తొలి జానపద చిత్రం 'రత్నమాల'

Ratnamala Telugu_film)డెబ్బయ్ సంవత్సరాల క్రితం వచ్చిన చిత్రం రత్నమాల. ఇది జానపద చిత్రం. భరణి సంస్థ వారు నిర్మించిన చిత్రం. ఈ చిత్రం 1947లో నిర్మాణం జరిగినా 1948 జనవరి రెండో తేదీన విడుదల అయింది. ఇదొక కాకమ్మ కథే కావచ్చు. కానీ ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది అనడం అతిశయోక్తి కాదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ….

భానుమతి రామకృష్ణ. ఈ చిత్రం రావడానికి ముందే భానుమతి తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.

ఆమె అందం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అయింది అనడంలో సందేహం లేదు.

ఆమె మొట్టమొదటిసారిగా 1939లో వెండితెరకు పరిచయమైంది. ఆ ఏడాది సి. పుల్లయ్య గారు భానుమతిని పరిచయం చేశారు. ఆమె పుష్పవల్లితో కలిసి నటించారు. కానీ స్వర్గసీమ సినిమా వరకు కూడా భానుమతి చిన్న చిన్న పాత్రల్లోనే నటిస్తూ వచ్చారు. స్వర్గసీమ చిత్రం విడుదల అయ్యే వరకు కూడా భానుమతి గారిది ఇదే పరిస్థితి.

భానుమతి క్రిష్ణ ప్రేమ అనే చిత్రం చేస్తున్నప్పుడు ఆమె రామకృష్ణగారితో ప్రేమలో పడి ఆయననే పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత రామకృష్ణ దంపతులు కలిసి సొంతంగా ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేయాలనుకుని అందుకు తగిన సన్నాహాలు చేసుకున్నారు. మరోవైపు, వీరికి ఓ కొడుకు పుట్టాడు. అతనికి భరణి అనే పేరు పెట్టారు. ఈ పేరు మీదే తామనుకున్న సినీ సంస్థకు భరణి అని నామకరణం చేశారు. ఈ సంస్థ మీదే వారు మొదటగా ప్రాంభించిన చిత్రం రత్నమాల.

ఈ చిత్రంలో కథా పరంగా రత్నమాల ఓ రాజకుమారి. ఆమె ఓ చిన్నపిల్లవాడిని పెళ్ళి చేసుకోవలసి వస్తుంది. అయితే ఆమె తన పాతివ్రత్యంతో అతనిని ఓ యువకుడైన భర్తగా మార్చుకోగలుగుతుంది. ఈ చిత్రంలో భానుమతి ఓ బ్యాంకు ఉద్యోగితో నటించారు. ఆయన పేరు సూర్యనారాయణ. కానీ ఇక్కడో విషయం మరచిపోకూడదు. భానుమతితో కలిసి సూర్యనారాయణ నటించి ఉండవచ్చు. కానీ అతనిని చిత్ర కథానాయకుడిగా చెప్పడానికి వీల్లేదు. కారణం, అతను ఒక స్వప్న సన్నివేశంలో తప్ప మరెక్కడా కనిపించరు. ఆ స్వప్న సన్నివేశంలో భానుమతి తాను పెళ్ళాడిన పసివాడిని ఓ యువ భర్తగా కలగంటుంది. అంతకు మించి సూర్యనారాయణ పాత్ర లేదు. ఈ చిత్రంలో ఎక్కువసేపు కనిపించేది సీఎస్ఆర్. ఆంజనేయులు, గోవిందరాజుల సుబ్బారావు. ఇక అక్కినేని నాగేశ్వరరావు ఓ చిన్నపాత్రలో కనిపిస్తారు. హేమలత, సీతారాం, బేబీ సుమిత్ర తదితరులు కూడా ఈ చిత్రంలో నటించారు. న్యాపతి రాఘవరావు శివుడిగా నటించారు.

స్వప్నసన్నివేశంలో ఓ పాట ఉంది. ఆ పాటను భానుమతి ఘంటసాలతో కలిసి పాడారు. ఓహో ….మా ప్రేమధారా, జీవనతారా Bhanumati…అంటూ సాగుతుంది ఈ పాట. సూర్యనారాయణ పాత్ర పేరు చంద్రకాంత్.
ఈ సన్నివేశంలో కనిపించిన సూర్యనారాయణ కొంతకాలానికి ఊహించని రీతిలో హత్యకు గురవడం అందరినీ కలవరపరచింది. ఆయన ఓ రోజు బ్యాంకు నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఆయనను ఎవరో హత్య చేశారు.
ఇలా ఉండగా, రత్నమాల చిత్రానికి దర్శకుడు భానుమతి భర్త రామకృష్ణే. ఆయనే స్క్రీన్ ప్లే కూడా రాశారు. అంతకుముందు వరకూ ఆయన అసిస్టెంట్ డైరెక్టురుగా వర్క్ చేశారు.

ఈ చిత్రానికి సముద్రాల సీనియర్ మాటలు రాశారు. పాటలు కూడా ఆయనే రాశారు. అయితే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఆయన పేరు మీద పాటలు రాసినట్లు కూడా ఓ మాట ప్రచారంలో ఉంది. సీఆర్. సుబ్బురామన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. భానుమతి, ఘంటసాల, బేబి సరోజిని, కె. జమునారాణి, సీఎస్ఆర్ ఆంజనేయులు తదితరులు పాటలు పాడారు. నృత్య దర్శకుడు వేదాంతం రాఘవయ్య.

రత్నమాలలో పాటలు పూర్తిగా సంప్రదాయకమైనవి కావు. అయినా అవి బాగానే ఆదరణ పొందాయి. ఈ చిత్రంలో భానుమతి పాడిన పాటలన్నీ పలువురి నోటా నానాయనడం అతిశయోక్తి కాదు.
– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.