తో తిరిగి నటన వైపే దృష్టి పెట్టారు.
ఏ.వి.ఎస్. మొదటి సారిగా 2008 లో తీవ్ర అస్వస్తతకి గురయ్యారు. అకస్మాత్తు గా రక్తపు వాంతులు చేసుకోవడం తో హుటాహుటిన ఆస్పత్రిలో చేర్చారు. కాలేయ సంబంధ సమస్య ఉందని డాక్టర్లు చెప్పడంతో ఆయన కుమార్తె ప్రశాంతి ఆయనకి కాలేయ దానం చేయడంతో ప్రమాదం నుంచి బైటపడ్డారు. ఆ తర్వాత ఐదు సంవత్సరాలు ఆరోగ్యం గానే ఉన్న ఆయన తన ఆరోగ్యం పట్ల ఈమధ్య నిర్లక్ష్యం చూపారు. మందులు వేసుకోక పోవడం, డాక్టర్లు చెప్పిన సమయానికి పరీక్షలు చేయించు కోకపోవడంతో వ్యాధి తిరగ పెట్టింది. దీనితో పాటు మూత్ర పిండాల సమస్య కుడా ఉండడంతో కోలుకోలేక పోయారు. గత పది రోజుల నుంచి హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రి లోనే ఉన్నారు. డాక్టర్లు ఆయన్ని ఐ. సీ. యు లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. అయితే పరిస్తితి విషమించడంతో ఇంటికి తీసుకు వెళ్ళమని కుటుంబ సభ్యులకి డాక్టర్లు సూచించారు. దాంతో మణికొండ లోని శివాజీ నగర్ కాలనీ లో ఉన్న దేవుల పల్లి అపార్ట్ మెంట్స్ కి తరిలించిన కాసేపటికే ప్రాణం పోయింది. ఆయనకి భార్య ఆసశ కుమారుడు ప్రదీప్, కుమార్తె ప్రశాంతి ఉన్నారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృత దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకి సంతాపాన్ని తెలియ చేశారు.

Send a Comment

Your email address will not be published.