తేజస్వీ ఐస్ క్రీం

మనం, హార్ట్ అటాక్ తదితర చిత్రాల్లో నటించిన తేజస్వి ఇప్పుడు ఐస్ క్రీం చిత్రంలో కథానాయిక పాత్రలో నటిస్తోంది.  ఐస్ క్రీం చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
తేజస్వి నటించిన చిత్రాలను రామ్ గోపాల్ వర్మ తిలకించారు. ఆ తర్వాత ఆయన తేజస్వి కి ఫోన్ చేసి “మనం కలుద్దాం” అన్నారు.
ఆయన మాటగా తేజస్వి రామ్ గోపాల్ వర్మను కలవడానికి వెళ్ళింది. అప్పుడు ఆయన “ఒక చిత్రంలో మంచు విష్ణు భార్యగా నువ్వు నటించబోతున్నావు….ఒక సన్నివేశం నేను చెప్తాను….నువ్వు ఆ సన్నివేశానికి ఎలా డైలాగులు చెప్తావో  చూస్తాను” అని తేజస్వితో చెప్పారు. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ ఒక్క డైలాగూ చెప్పరు.
రామ్ గోపాల్ వర్మ చెప్పిన సన్నివేశాన్ని మనసులో పెట్టుకుని తేజస్వి కొన్ని డైలాగులు అప్పటికప్పుడు అల్లుకుని నటించింది. ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. రెండు రోజులు అయ్యింది. ఆయన నుంచి ఫోన్ కాల్ రాలేదు. ఆమె నమ్మకం సడలింది. అయితే మూడో రోజు ఆయన నుంచి తేజస్వికి కాల్ వచ్చింది….”మనం మళ్ళీ కలుస్తున్నాం” అని. ఆమె నటించిన తీరు, చెప్పిన డైలాగుల తీరు ఆయనకు నచ్చాయి.
ఆ వెంటనే ఆమె రామ్ గోపాల్ వర్మను కలిసింది. ఆయన తాను తియ్యబోయే ఐస్ క్రీం ప్రాజెక్ట్ గురించి చెప్పి ఏ పాత్రలో నటించాలో వివరించారు. ఆమె అందుకు సరేనని ఒప్పుకుంది.
ఐస్ క్రీంలో తనకు ఈ విధంగా నటించే అవకాశం వచ్చిందని తేజస్వి  చెప్పింది. ఆయన ఒక్క డైలాగూ ఇవ్వకుండా మనల్నే మాటలు చెప్పి నటించమని అడగటం కొత్తగా అనిపించినా తాను ఆ పరీక్షలో గెలిచానని ఆమె చెప్పింది. అందుకు ఎంతో ఆనందంగా ఉందన్నాది. ఐస్ క్రీం చిత్రంలో తన జోడీగా నవదీప్ నటిస్తున్నారని, ఆయన అప్పటికప్పుడు డైలాగులు చెప్పే తీరు తనను ఎంతో ఆకట్టుకుందని ఆమె తెలిపింది. నవదీప్ తో వర్క్ చెయ్యడం ఓ గొప్ప అనుభవమని చెప్పింది.
రాంగోపాల్ వర్మ ఒక సజీవ విజ్ఞాన సర్వస్వమని, మనం ఏది అడిగినా వెంటనే జవాబు చెప్తారని, అది తనను ఆశ్చర్యపరచిందని తేజస్వి  చెప్పింది.
ఈ సినిమాలో తాను మేకప్ లేకుండా ఇంట్లో ఎలా ఉంటానో అలాగే తన సినిమాలో నటించాలని రామ్ గోపాల్ వర్మ చెప్పారని, సినిమా అంతా అలాగే సాగిందని, కనుక ఈ చిత్రం ఎంతో నేచురల్ గా వచ్చిందని చెప్పింది.
నటుల నుంచి ఏది ఎలా రాబట్టుకోవాలో ఆయనకు బాగా తెలుసునని ఆమె రామ్ గోపాల్ వర్మ శైలిని కొనియాడింది. షూటింగ్ అప్పుడు షాట్ కీ షాట్ కీ మధ్య పెద్దగా బ్రేక్స్ ఉండవని ఆమె తెలిపింది.

Send a Comment

Your email address will not be published.