తెలుగు సినిమాలు చాలా బాగుంటాయి

మామూలుగా అయితే ఓ సెలబ్రిటీ ఒక కార్యక్రమానికి వస్తున్నారంటే నిర్ణీత సమయానికి పరుగులు పెట్టక్కరలేదని, తాపీగా వెళ్తే చాలనుకునే వారికి ఓ భిన్నమైన పరిస్థితి నెలకొంది. జూలై 27వ తేదీన హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ లోని ఒక షాపింగ్ మాల్ కు బాలీవుడ్ నటుడు, నిర్మాత జాన్ అబ్రహాం రావలసిన సమయానికన్నా పది నిముషాలు ముందే వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన అక్కడ ఉన్నట్టు తెలియడంతోనే ఎందరు గుమిగూడారో చెప్పడం కష్టం. వారిలో ఎక్కువ మంది యువతులే కావడం గమనార్హం. హైదరాబాద్ అమ్మాయిలకు జాన్ అబ్రహాం బాగానే తెలుసు. రాకీ హ్యాండ్ సమ్ అనే సినిమా షూటింగ్ నిమిత్తం జాన్ అబ్రహాం హైదరాబాద్ లో ఉంటున్నారు.

హైదరాబాద్ హలీమ్ రుచి చూసేరా అని అడగగా మాంసం, నూనె లేని హలీమ్ తయారు చేసిస్తే తానూ రుచి చూస్తానని జాన్ అబ్రహాం జవాబిచ్చారు. తాను 23 సంవత్సరాల నుంచి మాంసాహారం తినడం లేదని, ఫీట్ నెస్ పై ఎంతో శ్రద్ధ చూపిస్తున్నానని అంటూ….తాను నాలుగు వారాలుగా హైదరాబాదులో ఉంటున్నప్పటికీ నగరాన్ని పూర్తిగా చూసే టైం లేకుండా ఉందని, షూటింగ్ కి అటూ ఇటూ ఫిట్నెస్ దృష్ట్యా ఎటూ కదలడం లేదని అన్నారు. ఇక్కడ కేవలం ఒక్క రెస్టారంటుకే వెళ్తున్నానని చెప్పారు.

ఫీట్ నెస్ ఆయనకు ఒక మతం. అలాగని ఆయన మరే మతాన్నీ విమర్శించడం లేదు. ప్రతి ఒక్కరూ జిమ్ ని ఒక ఆలయంలా భావించి అక్కడకు వెళ్లి శారీరక వ్యాయామాలు చేయాలి అంటారు.

ఏ స్క్రిప్టులో ఎంత సరకు ఉందో లేదో ఆయన బాగా తెలిసిపెట్టుకున్నారు. 20 ఏళ్ళ పడుచుపిల్లలతో ఇప్పటికైతే నటించడం లేదని చెప్పిన జాన్ అబ్రహాం తాను సమర్పించే తదుపరి చిత్రం పేరు 1911 అని, ఈ చిత్రంలో కథంతా ఫుట్ బాల్ మీదే సాగుతుందని అన్నారు.

దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గురించి మాట్లాడుతూ ఆయన మంచి మనిషని, తన పార్ట్ నర్ అని అన్నారు. తమ మధ్య ఒక స్క్రిప్ట్ మీద చర్చలు జరిగిన మాట వాస్తవమని, కానీ ఇప్పటికింకా ఫైనల్ కాలేదని అన్నారు.

తెలుగు సినిమాలు చాల బాగుంటాయని, వాటిని అంత సులభంగా రీమేక్ చెయ్యలేమని జాన్ అబ్రహాం అన్నారు. తెలుగు భాష తనకు తెలియదని, టాలీవుడ్ లో మహేష్ బాబు, ప్రభాస్, నాగార్జున వంటి మేటి హీరోలు ఉన్నారని ఆయన ఒక ప్రశ్నకు జవాబిచ్చారు.

Send a Comment

Your email address will not be published.